Business

6.7శాతానికే SBI గృహ రుణాలు-వాణిజ్యం

6.7శాతానికే SBI గృహ రుణాలు-వాణిజ్యం

* దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎస్‌బీఐ గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. గృహ రుణాలను తీసుకునే వారికి 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా మహిళ రుణ గ్రహీతలకు 5 బేసిక్‌ పాయింట్ల వరకు రాయితీని ఇవ్వనుంది. ఖాతాదారులు యోనో యాప్‌ నుంచి గృహరుణాలను పొందవచ్చునని ఎస్‌బీఐ తెలిపింది. యోనో యాప్‌ నుంచి రుణాలను తీసుకున్న ఖాతాదారులకు 5 బేసిక్‌ పాయింట్ల వరకు రాయితీని ఇవ్వనుంది.

* ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్‌ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటంతో శివార్లలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కొత్తపుంతలు తొక్కుతుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భువనగిరి, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల మీదుగా ఈ రింగ్‌ రోడ్డు వెళుతుండటంతో ఆయా ప్రాంతాలలో భూముల ధరలు 35–40 శాతం వరకు పెరిగాయి. శ్రీశైలం హైవేలో కొన్ని ప్రాంతాల్లో 50 శాతం కంటే ఎక్కువే ధరలు పెరిగాయని స్పేస్‌ విజన్‌ గ్రూప్‌ సీఎండీ నర్సింహా రెడ్డి తెలిపారు. హైవే ఫేసింగ్‌ ఉన్న భూముల ధర ఎకరానికి రూ.2 కోట్లు, కాస్త లోపలికి ఉంటే రూ.1–1.5 కోట్ల వరకున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ వెళ్తుందని భావిస్తున్న భూముల్లో వ్యవసాయం దాదాపు నిలిచిపోయింది. ఏ జిల్లాల మీదుగా ఆర్‌ఆర్‌ఆర్‌ వెళుతుందో క్షేత్ర స్థాయిలో పక్కాగా సర్వే జరిగి తుది అలైన్‌మెంటు సిద్దమయ్యాకనే అధికారికంగా ప్రకటిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

* గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంక్‌ ఏకంగా రూ. 3,790 కోట్ల నికర నష్టం (కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన) ప్రకటించింది. ఆదాయం క్షీణించడం, మొండిబాకీలకు ప్రొవిజనింగ్‌ భారీగా పెరగడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో లాభం రూ. 2,665 కోట్లు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను యస్‌ బ్యాంక్‌ నికర నష్టాలు రూ. 16,432 కోట్ల నుంచి రూ. 3,488 కోట్లకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పునర్‌వ్యవస్థీకరించే అవకాశమున్న రుణాల కోసం కూడా ముందుగా ప్రొవిజనింగ్‌ చేసినట్లు యస్‌ బ్యాంక్‌ ఎండీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. మార్చి త్రైమాసికంలో మొండిబాకీలకు ప్రొవిజనింగ్‌ రూ. 5,239 కోట్లకు పెరిగినట్లు పేర్కొన్నారు. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 4,872 కోట్లుగా ఉంది.

* డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 13,227 కోట్లకు చేరింది. దీనిలో యూఎస్‌ షేల్‌ ఆస్తుల విక్రయం ద్వారా లభించిన రూ. 737 కోట్ల అనుకోని లాభం కలసి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 6,348 కోట్లు మాత్రమే ఆర్జించింది.