Health

నిమ్మరసం కర్పూరం కరోనాపై పనిచేయవు

నిమ్మరసం కర్పూరం కరోనాపై పనిచేయవు

ముక్కులో నిమ్మరసం వేసుకుంటే కరోనా చస్తుంది.. చేతిలో నెబులైజర్‌ ఉంటే ఆక్సిజన్‌ సిలిండర్‌ అవసరం లేదు.. కర్పూర మిశ్రమంతో ప్రాణవాయువు స్థాయి అమాంతం పెరిగిపోతుంది.. కరోనా తగ్గాలంటే ఈ విధానాన్ని అవలంబించండి, ఆక్సిజన్‌ స్థాయిలు పెరగాలంటే ఇలా చేయండి అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన కొన్ని వీడియోలపై అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హేతుబద్ధత లేని కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ కొందరు ప్రమాదకరమైన పద్ధతుల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముక్కులో రెండు చుక్కల నిమ్మరసం వేసుకుంటే అది కరోనాను చంపేస్తుందని, శరీరంలో ఆక్సిజన్‌ శాచురేషన్‌ స్థాయి పెరుగుతుందని తెలియజేసే ఓ వీడియో ఈ మధ్య వైరల్‌గా మారింది. అయితే ఈ పద్ధతి పాటించి ఇటీవల ఓ ఉపాధ్యాయుడు మరణించాడనే వార్తలు కూడా వచ్చాయి. నిమ్మరసం ముక్కులో వేసుకుంటే అది కరోనాను నాశనం చేస్తుందని, ఆక్సిజన్ లెవల్స్‌ పెంచుతుందనడానికి ఎలాంటి ప్రామాణికత లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొవిడ్‌ లాంటి సమస్య వల్ల శరీరంలో ఆక్సిజన్‌ శాచురేషన్‌ లెవల్స్‌ తగ్గిపోయినప్పుడు ఆక్సిజన్‌ను బయటి నుంచే ఇవ్వాల్సి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల స్పష్టం చేసింది. రోగి శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గితే శరీరంలోని కణాలు పనిచేయడం ఆగిపోతాయని.. ఆ పరిస్థితుల్లో కేవలం మెడికల్‌ ఆక్సిజన్‌ మాత్రమే ప్రాణాలు రక్షిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ వైద్యుడు డా.జెనేట్‌ డియాస్‌ స్పష్టం చేశారు.

నెబులైజర్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌లా పనిచేస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న ఓ వీడియోలో వాస్తవికత లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. నెబులైజర్‌ నుంచి ఆక్సిజన్‌ అందుతుందని తెలిపేందుకు ఎలాంటి ప్రమాణాలు, శాస్త్రీయ అధ్యయనాలు లేవని వైద్య నిపుణులు తేల్చి చెప్పారు. అదనపు ఆక్సిజన్‌ అందించేందుకు ఈ టెక్నిక్‌ అసలు పనిచేయదన్నారు.

కర్పూరం, వాము, నీలగిరి తైలం మిశ్రమం కొవిడ్‌ బాధితుల్లో ఆక్సిజన్‌ స్థాయి పెంచడానికి చాలా బాగా పనిచేస్తుందన్న మరో వీడియో కూడా వైరల్‌గా మారింది. అయితే ఈ మిశ్రమం వల్ల బాధితులకు ప్రయోజనం కలిగిందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వైద్యులు వెల్లడిస్తున్నారు. లేపనంలా ఉపయోగించే కర్పూరాన్ని శరీరం లోపలికి తీసుకోవడం ప్రాణాంతకం కావచ్చని హెచ్చరిస్తున్నారు. కర్పూరం ఆవిరి శరీరం లోపల విషపూరితం కాగలదని అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ కూడా హెచ్చరించింది. సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న ప్రమాదకర చిట్కాలను అవలంబించి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.