1993లో వచ్చిన మేటి చిత్రాల్లో ‘మాతృదేవోభవ’ ఒకటి. నాజర్, మాధవి ప్రధాన పాత్రల్లో కె. అజయ్ కుమార్ తెరకెక్కించిన సినిమా ఇది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మించారు. నాటి ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకున్న ఈ చిత్రాన్ని ఈతరం వారికి చూపించేందుకు సన్నాహాలు జరగనున్నాయి. మరోసారి ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు నిర్మాత రామారావు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ చిత్రానికి సంబంధించి తన మనసులో మాట పంచుకున్నారు. ‘కుటుంబ విలువల్ని తెలియజేసే ఈ చిత్రాన్ని అజయ్ దర్శకుడిగా మరోసారి తెరకెక్కించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నయనతార, అనుష్క, కీర్తి సురేశ్.. వీరిలో ఎవరో ఒకరు నటిస్తే బాగుంటుందని భావిస్తున్నాను. నయనతార బాగా చేస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఇప్పుడు చాలామంది నటులు కథ కంటే రెమ్యునరేషన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం వాళ్లు తీసుకుంటోన్న రెమ్యునరేషన్ వింటుంటేనే కొంచెం కంగారుగా ఉంది. పరిస్థితుల్ని బట్టి చూడాలి’ అని అన్నారు. భర్తను కోల్పోయి, క్యాన్సర్ బారిన పడిన మహిళ తన పిల్లల భవిష్యత్తు కోసం పడిన ఆరాటమే ఈ సినిమా కథ. ఈ సినిమాలోని వేటూరి రాసిన, కీరవాణి స్వరాలు సమకూర్చిన ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ గీతం చిరస్థాయిగా నిలిచింది.
తాజా నటులతో మరోసారి మాతృదేవోభవ

Related tags :