చికాగోకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రురాలు, తానా 2021 ఎన్నికల్లో డా.నరేన్ కొడాలి ప్యానెల్ నుండి మహిళా సేవల సమన్వయకర్తగా బరిలో ఉన్న దువ్వూరి చాందినీకి అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సాహితీవేత్తగా, రచయితగా పేరుగాంచిన హ్యూస్టన్‌కు చెందిన ప్రవాసుడు వంగూరి చిట్టెన్రాజు తన మద్దతు ప్రకటించారు. తన స్వస్థలం కాకినాడకు చెందడంతో పాటు పలు భారతీయ, తెలుగు, ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల్లో విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహించిన చాందినీ అభ్యర్థిత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, మహిళలకు మరిన్ని సేవలందించే సమన్వయకర్తగా ఆమె పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకం తనకు ఉందని చిట్టెన్రాజు పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం చాందినీ గెలుపు సమంజసమని ఆయన అభిప్రాయపడ్డారు.
నారీ గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలిగా, 23 ఏళ్లుగా ఇన్నోవేటివ్ కన్సల్టింగ్ సొల్యుషన్స్ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా, గత 12ఏళ్లుగా మహిళల సమస్యలపై పోరాడుతున్న ప్రవాసురాలిగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధ్యాపకురాలిగా చాందినీ ఉత్తర అమెరికాతో పాటు ఇండియాలో కూడా సుపరిచితురాలు.
వంగూరి ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏటా ఉగాది పురస్కారలు అందజేయడంతో పాటు, పుస్తక ప్రచురణ, కళాశాల పునరుద్ధరణ, అమెరికాలో సాహితీ సేవ, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ, వంటి ఎన్నో ప్రఖ్యాత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల నిర్వహణకు పేరుగాంచిన వంగూరి చిట్టెన్రాజు లాంటి ప్రవాస భీష్ముడి మద్దతు చాందినీ గెలుపుకు తప్పకుండా తోడ్పడగలదని ప్రవాసులు భావిస్తున్నారు. చిట్టెన్రాజు తానా వ్యవస్థాపనలో కూడా కీలకంగా వ్యవహరించారు.