* ప్రేమ పేరుతో యువతిని ఇంటి నుంచి తీసుకెళ్లాడనే కారణంతో జరిగిన దాడిలో యువకుడి తండ్రి మృతిచెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాలలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దేవదానం, జ్యోతి దంపతుల కుమారుడు శ్రీకాంత్ (20), అదే గ్రామానికి చెందిన యువతి(19) గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 19న శ్రీకాంత్, యువతి గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పరువు పోయిందనే కారణంతో యువతి తండ్రితో పాటు కుటుంబ సభ్యులు.. శ్రీకాంత్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో అతడి తండ్రి దేవదానం ఇంట్లోనే మృతి చెందారు. యువతి బంధువులు దేవదానంపై దాడి చేయడంతోనే మరణించాడని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న నాంపల్లి సీఐ శ్రీనివాసరెడ్డి, చింతపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామం నుంచి వెళ్లిపోయిన శ్రీకాంత్, యువతి జరిగిన విషయం తెలుసుకొని చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు సమాచారం.
* తమిళనాడులోని తూత్తుకుడిలో రూ.1000 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నుంచి వీవోసీ పోర్టుకు వచ్చిన ఓ నౌకలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో నౌకలోని టింబర్ కిందిభాగంలో భారీ మొత్తంలో కొకైన్‌ను గుర్తించారు. బ్యాగుల్లో ఉన్న మొత్తం 400 కేజీల కొకైన్‌ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వీటి మొత్తం విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1000 కోట్ల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మాదకద్రవ్యాలు ఎక్కడినుంచి వచ్చాయి? ఎక్కడకు తరలిస్తున్నారన్న…తదితర అంశాలపై దర్యాప్తు ప్రారంభించారు.
* పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన విజయ తన కుమారుడు హర్షవర్ధన్(3), కుమార్తె శ్రీకృతి(14 నెలలు)తో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, ఆడపడుచు వేధింపుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడిందని విజయ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త, ఆడపడుచును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి డీసీపీ రవీందర్ తెలిపారు.
* అమ్మానాన్నలు మందలించారని కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిందా బాలిక.. ఆమెను కాపాడే యత్నంలో తండ్రి మృతిచెందారు. ఈ విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. హంసవరం గ్రామానికి చెందిన జయదేవ్(45), అప్పలకొండ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. భార్యాభర్తలిద్దరూ మంగళవారం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చారు. తాము వచ్చే సరికి అన్నం వండ వచ్చుకదా అని పెద్దకుమార్తెను మందలించారు. మనస్తాపానికి గురైన బాలిక ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్లడాన్ని జయదేవ్ గమనించారు. వెంటనే ఆయన మరో ద్విచక్రవాహనంపై కుమార్తె వెంట వెళ్లారు.
* తెలంగాణలో నిన్నటి నుంచి అమలవుతున్న రాత్రి కర్ఫ్యూలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారంటూ నకిలీ వీడియోలు పెట్టిన ఓ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్‌పై కేసు నమోదైంది. అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. ప్రజల్లో ఆందోళన సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
* అసలే నిరుద్యోగం పెరిగిపోతోంది.. నిరుద్యోగులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తరుణమిది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఉద్యోగి ఏకంగా రెండు పోస్టుల్లో కొనసాగుతూ.. రెండు ఆదాయాలు పొందుతూ.. ప్రభుత్వాలను మోసం చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. తపాలాశాఖలో పోస్టుమాన్, అటు నగరపాలక సంస్థ సచివాలయంలోనూ విధులు నిర్వహిస్తున్నాడు. అనంతపురం నగరం జార్జిపేట తపాలా కార్యాలయంలో పోస్టుమాన్ ఉద్యోగి ఒకరు ఇటీవలే నగరపాలక సంస్థ సచివాలయంలో ఉద్యోగానికి అర్హత సాధించాడు. అధికారులకు తెలియకుండా తరచుగా సెలవులు పెట్టి రెండు ఉద్యోగాల్లోనూ కొనసాగుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు తపాలా కార్యాలయంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధినిర్వహణలో ఉండాలని నిబంధన ఉంది. ఈ విషయంపై జార్జిపేట పోస్టుమాస్టరు రాఘవయ్య మాట్లాడుతూ.. పోస్టుమాన్ ఇటీవలే రెండ్రోజులు సెలవుపై వెళ్లాడని, మళ్లీ సెలవుకోసం దరఖాస్తు చేసుకున్నాడన్నారు. పోస్టుమాన్ సెలవులో ఉన్నపుడు మరో ఉద్యోగితో పోస్టు బట్వాడా జరిగేలా చూస్తున్నామన్నారు. సచివాలయంలో ఉద్యోగం చేస్తున్న విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు.