* అమెరికాలో వ్యాక్సినేషన్ పూర్తయిన వాళ్లు ఇకపై మాస్కుల్లేకుండానే బయట తిరగొచ్చు. ఈ మేరకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మంగళవారం సవరించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం.. వ్యాక్సినేషన్ పూర్తయినవారితో పాటు పాక్షికంగా జరిగినవారు ఇకపై బయట మాస్కుల్లేకుండా తిరగొచ్చు. ఒంటరిగా లేదా కుటుంబసభ్యులతో కలిసి నడకకు, వాహనాలపై షికారుకు వెళ్లొచ్చు. పూర్తి వ్యాక్సినేషన్ జరిగిన ప్రజల సమూహంలోకి కూడా వెళ్లొచ్చు. అయితే పెద్ద గుంపులోకి, కొత్త వ్యక్తుల సమూహంలోకి వెళ్లేప్పుడు మాస్కు ఉంటేనే మేలు. అదే సమయంలో వ్యాక్సిన్లు వేయించుకోనివారు మాత్రం ఇంటిబయట మాస్కులు ధరించడం కొనసాగించాలి.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు హాజరై రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. కరోనా రోగులకు అందుతున్న వైద్యం, ఆక్సిజన్ సరఫరా, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల కొరత, ఆస్పత్రుల్లో పడకల పెంపు, హెల్ప్‌డెస్క్‌పై ప్రధానంగా చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి ఆళ్లనాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా 60 కొవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరో 30 వేల కొవిడ్ పడకలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆక్సిజన్ కొరత రాకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
* కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను రూపొందించిన ఫైజర్, తాజాగా ఔషధంపై దృష్టి సారించింది. కొవిడ్ చికిత్సలో భాగంగా నోటి ద్వారా తీసుకునే ఔషధాన్ని వచ్చే ఏడాదిలోగా తీసుకువస్తామని వెల్లడించింది. నోటి ద్వారా, ఇంజక్షన్ రూపంలో తీసుకునే రెండు ఔషధాల (యాంటివైరల్)పై ప్రయోగాలు కొనసాగుతున్నాయని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైజర్ యాజమాన్యం పేర్కొంది.
* ఇప్పటికే పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్, దిల్ రాజు సహా చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీస్ కరోనా బారిన పడి కోలుకుంటుండగా తాజాగా అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
* కరోనా విలయం..3,293 మరణాలు.3,60,960 మందికి కొవిడ్ పాజిటివ్.2లక్షల మరణాలు దాటిన జాబితాలో భారత్.దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది.నిత్యం లక్షల్లో కేసులు..వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు కరోనా విపత్కర పరిస్థితులను కళ్లకుకడుతున్నాయి.దేశంలో తొలిసారిగా మరణాల సంఖ్య ప్రమాదకరస్థాయిలో 3 వేలు దాటింది.తాజాగా 3,293 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.దాంతో మరణాల సంఖ్య రెండు లక్షల మార్కు(2,01,187)ను దాటింది.వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం అమెరికా (5.87లక్షలు), బ్రెజిల్(3.95లక్షలు), మెక్సికో (2.15లక్షలు) మరణాల సంఖ్య పరంగా భారత్ కంటే ముందు వరసలో ఉన్నాయి.