Health

నాలుగు రాష్ట్రాల్లో ఉచిత టీకా-తాజావార్తలు

These four states in India to get free  COVID vaccine

* దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన వేళ వైరస్‌ను తరిమికొట్టగల వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్రం మరింత విస్తరించింది. మే 1వ తేదీ నుంచి 18ఏళ్లు పైబడిన వారందరూ టీకాలు తీసుకోవచ్చని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై పలు రాష్ట్రాలు కీలక ప్రకటనలు చేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా టీకా ఖర్చులు తామే భరిస్తామని ప్రకటించాయి. ఇప్పటికే ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తామని ఉత్తరప్రదేశ్‌, అస్సాం రాష్ట్రాలు ప్రకటించగా.. తాజాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ కూడా ఈ జాబితాలో చేరాయి.

* కరోనా ఉద్ధృతితో ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, తాము నిస్సహాయులుగా మారామని ముంబయికి చెందిన ఓ వైద్యురాలు డా.తృప్తిగిలాడి భావోద్వేగానికి గురయ్యారు. మాస్కు ధరించి జాగ్రత్తలు పాటిస్తేనే ఈ ఉపద్రవం నుంచి బయటపడతామని సూచించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘దేశంలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలను కరోనా చట్టేసింది. ముఖ్యంగా ముంబయిలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి.

* మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి బయట ఆక్సిజన్‌ ట్యాంకర్‌ లీక్‌ అవడంతో.. రోగులకు ప్రాణవాయువు సరఫరా నిలిచిపోయింది. దీంతో 22 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. నాసిక్‌లోని జాకీర్‌ హుస్సేన్‌ మున్సిపల్‌ ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

* తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30కి.మీ. నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ రోజు ఉత్తర-తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్‌ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5కి.మీ. ఎత్తులో ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

* భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ సమర్థంగా పనిచేస్తోందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) నేడు ప్రకటించింది. సార్స్‌కోవ్‌-2, దానిలో కొత్తగా వచ్చిన మ్యూటెంట్‌ రకాన్ని కూడా అడ్డుకుంటోందని పేర్కొంది. విజయవంతంగా యూకే, బ్రెజిల్‌,దక్షిణాఫ్రికా రకం వైరస్‌లను బంధించి కల్చర్‌ చేసినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. యూకే,బ్రెజిల్‌ వేరియంట్లను కొవాగ్జిన్‌ బలంగా నిలువరించినట్లు పేర్కొంది.

* తమిళనాడులోని తూత్తుకుడిలో రూ.1000 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నుంచి వీవోసీ పోర్టుకు వచ్చిన ఓ నౌకలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో నౌకలోని టింబర్ కిందిభాగంలో భారీ మొత్తంలో కొకైన్‌ను గుర్తించారు. బ్యాగుల్లో ఉన్న మొత్తం 400 కేజీల కొకైన్‌ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

* తిప్పతీగ.. పల్లెల్లో ఎక్కువగా చూస్తుంటాం. పట్టణ శివార్లలోనూ, రోడ్ల పక్కన పొదల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇన్నాళ్లూ ఈ తీగ గొప్పదనం ఎక్కువమందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ కరోనా పంజా విసుతురున్న వేళ కచ్చితంగా తెలుసుకొని తీరాలి. తిప్పతీగను అమృత, గుడూచి అని కూడా అంటారు. తమలపాకు రూపంలో చిన్నగా ఉండే ఈ ఆకులో విశేషమైన వైద్య గుణాలు ఉన్నాయని చాలా మందికి తెలిసిఉండదు. కానీ ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో దీనిగురించి తెలుసుకోవాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

* నిత్యం మన ఇన్‌బాక్స్‌ని రకరకాల మెయిళ్లు ముంచెత్తుతుంటాయి. అనవసర మార్కెటింగ్‌ ఈమెయిళ్లూ చాలానే వస్తుంటాయి. అన్నీ సురక్షితమైనవి కాకపోవచ్చు! ఇవి మనల్ని ట్రాక్‌ చేస్తుండొచ్చు. మెయిల్‌లోని ఇమేజ్‌లు లేదా లింకుల్లో పిక్సల్‌ ట్రాకర్స్‌ దాగి ఉండొచ్చు! మెయిల్‌ని ఓపెన్‌ చెయ్యగానే పిక్సెల్‌లో ఉన్న కోడ్‌ మెయిల్‌ను ఎప్పుడు ఓపెన్‌ చేశారు? ఎక్కడ నుంచి ఓపెన్‌ చేశారు? లాంటి వివరాల్ని కంపెనీ సర్వర్లకి పంపే అవకాశం ఉంది. ఇందుకోసం డెస్క్‌టాప్, ఐఓఎస్, ఆండ్రాయిడ్‌ వేరియంట్లలో సెట్టింగ్స్‌ మార్చుకోవాల్సి ఉంటుంది. అదెలాగో చూద్దామా?

* టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి ఓ సెంటిమెంట్‌ ఉందని మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా వెల్లడించాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో ముచ్చటించిన వేళ ఈ విషయాన్ని బహిర్గతం చేశాడు. అందువల్లే మ్యాచ్‌లకు ముందు ధోనీ తన జట్టు ఆటగాళ్లకు గుడ్‌లక్‌ లేదా బెస్టాఫ్‌లక్‌ చెప్పడన్నాడు.

* కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. హైకోర్టు చెప్పినా.. లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్‌ ఎన్నికలను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతోందని ధ్వజమెత్తారు. వివిధ పార్టీలు ఇప్పటికే నగరపాలక ఎన్నికలను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాయన్నారు. బాధ్యతాయుతంగా ఆలోచించి కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని కోరారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని పరిస్థితులపై వెంటనే స్పందించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.

* రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వారం రోజుల్లోగా 4లక్షలకు పైగా రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పలువురు రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తిదారులతో కేటీఆర్‌ చర్చించారు. రెమ్‌డెసివిర్‌ లభ్యత, ఉత్పత్తి, సరఫరా సంబంధిత అంశాలపై వారితో చర్చించారు. వారం రోజుల్లోగా అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు కేటీఆర్ చెప్పారు.

* గుంటూరు జిల్లా కోర్టులో పలువురు కరోనా బారిన పడ్డారు. మొత్తం 17 మందికి వైరస్‌ సోకింది. వీరిలో న్యాయమూర్తులు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయవాదులున్నారు. కొవిడ్‌ చికిత్స పొందుతూ కోర్టు అసిస్టెంట్ నాజర్‌గా పనిచేస్తున్న రవి బుధవారం ఉదయం మృతి చెందారు. ముగ్గురు న్యాయమూర్తులు, ఇద్దరు బార్ కౌన్సిల్‌‌ సభ్యులు, 12 మంది న్యాయశాఖ సిబ్బంది కరోనాతో వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. దీంతో జిల్లా కోర్టులో ఒక్కసారిగా కలకలం రేగింది.