Business

అమరరాజాకు విద్యుత్ నిలిపివేత

అమరరాజాకు విద్యుత్ నిలిపివేత

తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌కు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. దాంతో శనివారం నుంచి పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి క్లోజర్‌ నోటీసును జారీ చేసింది. విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని ఏపీఎస్‌పీడీసీఎల్‌కు ఆదేశాలిచ్చింది. ఈ సంస్థ పరిధిలో వివిధ విభాగాల్లో ప్రత్యక్షంగా 20 వేల మంది ఉద్యోగులు, పరోక్షంగా మరో 50వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. నోటీసు, విద్యుత్తు సరఫరా నిలిపివేతపై వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. పీసీబీ ఇచ్చిన క్లోజర్‌ నోటీసులో… ఈ సంస్థకు సంబంధించి చిత్తూరు జిల్లా నూనెగుండ్లపల్లి, కరకంబాడిల్లో ఉన్న యూనిట్లు పర్యావరణ అనుమతులు (ఈసీ), ఆపరేషన్‌ నిర్వహణ సమ్మతి (సీఎఫ్‌వో)లో విధించిన షరతులు ఉల్లంఘించినందున వాటి మూసివేతకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. అక్కడ గాలిలో, మట్టిలో సీసం పరిమాణం నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉన్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని వివరించింది. పనిచేసే ఉద్యోగుల రక్త నమూనాలు పరీక్షించగా.. వాటిల్లోనూ నిర్దేశిత పరిమితికి మించి సీసం ఉన్నట్లు తేలిందని తెలిపింది. ఆయా ప్లాంట్లు ఉన్న గ్రామాల ప్రజల రక్త నమూనాలను నేషనల్‌ రిఫరల్‌ సెంటర్‌ ఫర్‌ లెడ్‌ ప్రాజెక్ట్స్‌ ఇన్‌ ఇండియా (ఎన్‌ఆర్‌సీఎల్‌పీఐ)లో విశ్లేషించగా… ప్రమాణాలకు మించి చాలా అధికంగా వారి రక్తంలో సీసం పరిమాణం ఉందని ప్రస్తావించింది. మనిషి శరీరంలో సీసం పరిమాణం అధికంగా ఉంటే.. వివిధ అవయవాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. ‘మీ సంస్థ పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసింది. అందుకే మూసివేత ఆదేశాలిస్తున్నాం. ఇవి అందాక కూడా ఆయా ప్లాంట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తే.. నీటి కాలుష్య నియంత్రణ చట్టంలోని సెక్షన్‌ 41, వాయు కాలుష్య నియంత్రణ చట్టంలోని సెక్షన్‌ 37(1) ప్రకారం కనీసం ఏడాదిన్నర నుంచి ఆరేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుంది…’ అని పేర్కొంది.