Movies

విశాఖ ఉక్కుపై చిరంజీవి ట్వీట్లు

విశాఖ ఉక్కుపై చిరంజీవి ట్వీట్లు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మెగాస్టార్‌ చిరంజీవి సంచలన ట్వీట్‌ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకు సుమారు 100టన్నుల ఆక్సిజన్‌ని ఉత్పత్తి చేసి, లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. అలాంటి కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేట్‌ పరం చేయడం ఎంత వరకు సమంజసం అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.‘దేశమంతా ఆక్సిజన్ దొరక్క కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్నారు. ఈరోజు ఓ స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరింది. అక్కడి నుంచి 150 టన్నుల ఆక్సిజన్‌ని మహారాష్ట్రకు తీసుకెళ్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకి సుమారు 100 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పిత్తి చేస్తుంది. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితిలో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి లక్షల మంది ప్రాణాలని నిలబెడుతోంది. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేట్‌పరం చేయడం ఎంత వరకు సమంజసం??? మీరే ఆలోచించండి’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. కాగా, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రముఖులు తప్పబట్టారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.