Business

పెరిగిన బంగారం వెండి ధరలు-వాణిజ్యం

పెరిగిన బంగారం వెండి ధరలు-వాణిజ్యం

* దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం బలహీనంగా ప్రారంభమైన సూచీలు చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల్లోకి జారుకున్నాయి. కానీ, అవి ఎక్కువ సేపు నిలవలేదు. సెన్సెక్స్‌ ఉదయం 48,356 వద్ద బలహీనంగా ప్రారంభమై.. 48,863 వద్ద గరిష్ఠాన్ని.. 48,028 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 63 పాయింట్ల నష్టంతో 48,718 వద్ద ముగిసింది. ఇదే ట్రెండ్‌ను కొనసాగించిన నిఫ్టీ చివరకు 3 పాయింట్ల స్వల్ప లాభంతో 14,634 వద్ద స్థరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.89 వద్ద ముగిసింది.

* సోమవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.310 పెరిగి 46,580కి చేరిందని పీటీఐ పేర్కొంది. అంతర్జాతీయంగా బంగారంలో పెట్టుబడులు పెరగడంతో పాటు, రూపాయి బలహీనపడటం కూడా పసిడి ధర పెరుగుదలకు కారణమని బులియన్‌ ట్రేడింగ్‌ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ.580 పెరగడంతో రూ.67,429కి చేరింది.

* ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్‌కు భారీ సాయం ప్రకటించింది. దేశీయంగా కొవిడ్‌ చికిత్సలో వినియోగించేందుకు ప్రభుత్వం గుర్తించిన పలు ఔషధాలను పంపనున్నట్లు వెల్లడించింది. దాదాపు రూ. 510 కోట్లు విలువ చేసే ఈ ఔషధాలను అమెరికా, ఐరోపా, ఆసియాలోని సంస్థకు చెందిన పలు పంపిణీ కేంద్రాల నుంచి భారత్‌కు అందించనున్నట్లు కంపెనీ సీఈఓ ఆల్బర్ట్ బోర్లా వెల్లడించారు. భారత్‌కు వీలైనంత త్వరగా తమ సాయం అందే దిశగా చర్యలు చేపడుతున్నామని భారత్‌లోని ఫైజర్ ఉద్యోగులకు రాసిన లేఖలో బోర్లా తెలిపారు.

* మీరు తక్కువ ధరలో మంచి కారు కొనాలని చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు రెనాల్ట్, డాట్సన్ తమ కార్లపై భారీగా డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ డిస్కౌంట్లో భాగంగా కస్టమర్లు రూ.45,000 వరకు తగ్గింపు పొందవచ్చు. డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పీవీవిని జపాన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ డాట్సన్ తయారు చేసింది. ఈ కారు మొత్తం 5 వేరియంట్లను కంపెనీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కారులో కంపెనీ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఇది 68 పీఎస్ నుంచి 77 పీఎస్ వరకు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 5 స్పీడ్ మాన్యువల్, సీవీటి ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ ఉన్నాయి.