తానా 2021 ఎన్నికల్లో మాజీ అధ్యక్షుల బలాన్ని అందుకోవడంలో నిరంజన్ ప్యానెల్ ముందంజలో ఉంది. ఇప్పటికే వడ్లమూడి రామ్మోహనరావు ఈ ప్యానెల్‌ను బలపరుస్తున్నట్లు ప్రకటించగా, తాజాగా 1997-99 మధ్య తానా అధ్యక్షుడిగా పనిచేసిన చలసాని మల్లిఖార్జునరావు నిరంజన్ ప్యానెల్‌ను బలపరచవల్సిందిగా కోరుతూ ఓ లేఖను విడుదల చేశారు. తానా 2019 డీసీ సభలకు సంబంధించిన ఆర్థికాంశాలపై బోర్డుకు తాను రాసిన లేఖపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఈ లెక్కలన్నీ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పన్ను దస్తావేజుల మాదిరి గుంభనంగా ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. ఈ మహాసభ్ల్లో $825000 మిగులు ఉంటుందనే తన అంచనాను తలక్రిందులు చేస్తూ కేవలం దానిలో 2-3శాతం మాత్రమే ఉంటుందని వస్తున్న సమాచారంపై ఆయన అసహనం వ్యక్తపరిచారు. తానా మాజీ అధ్యక్షుడిగా సంస్థ అభ్యున్నతిని కాంక్షించే వ్యక్తిగా, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రవాసుడిగా తానాలో ఆర్థిక ప్రగతికి జవాబుదారీదనానికి నిరంజన్ ప్యానెలే సరైనదని తాను విశ్వసిస్తున్నాని ఆయన పేర్కొన్నారు. తానాలో కార్యదర్శి స్థాయితో పాటు పలు కీలక పదవుల్లో సేవలందించిన డల్లాస్‌కు చెందిన యలమంచిలి రాం కూడా నిరంజన్ ప్యానెల్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు.
################