* కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఆర్థిక రంగంపై మరోసారి తన ప్రభావాన్ని కచ్చితంగా చూపిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా స్టాక్ మార్కెట్‌లో పలు కంపెనీల షేర్లు నేలకేసి చూస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల భయంతో స్టాక్ మార్కెట్‌లో కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. కోవిడ్ ఉధృతి, లాక్‌డౌన్ విధింపు చర్యలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. కరోనా కేసుల కట్టడికి పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ను ప్రకటిస్తుండగా, ఇప్పటికే ముంబై, ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలు ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయాయి. నిన్న ఒక్కరోజే సూచీల రెండు శాతం పతనమవ్వడంతో రూ.3.53 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయాయి. ప్రముఖ ఫార్మా కంపెనీల షేర్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.
* ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న నెక్స్‌జూ మొబిలిటీ రోడ్‌లార్క్ పేరుతో సూపర్ లాంగ్ రేంజ్ ఈ-సైకిల్‌ను తయారు చేసింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ స్థాయిలో నడిచే ఈ-సైకిల్ భారత్‌లో ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. ధర రూ.42,000. మూడు నాలుగు గంటల్లో చార్జింగ్ పూర్తి అవుతుంది. ఆరు రకాల రైడింగ్ మోడ్స్, డ్యూయల్ డిస్క్ ఎలక్ట్రిక్ బ్రేక్స్, డ్యూయల్ లిథియం అయాన్ బ్యాటరీ సిస్టమ్, 26 అంగుళాల కాటన్ ట్యూబ్ టైర్స్ ఏర్పాటు ఉంది. కోల్డ్ రోల్డ్ స్టీల్‌తో తయారైంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. ఇది నాలుగు రంగుల్లో లభిస్తుంది. నెక్స్‌జూ పోర్టల్ ద్వారాగాన్నీ దేశవ్యాప్తంగా ఉన్న 90 టచ్ పాయింట్లలో రోడ్‌లార్క్‌ను కొనుగోలు చేయవచ్చు.
* మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా గ్యాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 16 జిల్లాల్లో పైపుల ద్వారా సహజ వాయువును (పీఎన్‌జీ) గృహాలకు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేయనుంది. ఎల్‌పీజీతో పోలిస్తే పీఎన్‌జీ ధర 35–40 శాతం తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక వాహనాల కోసం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) స్టేషన్లను సైతం ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్టు కోసం సంస్థ రూ.5,000 కోట్లు వెచ్చించనుంది. ఇందులో ఇప్పటికే రూ.1,100 కోట్లు ఖర్చు చేసింది. 2019లో మొదలైన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను మేఘా గ్యాస్ 2026కి పూర్తి చేయాల్సి ఉంటుంది.
* కరోనా మరోసారి విజృంభిస్తుండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాత్రి 9 తర్వాత దుకాణాలు, హోటళ్లు, బార్లు మూత పడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూవీ థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగింది. బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా థియేటర్లను మూసివేయనున్నట్లు ఈ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ‘వకీల్‌సాబ్’ ప్రదర్శించే థియేటర్లు మినహా మిగతావి మూసివేయాలని నిర్ణయించారు. కరోనా ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు.