ప్రతి సినిమాకు కొత్త కథల్ని ఎంచుకుంటూ, పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ బాలీవుడ్‌లో విలక్షణ నాయికగా పేరు తెచ్చుకుంది పంజాబీ సుందరి తాప్సీ. గత కొన్నేళ్లుగా ఆమె చేస్తోన్న సినిమాలు విమర్శకుల ప్రశంసలందుకుంటున్నాయి. మన్‌మర్జియా, పింక్, బద్లా, మిషన్‌మంగళ్ వంటి సినిమాలు హిందీ చిత్రసీమలో తాప్సీ స్థానాన్ని సుస్థిరం చేశాయి. ప్రస్తుతం ఈ సుందరి బాలీవుడ్‌లో రష్మీ రాకెట్, లూప్‌లపేటా, దోబారా, శభాష్ మిత్తు వంటి మహిళా ప్రధాన ఇతివృత్తాల్లో నటిస్తోంది. పాత్రలపరంగా కొత్తదనం చూపించడానికి ఎలాంటి కసరత్తులు చేస్తారని తాప్సీని ప్రశ్నించగా..‘ప్రస్తుతం నేను పూర్తి భిన్నమైన జోనర్ సినిమాల్ని చేస్తున్నా. ప్రతి పాత్ర ఎమోషనల్ జర్నీలా ఉంటుంది. సెట్స్‌మీదకు వెళ్లే ముందే నా పాత్రలోని సంక్లిష్టతల్ని అర్థం చేసుకుంటా. సినిమా పూర్తయ్యే వరకు ఆ పాత్రతో సహానుభూతి చెందే ప్రయత్నం చేస్తా. షూటింగ్ పూర్తయిన తర్వాత ఓ వారం పాటు బ్రేక్ తీసుకొని సినిమా తాలూకు ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తా. అలా సినిమాల మధ్య విరామం తీసుకోవడం వల్లే ప్రతి పాత్రలో రాణించగలుగుతున్నా. కథలో నవ్యత ఉంటేనే నటిగా ప్రతిభను ప్రదర్శించవొచ్చని నమ్ముతాను. అందుకే రొటీన్ కథల్ని నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నా’ అని తాప్సీ చెప్పింది.
మధ్యే మధ్యే విరామం….
Related tags :