తానా 2021 ఎన్నికలు వాయిదాపడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఐనంపూడి కనకంబాబు పేర్కొన్నారు. TNIతో శనివారం మధ్యాహ్నం బోర్డు చైర్మన్ కోయా హరీష్‌తో కలిసి ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఎన్నికల ప్రక్రియ ఆగలేదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన తానా ఎన్నికల్లో అమెరికా అధికారిక National Change Of Address(NCOA) డేటాబేస్‌తో తానా సభ్యుల చిరునామాలు పరిశీలించలేదని, కానీ ఈ ఏడాది జరుగుతున్న ఎన్నికల్లో కోవిద్ కారణంగా పలువురు ప్రవాసులు నూతన ఉద్యోగాలు లేదా అవకాశాల దృష్ట్యా రాష్ట్రాలు మారడం వలన చిరునామాల్లో ఏర్పడిన లోపాల కారణంగా బ్యాలెట్ల రాక ఆలస్యమవుతోందని వివరించారు.
ఉదాహరణకు:
న్యూజెర్సీకి చెందిన ఒక కుటుంబం డల్లాస్‌కు మారితే తానాకు వీరు సమాచారం ఇవ్వకపోయినా అమెరికా అధికారిక తపాలా శాఖ USPSకు వారిచ్చిన సమాచారం NCOA వద్ద ఉంటుంది. తానా సభ్యుల చిరునామాల పట్టికను సియాటెల్‌కు చెందిన The Election Trust NCOAలో పరిశీలించినప్పుడు సదరు న్యూజెర్సీ కుటుంబం చిరునామా డల్లాస్‌కు చెందినదిగా వెలువడుతుంది. ప్రస్తుతం ముద్రించిన బ్యాలెట్లు డల్లాస్ చిరునామాకు వచ్చినప్పటికీ డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధుల బ్యాలెట్ బదులు న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధుల బ్యాలెట్ వీరికి అందుతుంది. ఈ తప్పును ఎన్నికల కమిటీ ఆఖరి నిముషంలో గుర్తించింది. కేవలం తానాకు మాత్రమే పరిమితమైన Regional Segregation కారణంగా ఇలాంటి లోపాలు కలిగిన బ్యాలెట్లను సరిచేయడానికి సమయం తీసుకోవల్సి వచ్చిందని కనకంబాబు తెలిపారు. ఒకవేళ ప్రాంతీయ ప్రతినిధులకు ఎన్నికలు లేని పక్షంలో ఈపాటికే సభ్యులకు తానా బ్యాలెట్లు అంది ఉండేవి.
చిరునామాల లోపాలు కలిగిన బ్యాలెట్లు సుమారుగా 2700 ఉన్నాయని, అయినప్పటికీ తానా సభ్యుల పూర్తి చిరునామాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల కమిటీ నిర్ణయించినందున కాస్త సమయం పడుతుందని వెల్లడించారు. శుక్రవారంతో తుది పరిశీలన పూర్తి అయిందని, వచ్చే వారం బ్యాలెట్లను తపాలాకు అందిస్తామని ఐనంపుడి పేర్కొన్నారు.
బోర్డు ఛైర్మన్ హరీష్ మాట్లాడుతూ తానా ఎన్నికల వాయిదా పడినట్లు వస్తున్న సమాచారం నిరాధారమైనదని, బోర్డుతో చర్చించి కొత్త తేదీలను ప్రకటిస్తామని ఎన్నికల కమిటీ తెలుపడం వెనుక ఉన్న కారణాన్ని ఆయన వివరించారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి స్థాయిలో బోర్డు ఆమోదం తప్పనిసరి అని….అందుకే నోటిఫికేషన్‌లో ఏప్రిల్ 15 బ్యాలెట్ల పంపిణీ అని పేర్కొన్నాక ప్రస్తుతం బ్యాలెట్లు తపాలాకు అందజేసే తేదీ మారడం కారణంగా ఆ తేదీని మరోసారి ప్రకటించడానికి బోర్డులో చర్చించి ఆమోదిస్తామని హరీష్ పేర్కొన్నారు. ఈ బ్యాలెట్ పంపిణీ తేదీతో పాటు తుది ఫలితాల తేదీ కూడా మార్పు చేయాలా వద్దా అనేది బ్యాలెట్ల ముద్రణ పూర్తి అయ్యాక బోర్డులో చర్చించి త్వరలో ప్రకటన వెలువరిస్తామని వీరు ఇరువురు తెలిపారు.
#################