Politics

నా మీద సీఐడీ కేసు కొట్టేయండి-తాజావార్తలు

నా మీద సీఐడీ కేసు కొట్టేయండి-తాజావార్తలు

* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియోను మార్ఫింగ్ చేశానని తనపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వేసిన క్వాష్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ అధికారులు తనను ఇరికించేందుకే కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున వాదనలు విన్న న్యాయస్థానం దర్యాప్తు అధికారిని మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిబంధన 41 కింద ఆయనకు రక్షణ కల్పించాలని సూచించింది. ఈనెల 29న మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని దేవినేని ఉమను ధర్మాసనం ఆదేశించింది.

* ప్రజలకు విద్య, వైద్యం అనేవి రాజ్యాంగం కల్పించిన హక్కు అని దానిని కాపాడటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని విమర్శించారు. మీడియాతో గురువారం జీవన్‌రెడ్డి మాట్లాడారు. కొవిడ్‌ రోగులకు సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వాలు దారుణంగా విఫలమవుతున్నాయని ఆరోపించారు. కరోనా నియంత్రణకు వాడే మందుల కొరత ఏర్పడిందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగర్‌ ఉప ఎన్నిక సభతో వేలాదిమందికి కరోనా సోకిందని, అక్కడ కరోనా నిబంధనలు ఉల్లంఘించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. ఈ పరిణామాలకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలన్నారు.

* తెలంగాణలో ఖమ్మం, వరంగల్‌ నగరపాలక సంస్థ ఎన్నికలు (మినీ పోరు) యథావిధిగా జరగనున్నాయి. ఎన్నికల సమయంలో కొవిడ్‌ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్ దృష్ట్యా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి (ఎస్‌ఈసీ) వెల్లడించారు. అధికారులతో చర్చించి ఎన్నికల ప్రక్రియ కొనసాగింపునకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ఆదేశించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించినట్లు చెప్పారు. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం నిలిపివేయాలని వివిధ రాజకీయ పార్టీలకు ఎస్ఈసీ సూచించారు.

* ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఆక్సిజన్‌ కొరత లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏపీలో కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం (కేబినెట్‌ సబ్‌ కమిటీ) కీలక సమావేశం నిర్వహించింది. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని నేతృత్వంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్‌, కన్నబాబు, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ సరఫరా, వైద్యనిపుణుల నియామకం, రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు మంత్రి చెప్పారు.

* కొవిడ్‌ చికిత్సకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే ప్రైవేటు ఆస్పత్రులు అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశించారు. వీటిని పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కరోనా నివారణ చర్యలపై అనంతపురం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. గత ఏడాది మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో తీసుకున్న చర్యలు.. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. గత ఏడాది కరోనా వైరస్‌ అందరికీ కొత్త కావడంతో వైద్యం అందించడం, టెస్టింగ్‌ వంటి విషయాల్లో తడబడ్డామన్నారు. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు మంత్రికి వివరించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులకు అనుగుణంగా పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ అంశంపై మరోసారి సమీక్ష తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. విద్యా సంవత్సరాన్ని కాపాడే ప్రయత్నాన్ని రాజకీయం చేసే రీతిలో నారా లోకేశ్ వ్యాఖ్యలు సరైనవి కాదని మండిపడ్డారు. ఆయన వాస్తవాలు తెలుసుకుని రాజకీయం చేయాలని హితవు పలికారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలోని విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

* దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న కరోనా టీకా కార్యక్రమం పరిధిలోకి కేంద్రం 18ఏళ్లు పైబడిన వారిని కూడా తీసుకువచ్చింది. మే ఒకటి నుంచి వారికి టీకాలు పంపిణీ చేయనుంది. దానిలో భాగంగా వారంతా ఏప్రిల్ 28 నుంచి కొవిన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. అంటే టీకా పంపిణీ ప్రారంభానికి 48 గంటల ముందు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

* ‘‘దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారుతోంది. నేషనల్‌ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను ఎదుర్కొంటోంది’’ అని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి నానాటికీ ఉద్ధృతమవుతున్న వేళ దేశంలో కరోనా నియంత్రణ, నిర్వహణ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. వైరస్‌ కట్టడికి జాతీయ ప్రణాళిక అవసరమన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

* ఏపీలో కొవిడ్‌ నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఈనెల 26లోపు కౌంటర్‌ వేయాలని ఆదేశించింది. కొవిడ్‌ చికిత్స పేరుతో ప్రైవేట్‌ ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ సామాజిక కార్యకర్త తోట సురేశ్‌బాబు గతేడాది సెప్టెంబర్‌లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఎందుకు కౌంటర్‌ దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రాథమిక అంశాన్ని ఎందుకు పట్టించుకోలేదని ఆక్షేపించింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నాటి ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. దేశంలో కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. మెటల్‌, ఫైనాన్షియల్‌ షేర్ల అండతో లాభాల్లోకి వచ్చాయి. దీంతో నిఫ్టీ 14,400 పాయింట్ల ఎగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.95గా ఉంది.

* బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల , నటుడు విష్ణు విశాల్ ఒక్కటయ్యారు. గురువారం మధ్యాహ్నం 1:40నిలకు వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మొయినాబాద్‌ ఈ వేడుకకు వేదికైంది. కరోనా దృష్ట్యా కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది సెప్టెంబరులో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

* కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వివక్షాపూరితంగా, పక్షపాతంతో కూడుకుందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. అంతేకాకుండా దేశ పౌరులకు ఉచితంగా వ్యాక్సిన్‌ అందివ్వాలన్న బాధ్యతను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని పేర్కొంది. 18ఏళ్ల వయసు పైబడిన వారికి ఉచితంగానే వ్యాక్సిన్‌ అందివ్వాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు.

* ఏపీలో ఆక్సిజన్‌ ఉత్పత్తికి లోటు లేదని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఆక్సిజన్‌ విషయంలో ఏపీకే మొదటి ప్రాధాన్యత అని వివరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర అవసరాల తర్వాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తాం. సరఫరా తీరును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించాం. 40 రకాల పరిశ్రమల ద్వారా 510 ఎం.టి.ఆక్సిజన్‌ ఉత్పత్తి జరుగుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నాం’’ అని మంత్రి వివరించారు.

* రాష్ట్రానికి 4లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు ఆర్డర్‌ పెడితే కేవలం 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దీనిపై తాము నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్‌లాగే రెమిడెసివిర్‌ కూడా తమ అధీనంలోనే ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. దీనిపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడినట్లు చెప్పారు.