* ఏపీలో పగటి పూట పాక్షిక కర్ఫ్యూ.ప్రభుత్వం కీలక నిర్ణయం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా ఆంక్షలు మరింత కఠినతరం చేసింది.కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు కానుంది.రాష్ట్రంలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలవుతుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు దుకాణాలకు అనుమతి ఇచ్చింది.రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది.
* ఏపీలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయనపై ఉన్న ఆరోపణలపై కమిషనరాఫ్ ఎంక్వైరీస్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఇటీవలే 14 రోజుల విచారణ పూర్తి చేసింది. అయితే, తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు ఏబీ వెంకటేశ్వరరావు ఇటీవల పిటిషన్ వేశారు. దీంతో ఆయనను ఊరట లభించింది. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
* పార్టీ ముఖ్య నేతలతో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ ఎన్ 440కె ఏపీలో వ్యాపించిందన్నారు. తొలిసారిగా దీనిని సీసీఎంబీ శాస్త్రవేత్తలు కర్నూలులో గుర్తించారన్నారు. ఇతర వైరస్‌ల కన్నా 10 రెట్లు ప్రభావం ఎక్కువ చూపుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌కు చర్యలు చేపట్టాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. ఇప్పటికే 14 రోజుల పాటు ఒరిస్సా లాక్‌డౌన్‌ను ప్రకటించిందని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కోసం పలు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు.
* టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బంహరి మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సబ్బంహరి లేరన్న వార్తను నమ్మలేకపోతున్నాను. ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటారని ఆశించాను. కానీ ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ మంచి నాయకుడిని కోల్పోయింది. సబ్బంహరి మృతి పార్టీకి తీరని లోటు. ప్రజా సమస్యలపై స్పందించడంలో హరి ఎప్పుడూ ముందుండేవారు. విశాఖ మేయర్ గా, లోక్ సభ సభ్యులుగా సబ్బంహరి ప్రజలకు ఎనలేని సేవ చేశారు. సబ్బంహరి మంచి వక్త. సమకాలీన రాజకీయాలపై సబ్బంహరికి మంచి పట్టుంది. ఏ అంశంమైనా లోతైన విశ్లేషణ చేసేవారు. సబ్బంహరి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. హరి కుటుంబసభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.
* తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి కొద్దిసేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపు తరువాత, అన్నాడీఎంకే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సేలంలో ఉన్న ఆయన, తన కార్యదర్శి ద్వారా రాజీనామా లేఖను పంపించారని, గవర్నర్ కార్యాలయానికి ఈ లేఖ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చేరుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన పళనిస్వామి, స్టాలిన్ కు అభినందనలు తెలిపారు. ఆ వెంటనే స్టాలిన్ కూడా స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “మరింత మెరుగైన తమిళనాడు కోసం మీ సలహాలు, సూచనలు, సహకారం నాకు అవసరం. మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. పాలనలో విపక్షానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో నాకు తెలుసు” అని అన్నారు. ఇక కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించి, పాలనా పగ్గాలను అందించేందుకు గవర్నర్ కార్యాలయం అధికారులు ఏర్పాటు చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం డీఎంకే కూటమి 156 సీట్లల్లో విజయం సాధించి, మ్యాజిక్ ఫిగర్ ను అధిగమించగా, అన్నాడీఎంకే కూటమి 74 సీట్లతో సరిపెట్టుకుందన్న సంగతి తెలిసిందే.
* ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్‌కు భారీ సాయం ప్రకటించింది. దేశీయంగా కొవిడ్ చికిత్సలో వినియోగించేందుకు ప్రభుత్వం గుర్తించిన పలు ఔషధాలను పంపనున్నట్లు వెల్లడించింది. దాదాపు రూ. 510 కోట్లు విలువ చేసే ఈ ఔషధాలను అమెరికా, ఐరోపా, ఆసియాలోని సంస్థకు చెందిన పలు పంపిణీ కేంద్రాల నుంచి భారత్‌కు అందించనున్నట్లు కంపెనీ సీఈఓ ఆల్బర్ట్ బోర్లా వెల్లడించారు.
