Devotional

రేపు భ్రమరాంబ కుంభోత్సవం

రేపు భ్రమరాంబ కుంభోత్సవం

అరుణాసురుడు అనే రాక్షసుడిని భ్రమర రూపంలో అంతమొందించిన శ్రీశైలంలో కొలువుదీరిన భ్రమరాంబా దేవికి జరిగే వేడుకల్లో కుంభోత్సవం ప్రధానమైంది. ఏటా చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి శుక్రవారం లేదా మంగళవారం (ఈ ఏడాది ఏప్రిల్‌ 30 శుక్రవారం) ఇది జరుగుతుంది. పూర్వం వామాచార పూజా విధానం అమల్లో ఉన్నప్పుడు ఇక్కడ జంతుబలులు ఇచ్చేవారు. ఆది శంకరాచార్యులు అమ్మవారి ఎదురుగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన తర్వాత సాత్విక పూజలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలు, అన్నరాశి వంటి వాటిని అమ్మవారికి బలిగా సమర్పించటమే కుంభోత్సవం. ఆ రోజు ఉదయం శ్రీచక్రానికి పూజలు చేశాక, ప్రదక్షిణ మండపంలో అమ్మవారికి ఎదురుగా గుమ్మడి, కొబ్బరి కాయలపై పసుపు కుంకుమలు చల్లి తొలివిడత సాత్విక బలి సమర్పిస్తారు. నగారా, జేగంట, శంఖం, కొమ్ము వంటి వాద్యాల మధ్య భక్తులు గుమ్మడి, కొబ్బరికాయలు కొడతారు. నిమ్మకాయలను సగానికి కోసి సాత్విక బలి సమర్పిస్తారు. తర్వాత ఆలయ ప్రదక్షిణ ప్రాకారంపై ఉన్న మహిషాసురమర్దినికి పూజలు చేసి 108 కొబ్బరికాయలు సమర్పిస్తారు. దీనికి ‘కోటమ్మపూజ’ అని పేరు.
*సాయంత్రం మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం జరిపి స్వామివారి మూలమూర్తిని పెరుగన్నంతో కప్పేస్తారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో మాతకు ఎదురుగా 108 కేజీల బియ్యంతో వండిన అన్నాన్ని రాశిగా పోస్తారు. దీనికే కుంభరాశి అని పేరు. ఇదే సమయంలో అమ్మవారి ఆలయ ప్రధాన ద్వారం వద్ద సింహమండపం ముందు వైపు స్థానిక భక్తులు 508 కేజీల బియ్యంతో వండిన అన్నాన్ని రాశి పోసి బలిగా సమర్పిస్తారు. సూర్యాస్తమయం తర్వాత ఆలయ ప్రధాన ద్వారం వద్ద విధులు నిర్వహించే పురుష ఉద్యోగి స్త్రీ వేషం ధరించి బాజా భజంత్రీలతో అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని హారతి సమర్పిస్తాడు దీనికి కుంభ హారతి అని పేరు. హారతి సమయంలో అర్చకస్వాములు గర్భాలయం బయట నుంచి 21 కేజీల చొప్పున పసుపు, కుంకుమను దోసిళ్లతో అమ్మవారికి సమర్పిస్తారు. దీన్నే శాంతి ప్రక్రియ అంటారు. ఈ సమయంలో రెండో సాత్విక బలి జరుగుతుంది. ఆరు వందల కేజీల అన్నం, 1116 గుమ్మడికాయలు, మూడువేల కొబ్బరికాయలు, పెద్ద సంఖ్యలో నిమ్మకాయలు అమ్మవారికి సాత్విక బలిగా సమర్పిస్తారు. భ్రమరాంబ నిత్యం అలంకారంతో దర్శనమిస్తారు. కుంభోత్సవం రోజు నిజరూప దర్శనం చేసుకోవచ్చు.