NRI-NRT

ఇండియాకు సింగపూర్ ఆక్సిజన్-తాజావార్తలు

ఇండియాకు సింగపూర్ ఆక్సిజన్-తాజావార్తలు

* భారత్ లో కొవిడ్ మహమ్మారి మహోగ్రరూపం ప్రదర్శిస్తున్న వేళ, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో అందుబాటులోని అన్ని ఆక్సిజన్ వనరులను ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో భారత్ కు సింగపూర్ ప్రభుత్వం బాసటగా నిలిచింది. కొవిడ్-19పై పోరాటంలో భారత్ కు తాము అండగా ఉంటామని సింగపూర్ పేర్కొంది. అంతేకాదు, 4 క్రయోజనిక్ ట్యాంకర్ల నిండా ఆక్సిజన్ ను భారత్ కు పంపి తన సహృదయతను చాటుకుంది. ఈ క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లతో భారత వాయుసేన కార్గో విమానం సింగపూర్ లోని చాంగీ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది.

* మహారాష్ట్రలోని యావత్మల్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యావత్మల్‌ జిల్లాలోని వాణి ప్రాంతానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మద్యానికి బానిసయ్యారు. ప్రస్తుతం మద్యం దొరక్కపోవడంతో సదరు వ్యక్తులు హ్యాండ్‌ శానిటైజర్‌ను తాగారు. దీంతో ఆ ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారంతా కూలీలుగా పోలీసులు ధ్రువీకరించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

* వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌ తన చివరి సిరీస్‌ అని టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్‌ మిథాలి రాజ్‌ పేర్కొన్నారు. ‘1971 ది బిగినింగ్‌ ఆఫ్‌ ఇండియా క్రికెటింగ్‌ గ్రేట్‌నెస్‌’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం (వర్చువల్‌ పద్ధతి)లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 21 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నానని, 2022లో న్యూజిలాండ్‌లో జరిగే ప్రపంచకప్‌ తన చివరి సిరీస్‌ అని స్పష్టం చేశారు.

* మే 1నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్న తరుణంలో ఓ ఫేక్‌ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. టీకా వేయించుకొనే ముందు మహిళలు తమ పీరియడ్స్‌ సమయాన్ని చెక్‌ చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతోంది. మహిళలు పీరియడ్స్‌కు 5 రోజుల ముందు, 5 రోజుల తర్వాత టీకా తీసుకోవద్దని, ఆ సమయంలో వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల టీకా తీసుకుంటే ప్రమాదమంటూ జరుగుతున్న ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ దుష్ప్రచారాన్ని మహిళలెవరూ నమ్మొద్దని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విజ్ఞప్తి చేసింది.18 ఏళ్లు పైబడిన వారందరూ మే 1 తర్వాత టీకా వేయించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నెల 28 నుంచి చౌఇన్.గొవ్.ఇన్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపింది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి కర్ఫ్యూకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.* కొవిడ్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ.* తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుంది.* అన్ని కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, రెస్టారంట్లు, హోటళ్లు మూసివేయాలి.* ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, ఫార్మసీలు, అత్యవసర సేవలందించే కార్యాకలాపాలు మాత్రమే కర్ఫ్యూ సమయంలో పనిచేస్తాయి.* ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్లు, ఇంటర్నెట్, కేబుల్ సేవలు, పెట్రోలు పంపులు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థల కార్యాలయాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు.* నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు, ప్రైవేట్‌ సెక్యూరిటీ సేవలు, ఆహార సరఫరా సేవలకూ కర్ఫ్యూ నుంచి మినహాయింపు.* నిర్దేశించిన రంగాలకు చెందిన వ్యక్తులు మినహా మిగతా వారందరి రాకపోకలపై ఆంక్షలు.* వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, అత్యవసర సేవలు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే వ్యక్తుల రాకపోకలకు అనుమతి.* అత్యవసర సరకు రవాణా వాహనాలు, అంతర్రాష్ట్ర సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవు.* ప్రజా రవాణాతో పాటు ఆటోలు ఇతర వాహనాలు నిర్ణీత కర్ఫ్యూ వేళల వరకూ మాత్రమే అనుమతి.

* తాము సేకరించే కరోనా వ్యాక్సిన్లను అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టీకా పంపిణీ విషయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ లేవనెత్తిన అనుమానాలను కేంద్రం నివృత్తి చేసింది. ‘‘భారత్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు టీకాలను రూ. 150 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. అలా సేకరించిన వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తున్నాం. ఇకపై కూడా అది కొనసాగుతుంది’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ నేడు ట్వీట్‌ చేసింది.

* భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పాలకవర్గంపై వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. భారత్‌కు వీలైనంత త్వరగా సాయం అందజేయాలని శ్వేతసౌధానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ సహా ఇతర కొవిడ్‌ టీకాలు, అవసరమైన వైద్య సామగ్రి పంపాలని యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, పలువురు కీలక చట్టసభ ప్రతినిధులు, ప్రముఖ భారతీయ అమెరికన్లు బైడెన్‌ ప్రభుత్వాన్ని కోరారు.