పాపం.. ప్రాయశ్చిత్తం.. పశ్చాతాపం…..
“పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం”…
పూర్వ జన్మలో మనం చేసిన పాపం, రోగం రూపములో అనుభవములోనికి వస్తుంది, అని శాస్త్ర వచనము. పూర్వ జన్మలో మనము చేసిన పాప పుణ్యములను బట్టి, మన జన్మ వుంటుంది. మన జాతక చక్రం తదనుగుణంగా తయారు అవుతుంది. మన కర్మే, గ్రహాల రూపములో వచ్చి, మనల్ని బాధ పెట్టడమో, లేదా సుఖ పెట్టడమో, జరుగుతుంది. అనవసరంగా గ్రహాలను తిట్టుకొంటాము మనము. ఆ గ్రహాలు కూడా ఎదో మనిషి రూపములోనో, లేదా రోగాల రూపం లోనో వచ్చి, మానవులని బాధ పెడుతుంటాయి.
మరి పాపం అంటే ఏమిటి… చెడు కర్మ, చెడు పని పాపం అన్నారు. మరి చెడు పని అంటే… శాస్త్ర వచనమునకు తద్భిన్న మైనది, విరుద్ధ మైనది. అంటే ఒక జీవి పట్ల అనుచితముగా ప్రవర్తించడం.
ఉదాహరణకు… ఒకర్ని తిట్టినాము, కొట్టినాము, అనరాని మాటలు అన్నాము, ఒక ప్రాణిని హింసించినాము. ఎదుటి వారిని బాధ పెట్టినాము, అన్యాయంగా ప్రవర్తించినాము, ఇతరులను మోసం చేయుట, దొంగతనము, ఇలా ఎన్నో చెప్పుకోవచ్చును.
దోషములు పోగొట్టుకొనుటకు ప్రాయశ్చిత్తములున్నవి. అంతే గాని దోషములు చేయుటకు కాదు. ప్రాయశ్చిత్తం చెప్పబడినది కదా అని పాపములు చేయకూడదు. దానికి నిష్కృతి లేదు. అలాగే పశ్చాతాపం లేకుండా ప్రాయశ్చిత్తం చేసుకున్నా, అది కూడా వ్యర్ధమే. పాపము పోదు.
ప్రాయశ్చిత్త మకుర్వాణాః పాపేషు నిరతా నరాః |
అపశ్చాత్తాపినః కష్టాన్నరకాన్ యాంతి దారుణాన్ ||
పశ్చాతాపంను మించిన ప్రాయశ్చిత్తం లేదు అని పెద్దలు చెప్పుదురు. ఇది వీలుకాని పరిస్థితులలో మాత్రమే, చేయ వలెను. చేసిన తప్పుకు క్షమాపణలు అడగడమే ఉత్తమోత్తమం. దానిని మించినది లేదు. ప్రాయశ్చిత్తము వలన దోష నిర్మూలన తప్పక జరుగును, అయితే బుద్ధి పూర్వకముగా చేసిన యెడల పాపము పోదు అని చెప్ప బడినది.
“కామాకామకృతం తేషాం మహాపాపం ద్విధాస్మృతమ్”
బుద్ధి పూర్వకముగా చేసినది, కోరకతో చేసినది అని పాపములు రెండు విధములు. తెలియక చేసిన పాపములు, తెలిసి కావాలని చేసిన పాపములు. తెలియక జేసిన పాపములు ప్రాయశ్చిత్తము వలన నిర్మూలనము అగును. కానీ పొగరుతో, తెలిసి తెలిసి కావాలని చేసిన పాపములు ప్రాయశ్చిత్తముతో పోవు అని తెలియవలెను.
ఒకరు చేసిన పాపములు (పూర్వజన్మ) వారి జాతక రీత్యా తెలుసుకొనవచ్చును. ఒకరి పాపములను ఇంకొకరు తీసుకొని అనుభవించ వచ్చును. తమ పుణ్యమును ఇతరులకు ధార పోయ వచ్చును. మంత్ర శాస్త్రములో ఇది వీలు అగును. మహా గురువులు తమ శిష్యుల యొక్క భక్తుల యొక్క పాపములు, తాము తీసుకొని అనుభవించిన సందర్భములు ఎన్నో కలవు.