వ్యాజ్యాలు అంటే వామ్మో అంటూ కేసులంటే కంగారు పడుతూ కోర్టు గుమ్మం తలుచుకుని “గోవిందా!…గోవిందా…!!” అనుకునే సగటు భారత న్యాయార్థి నేడు ఆర్తితో ఆశగా జపిస్తున్న మరో మంత్రం “వేంకటరమణా….సంకటహరణ!” భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి చెందిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు TNILIVE ప్రత్యేక అభినందనలు అందజేస్తోంది. “సుప్రీం” పీఠంపై రెండో తెలుగువాడిగా ఆయన పట్టాభిషేకం కరోనాతో సహా దేశంలో వేళ్లూనుకుపోయిన విపరీత పరిస్థితులను ఎన్నింటినో తెరిపిన పడేయగలదనే ఆశాభావం నేడు జాతి యావత్తును హర్షపులకాంకితం చేస్తోంది!
తెరిచిన పుస్తకం లాంటి జస్టిస్ ఎన్.వి.రమణ జీవిత విశేషాలు, సాధించిన విజయాలు, అనుభవాలు, నిర్వహించిన పదవులు, తెలుగు భాషపై మక్కువ, గ్రామీణ నేపథ్యం తదితరాదులపై ఇప్పటికే ఎనో వార్తా విశేషాలు వెలువడిన నేపథ్యంలో ఈ వార్తాంశం ఆయా విశేషాలకు దూరంగా దేశంలోని న్యాయ వ్యవస్థ వాస్తవిక పరిస్థితులకు దగ్గరగా నిర్మించబడినది. ఇది ఓ సగటు భారతీయుడి ఆవేదన, నివేదన, ఆక్రందన, చేతులు జోడించి వినమ్రంగా చేసుకుంటున్న ప్రార్థన.
ఇండియాలో ప్రస్తుతం ఉన్న న్యాయ వ్యవస్థను ఒక్క వాక్యంలో సమగ్రంగా చెప్పాలంటే “వాదికి నష్టం…ప్రతివాదికి కష్టం…న్యాయవాది అదృష్టం…న్యాయమూర్తి ఇష్టం.” న్యాయం కోరి కోర్టును ఆశ్రయించడమే నేరమైందని, డబ్బూ పోయి శనీ పట్టినట్లయిందని అసంఖ్యాకులు ఆక్రోశించే దురవస్థ నెలకొన్న భారతావనిలో శీఘ్ర న్యాయ వితరణ కొరవడి పెండింగ్ వ్యాజ్యాలు కొండల కింద పిండిగా నలిగిపోతున్న న్యాయార్థుల ఆవేదన వినేది ఎవరు? 130కోట్లకు పైగా పౌరసమాజం కలిగి ఉన్నప్పటికీ ఈ దురవస్థకు కారణం న్యాయపాలిక వివిధ అంచెల్లో అవసరమైనంత మంది తీర్పరులు లేకుండాపోవడం వివాహ భోజనానికి వెళ్లి ఉపవాసం ఉండటం వంటిదే! 1987 లా కమీషన్ లెక్కల ప్రకారం ప్రతి 10లక్షల మందికి 50 న్యాయమూర్తులు ఉండాలన్న సిఫార్సు ప్రకారం ఆరోజుల్లోనే 40వేల మంది జడ్జీల అవసరం ఉన్నప్పటికీ 2018కి అందులో సగం మంది కుడా నియామకం కాకపోవడం విచారకరం. 2016లో 70 వేలమందికి పైగా జడ్జీలు ఉండి తీరాలని అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీఎస్ ఠాకుర్ లెక్కలకు నేటికీ గొడుగు పట్టే నాథుడు ఎక్కడ? ఉండాల్సిన రాశిలో 30మందికి పైగా న్యాయమూర్తులు తరుగుపడటం – సత్వర న్యాయాన్ని ఎండమావి చేస్తోంది.
2017 జులై గణాంకాల ప్రకారం- దేశవ్యాప్తంగా జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో మోక్షం కోరి నిరీక్షిస్తున్న వ్యాజ్యాల సంఖ్య 2.84 కోట్లు. ఈ అంతు తేలని దావాల లావాదేవీలకు సుప్రీంకోర్టులోను హైకోర్టుల్లోను ఈసురోమంటున్నవి కలిపి గణిస్తే ఆ మొత్తం 3.3కోట్లు. దిగువ కోర్టుల్లో ఒక్కో జడ్జికీ సగటున 1500లకు పైగా పెండింగ్ కేసులు పేరుకుపోయేంతగా న్యాయాధీశుల కొరతకు ప్రభుత్వ నిష్క్రియే కారణమని గతంలో జస్టిస్ ఠాకుర్ సూటిగా తప్పుపట్టారు. ఇందులో 46 శాతం దాకా సర్కారీ వ్యాజ్యాలేనని మోడీ సర్కార్ సరిగ్గానే గుర్తించినా నేటికీ న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనలో ఇండియాది వెనుకబాటే. న్యాయ నియామక ప్రక్రియలో ప్రతిబంధకాలు ఇలాగే కొనసాగితే 2040 నాటికి పెండింగ్ వ్యాజ్యాలు 15 కోట్లకు చేరతాయన్న అంచనాలు హడలెత్తిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెండింగులో ఉన్నవాటిలో 50 లక్షల వ్యాజ్యాలు చిన్నాచితక కేసులేనని, అందులో సగం పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోలేదని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ 2019లో ఏపీ హైకోర్టు ప్రారంభోత్సవంలో పేర్కొన్నారు. పంతాలకుపోయి, పలుపు కోసం కోర్టుకెక్కి పాడిని అమ్ముకోవాల్సిన దురవస్థకు నిదర్శనలే ఆయా కేసులన్నీ!
