Politics

జగన్‌కు సీబీఐ నోటీసులు-తాజావార్తలు

CBI Notices To AP CM YS Jagan

* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్‌ బెయిల్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. అందువల్ల బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘరామకృష్ణరాజు గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు తాజాగా ఇవాళ జగన్‌కు నోటీసులు జారీ చేసింది. రఘురామ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని జగన్‌, సీబీఐకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనిపై వచ్చే నెల 7వ తేదీన సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది.

* కరోనా మహమ్మారిని కట్టడి చేసే బృహత్తర వ్యాక్సినేషన్‌లో భాగంగా 18ఏళ్లు దాటిన వారందరికీ టీకా నమోదు ప్రక్రియ బుధవారం(ఏప్రిల్‌ 28) సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమైంది. అయితే వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం పెద్ద ఎత్తున యువత ఒక్కసారిగా కొవిన్‌ పోర్టల్‌లో లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నించంతో వెబ్‌సైట్‌ కొద్దిసేపు క్రాష్‌ అయ్యింది. చాలా మందికి సర్వర్‌ సమస్యలు తలెత్తడంతో వారంతా సోషల్‌మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. నమోదు ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లో ఈ సమస్య తలెత్తింది. అయితే కొద్ది మందికి మాత్రం ఎలాంటి సమస్యలు రాలేదు. అటు ఆరోగ్యసేతు యాప్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైనట్లు నెటిజన్లు పోస్ట్‌లు చేశారు. సర్వర్‌ ఎర్రర్‌ మెసేజ్‌ వచ్చినట్లు చెప్పారు. కొంతమందికి ఓటీపీలు ఆలస్యంగా వచ్చాయి. అయితే ప్రస్తుతం కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ అందుబాటులోనే ఉంది.

* దేశంలో కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. ఎన్నికల సంఘం (ఈసీ)బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన లేక కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు విజేతలు ఎలాంటి ప్రదర్శనలు చేపట్టడానికి వీల్లేదంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అసోం, తమిళనాడు, కేరళ, పశ్చిమ్‌బెంగాల్ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో నమోదైన ఓట్లను మే 2న లెక్కించనున్నారు.

* మోసం కేసులో బుల్లితెర నటుడు, యాంకర్‌ శ్యామల భర్త లక్ష్మీనరసింహారెడ్డితోపాటు మరో మహిళను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌రెడ్డి వివరాల ప్రకారం.. ఖాజాగూడ గ్రీన్‌ గ్రేస్‌ అపార్ట్‌మెంట్‌లో నివసించే సింధూరారెడ్డి (31) వ్యాపారి. మసీదుబండ, ఎస్‌ఎంఆర్‌ వినయ్‌ ఐకాన్‌కు చెందిన లక్ష్మీనరసింహారెడ్డి (37) ఆమెను సంప్రదించి తనకు గండిపేటలో రూ.100 కోట్ల విలువ చేసే నాలుగు ఎకరాల స్థలం ఉందని, దాంట్లో ఈతకొలను, పబ్, గేమ్‌ జోన్‌ వంటివి అభివృద్ధి చేసేందుకు పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించాడు. సింధూరారెడ్డి 2017 ఆగస్టులో రూ.85 లక్షలు నగదు, చెక్కుల రూపంలో ఇవ్వగా ఆ స్థలంలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదు. ఆమె తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో బెదిరించేవాడు. మరోవైపు లక్ష్మీనరసింహారెడ్డి సోదరినంటూ మౌలాలి హెచ్‌బీ కాలనీ ప్రాంతానికి చెందిన మట్టా జయంతి గౌడ్‌ (31) బాధితురాలిని పరిచయం చేసుకుని వేధించేది. దీంతో ఆమె గతనెల 19న పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు లక్ష్మీనరసింహారెడ్డిని, జయంతిగౌడ్‌ను అరెస్టు చేశారు.

* గత వారం రోజులుగా తెలంగాణలో పరిస్థితులు కొంతమేర కుదుటపడుతున్నాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ అన్నారు. కొవిడ్‌ కేసుల పెరుగుదలలో స్థిరత్వం కనిపిస్తోందని చెప్పారు. కోఠిలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో డీహెచ్‌ మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌పై ప్రజలందరికీ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు సహకరిస్తున్నారని.. వచ్చే మూడు, నాలుగు వారాలు అత్యంత కీలకమన్నారు. వచ్చేది పెళ్లిళ్లు, పండగల సీజన్‌ కాబట్టి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

* ప్రజలు ఆసుపత్రుల ముందు పడకల కోసం ఎదురు చూస్తుంటే వాళ్లను అలా చూస్తూ నిద్రపోలేనని ప్రముఖ నటుడు సోనూసూద్‌ అన్నారు. రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాలో చేయడం కంటే ప్రజలకు సేవ చేయడంలోనే ఎక్కువ సంతృప్తి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కరోనా ఆపత్కాలంలో సోనూ.. ఎంతోమందికి సాయం చేసి ఆదుకుంటున్నారు. దీంతో ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా.. ట్విటర్‌ వేదికగా సోనూసూద్‌ను ట్యాగ్‌ చేస్తూ వేడుకుంటున్నారు. ఆయన కూడా సాధ్యమైనంత వరకూ అందరి విన్నపాలు పరిశీలించి తన టీమ్‌ సహాయంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ‘అందరికీ సాయం చేయలేకపోతున్నాను.. నా నుంచి సాయం అందనివారు క్షమించాలి’ అని ఆయన పలుమార్లు కోరడం ఆయనకున్న విశాల హృదయానికి ఒక నిదర్శనం. వృత్తిపరంగా సినిమాల్లో బిజీగా ఉండే సోనూ.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పేదలను ఆదుకుంటున్నారు. కాగా.. తాజాగా ఆయన ఒక ట్వీట్‌ చేశారు.

* ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయ అసమానతలకు నిదర్శనమని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ కల్లోలంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న భారత్‌కు సహకరించడంలో ధనిక దేశాలు విఫలమయ్యాయని ఆయన తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా కొవిడ్ మరణాలు రెండు లక్షల మార్కును దాటిన క్రమంలో.. ఫౌచీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

* కరోనా కట్టడిలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడంలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వెంటనే ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

* షెడ్యూల్‌ ప్రకారం వచ్చే నెల 5వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకుని పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై జాయింట్‌ కలెక్టర్లు, ఆర్‌ఐవో, డీఈవోలతో మంత్రి వర్చువల్‌గా సమీక్షించారు. ఏ రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు రద్దు కాలేదని.. పరీక్షలు అనివార్యమని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పూర్తి చేసిన అధికారులను మంత్రి అభినందించారు. ఇంటర్‌ పరీక్షలను కూడా విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

* రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 25.9 శాతానికి చేరిందని.. ప్రభుత్వ అసమర్థ చర్యలతో ప్రజలు చనిపోతున్నారని మండిపడ్డారు. కరోనాకు సంబంధించి కోర్టులకు కూడా తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు.

* సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన జనరంజకంగా సాగుతోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద మాజీ కార్పొరేటర్లతో కలిసి తెరాస పార్టీ జెండాను మంత్రి ఆవిష్కరించారు.