Business

భారీ నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్లు-వాణిజ్యం

భారీ నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్లు-వాణిజ్యం

* దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయమే బలహీనంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సెన్సెక్స్‌ ఒక దశలో 1000 పాయింట్లకు పైగా పతనమైంది. ఉదయం 49,360 వద్ద నష్టాలతో ప్రారంభమైన సూచీ చివరకు 983 పాయింట్లు కోల్పోయి 48,782 వద్ద ముగిసింది. ఓ దశలో 1,067 పాయింట్లు కోల్పోయిన సూచీ 48,698 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చవిచూసింది. నిఫ్టీ 263 పాయింట్లు దిగజారి 14,631 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.89 వద్ద నిలిచింది.

* రిలయన్స్‌ పరిశ్రమల అధినేత ముఖేశ్‌ అంబానీ వెన్నంటి ఉండే తన బాల్య మిత్రుడు.. కుడిభుజంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా సన్యాసం స్వీకరించాడు. కోట్ల ఆదాయం వదులుకుని ఆధ్యాత్మిక మార్గంలోకి పయనించారు. ఆయన సన్యాసం తీసుకుని చాలా రోజులైనా ఇప్పటికీ ఆ విషయం బహిర్గతమైంది. అయితే ఆయన ఎందుకు సన్యాసం స్వీకరించాడో.. ఎందుకు ఆ మార్గంలోకి వెళ్లారో చదవండి. ముఖేశ్‌ అంబానీకి ప్రకాశ్‌ షా (64) బాల్య మిత్రుడు. రిలయన్స్‌ పరిశ్రమల వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేస్తుండేవాడు. ముఖేశ్‌ అంబానీకి కుడి భుజంలాంటివాడు. అతడి జీతం సంవత్సరానికి రూ.70 కోట్ల పైమాటే.

* భారత్‌ను కేంద్రంగా చేసుకుని డిజిటల్‌ లావాదేవీల ద్వారా వ్యాపార సంస్థలను మోసం చేసే ఉదంతాలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో గతేడాది ఇలాంటి సందేహాస్పద యత్నాలు 28 శాతం పెరిగినట్లు ట్రాన్స్‌యూనియన్‌ వెల్లడించింది. ఈ తరహా కేసులు అత్యధికంగా ముంబైలో ఉండగా.. ఢిల్లీ, చెన్నై తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ‘మోసగాళ్లు సాధారణంగా చెప్పుకోతగిన ప్రపంచ పరిణామాల నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు. కోవిడ్‌-19 మహమ్మారి, డిజిటల్‌ వినియోగం పెరగడం ఈ ఆన్‌లైన్‌ యుగంలో కీలక పరిణామంగా మారింది. మోసగాళ్లు దీన్నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేశారు‘ అని ట్రాన్స్‌యూనియన్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ షాలీన్‌ శ్రీవాస్తవ తెలిపారు.

* భారత్‌ బంగారం డిమాండ్‌ 2021 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) 37 శాతం (2020 ఇదే కాలంతో పోల్చి)పెరిగింది. పరిమాణంలో ఇది 140 టన్నులు. కోవిడ్‌ సంబంధ ఆంక్షలు పూర్తిగా తొలగిపోవడం, అంతర్జాతీయంగా ధరలు దిగిరావడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. 2020 మొదటి త్రైమాసికంలో దేశ పసిడి డిమాండ్‌ 102 టన్నులు.