Business

తగ్గిన బంగారం ధర-వాణిజ్యం

తగ్గిన బంగారం ధర-వాణిజ్యం

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల ప్రయాణం శుక్రవారం ఆద్యంతం ఒడుదొడుకులమయంగా సాగింది. ఉదయం 47,863 వద్ద బలహీనంగా ప్రారంభమైన సెన్సెక్స్‌ క్రమంగా పుంజుకుని 48,265 వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీ మళ్లీ నష్టాల్లో జారకుని 47,669 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 202 పాయింట్ల నష్టంతో 47,878 వద్ద ముగిసింది. ఇదే ట్రెండ్‌ కొనసాగించిన నిఫ్టీ 14,326 వద్ద ప్రారంభమై 14,273-14,461 మధ్య కదలాడింది. చివరకు 64 పాయింట్లు నష్టపోయి 14,341 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.05 వద్ద నిలిచింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు దేశీయంగా కరోనా కేసుల విజృంభణ వంటి పరిణామాలు నేడు మార్కెట్లను ప్రభావితం చేశాయి.

* ఓలా ఈ జులైలో ఈ-స్కూట‌ర్ (ఎలక్ట్రిక‌ల్ స్కూట‌ర్‌)ను ప్రారంభించ‌నుంది. వీటికి మ‌ద్ద‌తుగా 400 న‌గ‌రాల్లో ఛార్జింగ్ స్టేష‌న్ల ఏర్పాటుకు ప్ర‌య‌త్నిస్తుంది.మొద‌టి విడ‌త‌గా మొద‌టి ఏడాది ఓలా భార‌త్‌లో 100 న‌గ‌రాల్లో 5,000 ఛార్జింగ్ పాయింట్ల‌ను ఏర్పాటు చేస్తుంది.ఓలా స్కూట‌ర్‌లో ఇన్‌స్టాలేష‌న్ అవ‌స‌రం లేని హోమ్ ఛార్జ‌ర్ ఉంటుంది. ఓలా యొక్క ఛార్జింగ్ స్టేష‌న్లు విడిగానే కాకుండా, షాపింగ్ మాల్స్‌, ఐటీ పార్కులు, ఆఫీస్ కాంప్లెక్స్‌లు, కేఫ్‌లు వంటి ప్ర‌ముఖ ప్ర‌దేశాల‌లో ఏర్పాటుచేయ‌బ‌డ‌తాయి.ఓలా ఎలక్ట్రిక్ స్కూట‌ర్‌ను ఈ ఏడాది జులైలో భార‌త మార్కెట్లో విడుద‌ల చేయాల‌ని యోచిస్తోంది. అంతేగాక 400 న‌గ‌రాల్లో ల‌క్ష ఛార్జింగ్ పాయింట్ల‌తో హైప‌ర్ ఛార్జ‌ర్ నెట్‌వ‌ర్క్‌ ఏర్పాటుకు కూడా కృషి చేస్తోంద‌ని ప్రెస్ ట్ర‌స్ట్ ఆఫ్ ఇండియాకు తెలిపింది. ఎలక్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర వంటి వివ‌రాల‌ను కంపెనీ ఇంకా వెల్ల‌డించ‌లేదు. భార‌త్‌లో కొనుగోలుదారుల‌కు అనువైన ధ‌ర‌కు ల‌భిస్తుంద‌ని ఓలా తెలిపింది. ఎలక్ట్రిక్ స్కూట‌ర్ల‌ విదేశీ మార్కెట్‌కు ఎగుమ‌తి చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుంది.ఛార్జింగ్ నెట్‌వ‌ర్క్ 75 కిలోమీట్ల‌ర్ల ప‌రిధికి 18 నిమిషాల్లో 50% ఓలా స్కూట‌ర్ బ్యాట‌రీని ఛార్జ్ చేయ‌గ‌ల‌దు. గ‌తేడాది ఓలా త‌న మొద‌టి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఫ్యాక్ట‌రీని త‌మిళ‌నాడులో స్థాపించ‌డానికి రూ. 2,400 కోట్ల పెట్టుబ‌డిని ప్ర‌క‌టించింది. కంపెనీ ప్రారంభంలో వార్షిక సామ‌ర్ద్యం 20 ల‌క్ష‌ల యూనిట్లు.

* దేశంలో 18 ఏళ్లు నిండిన పెద్దలందరికీ టీకా వేసేందుకు రూ.67,193 కోట్ల మేర ఖర్చు అవుతుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అభిప్రాయపడింది. ఈ విలువ దేశ జీడీపీలో 0.36 శాతమేనని పేర్కొంది. కొవిడ్‌-19 రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో కేసుల సంఖ్య రోజుకు 3 లక్షలకు పైగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో టీకా పంపిణీ మూడో దశ కార్యక్రమాన్ని మే 1 నుంచి ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా 18 ఏళ్లు మించిన వాళ్లందరూ టీకా తీసుకోవచ్చు. దేశంలోని సుమారు 133.26 కోట్ల జనాభాలో టీకా వేసుకునేందుకు అర్హుల సంఖ్య 84.19 కోట్లకు చేరుతుందని ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. వీళ్లందరికీ టీకా వేసేందుకు రూ.67,193 కోట్లు ఖర్చు కావొచ్చని పేర్కొంది. ఇందులో రూ.20,870 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉండగా.. రాష్ట్రాలు వెచ్చించాల్సింది రూ.46,324 కోట్లు అని తెలిపింది.

* కొత్తగా బ్యాంక్ ఖాతా తీసుకోవాలనుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు అందించింది. ఖాతాదారుల కోసం కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొని వచ్చింది. వీడియో కేవైసీ ఆధారిత అకౌంట్ ఓపెనింగ్ సర్వీసు లాంచ్ చేసింది. ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనో యాప్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త సేవల వల్ల ఖాతాదారులు శాఖకు వెళ్లకుండానే సేవింగ్స్ అకౌంట్ తీసుకోవచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు అని ఎస్‌బీఐ వివరించింది.

* కొద్దీ రోజుల నుంచి భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. నేడు స్వల్ప స్థాయిలో బంగారం ధరలు తగ్గాయి. ఏప్రిల్ 1న రూ.46,152 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.47, 615కు చేరుకుంది. భవిష్యత్ లో ఇంకా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,615గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.250 తగ్గింది. ఇక ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,843 నుంచి రూ.43,615కు తగ్గింది.