తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ప్రతి ఏడాదీ ఆలయ సమీపంలోని వసంత మండపంలో ఈ ఉత్సవాలు జరిగేవి. కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఆలయంలోని కల్యాణ మండపంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. మొదటిరోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్పస్వామివారికి స్నపనతిరుమంజనం నిర్వహించారు. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం చేపట్టారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం సమర్పించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో వసంతోత్సవం
Related tags :