Politics

ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పనిచేశారు. గెలిచారు.

ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పనిచేశారు. గెలిచారు.

సంపూర్ణ అక్షరాస్యత.. వర్తమాన అంశాలపై పూర్తి అవగాహన కేరళ ప్రజల సొంతం.. రాజకీయాల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎవరిని అడిగినా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తుంటారు. అందుకే గత 40 ఏళ్లుగా ఒక్కసారి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఎందరో రాజకీయ చతురులు.. మరెందరో ఉద్దండులకు కూడా అది సాధ్యపడలేదు. నంబూద్రీపాద్, ఏకే గోపాలన్, కృష్ణ పిళ్లై వంటి శక్తిమంతమైన కమ్యూనిస్టు నేతలే అక్కడి ప్రజల నాడి పట్టలేకపోయారు. దీన్ని బట్టే కేరళ ప్రజల రాజకీయ చైతన్యం ఎలా ఉందో అంచనా వేయొచ్చు. 1980 నుంచి ఏ ఒక్కరిని కూడా కేరళ ప్రజలు వరుసగా రెండోసారి సీఎం కుర్చీపై కూర్చోబెట్టలేదు. అలాంటిది 40 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ.. రెండోసారి అధికారంలోకి రానున్నారు కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి, కెప్టెన్, కామ్రేడ్‌ పినరయి విజయన్‌. గతంలో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన ఏ రాజకీయ నేతకూ సాధ్యంకాని ఈ అరుదైన రికార్డు.. విజయన్‌ను ఎలా వరించింది..? అఖండ విజయ సాధనకు తోడ్పడిన అంశాలేంటి..? గత ఐదేళ్ల పాలనలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తిరిగి ఎలా విజయ పతాకా ఎగరేయగలిగారు..? సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ రెండోసారి అధికారంలోకి రావడానికి పినరయి విజయన్‌ నాయకత్వ లక్షణాలు ఎంతో ఉపయోగపడ్డాయని అనడంలో సందేహం లేదు. ఎన్నికలకు ముందే విజయన్‌ రచించిన వ్యూహాలు ప్రతిపక్షాలను ఎన్నికల్లో నిలదొక్కుకోకుండా చేశాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో విభేదాలు పినరయికి బాగా కలిసొచ్చాయి.

సమస్య వచ్చినప్పుడే అసలైన లీడర్‌ ఎవరో తెలుస్తుంది అంటారు. గత ఐదేళ్లుగా కేరళలో ఒకదాని వెనుక ఒకటి వచ్చి పడుతున్న ఉపద్రవాలను చాకచక్యంగా, విజయవంతంగా ఎదురొడ్డి నిలిచారు పినరయి విజయన్‌. సమస్యలు, ఇబ్బందులు ఉన్న చోట తాను ఉన్నానంటూ ధైర్యం ఇచ్చారు. 2017లో ఓఖి సైక్లోన్, 2018లో నిపా వైరస్, 2018, 2019లో వరదలు, 2020లో కరోనా మహమ్మారి.. ఇలా అన్ని విపత్తులనూ విజయన్‌ సమర్థం గా ఎదుర్కొన్నారు. సైక్లోన్‌ సమయాల్లో ప్రజలను రక్షించడమే కాకుండా, వారికి కావాల్సిన ఆహారాన్ని, వరదలకు సంబంధించిన కిట్లను ప్రజలంద రికీ ప్రభుత్వం చేరవేసింది. మీడియా ముందుకు వచ్చి పరిస్థితులపై సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితులను వివరిస్తూ ప్రజలకు నిబ్బరం కల్పించారు. గతేడాది దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సమయంలో వలస కూలీలు పడ్డ ఇబ్బందులు వర్ణణాతీతం.. కానీ విజయన్‌ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర సంక్షేమ పథకాలు, సేవలతో రాష్ట్ర ప్రజలకు ఆపన్న హస్తం అందించింది. అడ్వాన్స్‌గా పెన్షన్‌ ఇవ్వడం, ఉచితంగా రేషన్‌ సరుకులను పంపిణీ చేసింది. వలస కార్మికులను తమ రాష్ట్ర అతిథులుగా చూసుకుంటామని భరోసా కల్పించింది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అత్యంత కష్ట కాలంలో ప్రజల బాగోగులు చూసుకోవడం ద్వారా ప్రజల మనసులను దోచుకున్నారు విజయన్‌. రేషన్‌ సరుకుల పంపిణీ లాక్‌డౌన్‌ తర్వాత కూడా ఇప్పటికీ కొనసాగుతుండటం వల్ల ప్రజలకు మరింత దగ్గరయ్యారు.

గత ఎన్నికల్లో తాను చేసిన 600 హామీల్లో.. ఏకంగా 570 హామీలను నెరవేర్చిన ఘనత విజయన్‌కే దక్కింది. ఎన్నో పథకాలను ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఎంతో దూరదృష్టితో రూపొందించారు. ‘లైఫ్‌ మిషన్‌’ద్వారా ఇళ్లు లేని, భూమి లేని నిరుపేదలకు దాదాపు 2 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు. ‘అర్ధ్రమ్‌ మిషన్‌’పథకం ద్వారా రాష్ట్ర ఆరోగ్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ప్రతి పేదవాడికి ప్రతి జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనే సరైన వైద్యం అందేలా చేశారు. ‘ఎడ్యుకేషన్‌ మిషన్‌’ద్వారా వెయ్యి ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలల్లో హైటెక్‌ క్లాస్‌రూమ్స్, హైటెక్‌ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసి, దేశంలోనే తొలి డిజిటల్‌ రాష్ట్రంగా పేరుగాంచేలా చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఎన్నో సూచీల్లో మొదటి స్థానంలో కేరళ నిలిచేలా ఎంతో కృషి చేశారు పినరయి విజయన్‌. అయితే విజయన్‌ ప్రస్థానం నల్లేరు మీద నడకేమీ కాదు. ఆయనా ఎన్నో ఒడిదొడుకులను చవిచూశారు. ఎన్నో ఆరోపణలను ఎదుర్కొన్నారు. అంతెందుకు సొంత పార్టీలోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీపీఐఎం సీనియర్‌ నేత అచ్యుతానందన్‌కు, పినరయి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గోల్డ్‌ స్మగ్లిం గ్‌ కేసులో ఆయన హస్తం ఉందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఒకానొక సందర్భంలో పినరయిని మీడియా విలన్‌గా చిత్రీకరించింది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధైర్యంగా, పవర్‌ హౌస్‌లా నిలబడ్డారు రియల్‌ కామ్రేడ్‌.