ఫ్రాన్స్‌లో ప్రతి 10లక్షల జనాభాకు 124మంది, అమెరికాలో 108, ఆస్ట్రేలియాలో 40! దీనితో పోలిస్తే 20 లోపే ఉన్న భారతీయ నిష్పత్తి, గాడితప్పిన పౌర న్యాయప్రక్రియను కుదురుకోనివ్వడం లేదు. తగినంతమంది న్యాయమూర్తుల నియామకంతోపాటు, 90శాతం సివిల్ కేసులు మధ్యవర్తిత్వ మార్గంలో తెమిలిపోవడం అమెరికాలో చూస్తుంటే – సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని బహుముఖంగా విస్తృతీకరించిన చైనా న్యాయస్థానాల్ని ఆసాంతం కంప్యూటరీకరించి మూడు నెలల గడువులో విచారణ, శిక్షల ఖరారు ముగిసిపోయేలా ముందడుగు వేస్తోంది. అటు న్యాయ నియామకాలు, ఇటు విచారణ విధివిధానాల నవీకరణ మందగతిన సాగుతున్న భారత్‌లో న్యాయార్థులెందరో అన్యాయమైపోతున్నారు. మౌలిక వసతుల పరికల్పన, న్యాయ నియామకాలు, సమస్త రికార్డుల కంప్యూటరీకరణ, అట్టడుగు నుంచి పైదాకా కోర్టుల అనుసంధానం – వడివడిగా సాకారమైతేనే న్యాయపీఠాలపై ప్రజల్లో విశ్వసనీయత ఇనుమడిస్తుంది. ఈ క్రమంలో మొన్న మార్చిలో బోంబే హైకోర్టు గోవా ధర్మాసనం నూతన భవన ప్రారంభోత్సవంలో నేషనల్ జ్యుడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని జస్టిస్ ఎన్.వి.రమణ పిలుపు కోర్టు కేసుల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి పులకింతల వర్షం కురిపించింది. న్యాయం అందుబాటులో ఉండటం, సత్వర న్యాయం జరగడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సుప్రీం పీఠంపై తన ప్రణాళికను చెప్పకనే చెప్పినట్లు అయింది.
సమకాలీన రాజకీయాల్లో అంతా డాగీ (కళంకిత) నేతలే గానీ బాగీ(ఎదురొడ్డి నిలిచే) నేతలు ఎవరున్నారని మాజీ ప్రధాని వాజ్‌పేయీ వాపోయారు. నేరం-రాజకీయం అద్వైత స్థితికి ఇండియాలో నేతాగణమే తిరుగులేని తార్కాణం. ఏ చిన్నపాటి నేరాభియోగం ఎదుర్కొన్నా కానిస్టేబుల్ ఉద్యోగానికి పనికిరారని తీర్పు ఇచ్చిన న్యాయపాలిక అదే గాటిన దేశదొంగలకు ఎందుకు ముకుతాడు వేయలేకపోతోంది? నేరచరితుల సమగ్ర వివరాల్ని ప్రజలకు ఎరుకపరచే ఈసీ గురుతర బాధ్యతకు సుప్రీం వెన్నుదన్నుగా నిలవాలి. సింహాసనాలపై సేదతీరే నేరస్థుల గుండెల్లో దడ పుట్టించాలి. బెదిరించి ఎదిరించాలనుకునే వారికి ఒళ్లు జలదరించాలి. “గజానికో గాంధారి కొడుకు ఈ గాంధీగారి దేశంలో” అన్న ఆరుద్ర మాటను అబద్ధం చేయాలి. “చీకటికి చురక పెడుతుందిలే చిన్ని మిణుగురు పురుగు, మొండి వానను ఆపుతుందిలే రెండు మూరల గొడుగు” అన్న సినారె ఆశను నిత్యం శ్వాసించాలి.
2020 మే 25న అమెరికాలోని మిన్నెసొటాలో పోలీసుల దాష్టీకానికి బలైన జార్జి ఫ్లాయిడ్ కేసులో తుదితీర్పు వెలువడిన తేదీ 2021 ఏప్రిల్ 20. సరిగ్గా 11నెలల్లో అమెరికాను అట్టుడికించిన ఈ కేసులో దోషికి పన్నెండున్నర ఏళ్ల శిక్షను తక్షణం అమలు చేసి బందీఖానాలోకి పంపింది. 2012 డిసెంబరు 16న “నిర్భయంగా” తల్లి తనువును నిలువునా చీల్చిన కామాంధులకు శిక్ష ఖరారైన తర్వాత కూడా న్యాయ వ్యవస్థలోని లొసుగులతో దోబూచులాడి తుదితీర్పు అమలుకి 8 ఏళ్ల కాలహరణం చేయడం వ్యవస్థకు సాకల్య క్షాళన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. ఈ దుస్థితి బదాబదలు కావాలన్న సత్సంకల్పంతో కాలు చేయీ కూడదీసుకోవడానికి నేటికి మించిన మంచి తరుణం ఎక్కడుంది?
భారత న్యాయవ్యవస్థ ఎడ్లబండి కాలంలోనే ఉండిపోయిందని సుప్రీంకోర్టు గౌరవ న్యాయాధీశులే ఈసడించిన సందర్భాలున్నాయి. సశక్త సమర్థ వ్యవస్థగా న్యాయపాలిక భాసిల్లాలన్న ప్రజాభీష్టానికి వ్యవస్థాగత లోటుపాట్లు తూట్లు పొడుస్తున్నాయి. దేశంలో సివిల్ దావాల పరిష్కరణకు సగటున 15 సంవత్సరాలు పడుతుండగా, క్రిమినల్ కేసులకు సంబంధించి 5-7 ఏళ్ల వరకు నిరీక్షించాల్సి వస్తోంది. వకీళ్లు కోరిందే తడవుగా వాయిదాలపై వాయిదాలు పడుతున్న కేసుల మూలాన కక్షిదారులు విపరీత వ్యయప్రయాసాయాసాలకు గురవుతున్నారు. కాలదోషం పట్టిన చట్టాలు, అసంబద్ధ విధివిధానాలు – న్యాయం కోరి కోర్టు తలుపు తట్టడమే నేరమైందని కక్షిదారులు విలపించే దుస్థితి కల్పిస్తున్నాయి. బధిర శంఖారావాన్ని తలపిస్తున్నాయి.
కోవిద్ సమయంలో అంతా అరచేతిలో వైకుంఠం అయిపోయిన తరుణంలో ఇప్పటికైనా భారతీయ న్యాయవ్యవస్థ సాంకేతికత కౌగిట సేదతీరాలి. వ్యాజ్యాల పూర్తి వివరాలు అన్నివేళలా అందుబాటులో ఉండేలా కంప్యూటరీకరణ వేగం పుంజుకోవాలి. వాయిదాల జాడ్యాన్ని విరగడ చేసి కేసులు సరైన సమయంలో ఫైసలా అయ్యేలా చూడగలిగితేనే న్యాయార్థుల బతుకులకు పండుగ. నిట్టూర్పుకి ఓదార్పుకి మధ్యన ఇరుక్కుపోయిన సగటు న్యాయార్థికి తీర్పు ఒక్కటే ఉన్నది…అండగా! Artificial Intelligence (AI) కన్నా ముందుగా Immediate Action (IA) పైన సుప్రీం శ్రద్ధ పెడితేనే రాజ్యంగ హక్కులను ప్రోది చేస్తున్నందుకు పౌరసమాజం నుండి మన్ననలు దక్కుతాయి.
తీర్పు కోసం తిమిరంలో ఎదురుచూసే వారికి మీ హయాం తూర్పున ప్రసరించే తొలివెలుగు తిలకం కావాలి. విధిగుద్దులకు హతాశులైన అభాగ్యుల నుదుటిపై మీ కలం వ్యాసవాక్యం రాయాలి. అన్యాయహననానికి న్యాయస్థానాలు యాగశాలగా మారాలి. సర్వోన్నత ధర్మదేవత స్పందనే సంపదగా భాసిల్లాలి. ఆసేతుహిమాచలం తెలుగువాడి సత్తాకు వత్తాసు పలకాలి. సూక్తులు కాదు స్ఫూర్తులు నింపుతూ మల్లెపొదలపై ఆరేసిన పట్టు పైపంచెలా సువాసనలు వెదజల్లాలి. అమావాస్య ఆకాశం కాదు, సభ్యసమాజానికి పున్నమి వెన్నెల సమానంగా ఆస్వాదించే హక్కు కల్పించాలి. పొన్నవరం చిన్నవాడు దేశానికి మిన్నవరంగా పేరొందాలి. అంతిమంగా చిరశాంతి-స్థిరక్రాంతి స్థాపనకు సమభావన-సహజీవన కల్పనకు న్యాయభారతికి అఖండ తెలుగుహారతిగా నూతలపాటి వెలుగొందాలి.
కృష్ణ నీరు తాగి
కృష్ణ నీడ ఎదిగి
కృష్ణ భక్తి కలిగి
భారతీయుల న్యాయ తృష్ణ తీర్చే శక్తిగా మారిన మీకు…
దిశానిర్దేశం చేసేందుకు మా ఈ చిన్న ప్రయత్నాన్ని పెద్దమనస్సుతో ఆదరిస్తారని ఆశిస్తూ….
సత్యమేవ జయతే! న్యాయమేవ భవతే! ధర్మయేవ వర్థతే! జైహింద్!!
—సుందరసుందరి(sundarasundari@aol.com)