* హైదరాబాద్ మహా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో కోఠి, అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్‌లలో వర్షం పడింది. లక్డికాపూల్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, సోమాజీగూడ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, బాలాజీనగర్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, అల్వాల్, తిరుమలగిరి, ప్రగతినగర్, నిజాంపేట, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, మాదాపూర్‌తో పాటు కర్మన్‌ఘాట్, చంపాపేట్, సరూర్‌నగర్‌లలో వర్షం పడింది. వర్షం పడుతున్నంతసేపు పలుచోట్ల వాహనదారులు మెట్రో పిల్లర్ల కింద వేచి ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంద్దులు పడ్డారు. ఎండల తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న భాగ్యనగర వాసులకు ఈ వర్షం కాస్త ఉపశమనం ఇచ్చింది.
* తాను ఓడినా ఒంటి చేత్తో తన పార్టీకి అపూర్వ విజయం సాధించిపెట్టిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో ఓట్ల లెక్కింపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్ ఓట్ల లెక్కింపుపై సందేహాలు వ్యక్తంచేశారు. 4గంటల పాటు సర్వర్‌లో సమస్య ఉందని ఈసీ చెప్పిందన్నారు. తాను గెలిచినట్టు తెలిసి గవర్నర్ కూడా అభినందనలు తెలిపారని దీదీ చెప్పారు. రీకౌంటింగ్‌కు అనుమతి ఇవ్వొద్దని ఆర్‌వోను బెదిరించారని వ్యాఖ్యానించారు. రీకౌంటింగ్ నిర్వహిస్తే ప్రాణాపాయం ఉందని ఆర్‌వో అన్నట్లు తనకు తెలిసిందన్నారు.
* కరోనా మహమ్మారి బారినపడి మరో రాజకీయ ప్రముఖుడు కన్నుమూశారు. తెదేపా నేత, మాజీ ఎంపీ సబ్బం హరి (69) విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇటీవల ఆయన కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా విశాఖ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సబ్బం హరికి కొవిడ్‌తో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా.. ప్రయోజనం లేకపోయింది.
* దేశరాజధానిలో నెలకొన్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్మీ సాయం కావాలని దిల్లీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. నగరంలో కొవిడ్ ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతున్న వేళ.. ప్రత్యేక కొవిడ్ కేంద్రాల నిర్వహణ, ఆక్సిజన్ సరఫరా బాధ్యతలు ఆర్మీ చేపట్టాలని కోరుకూ దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కేంద్ర రక్షణశాఖ మంత్రికి లేఖ రాశారు. ఇదే విషయమై దిల్లీ హైకోర్టులోనూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు, దిల్లీ ప్రభుత్వ విజ్ఞప్తిపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.
* భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు కాన్వాయ్‌ని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఎమ్మెల్యేగా ఇచ్చే గన్‌మెన్లను మినహా మిగతా సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి పంపేశారు. శామీర్ పేటలోని తన నివాసం నుంచి ఆయన హుజూరాబాద్ బయల్దేరారు. అక్కడ కార్యకర్తలు, అనుచరులతో సమావేశం కానున్నారు.
* దేశంలో కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చిన వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ బాధితులకు చికిత్సలు అందించేందుకు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదివే విద్యార్థులను విధుల్లోకి తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం నీట్-పీజీ పరీక్షను నాలుగు నెలల పాటు వాయిదా వేసింది. కొవిడ్‌పై పోరు వైద్య సిబ్బంది కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
* తమిళనాట కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే కూటమి భారీ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. మే 7వ తేదీన ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి పదవి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు నేడు తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు పంపించారు.
* ప్రత్యర్థుల వ్యూహాలకు చెక్ పెట్టి పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఒంటిచేత్తో పార్టీకి అపూర్వ విజయాన్ని అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం నందిగ్రామ్‌లో ఓటమి చవిచూశారు. అయినప్పటికీ ఆమే మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించనున్నారు. కొత్తగా ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యేలతో సోమవారం పార్టీ అధిష్ఠానం సమావేశమైంది. ఈ సందర్భంగా దీదీని తమ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మే 5వ తేదీ బుధవారం రోజున మమత సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి, సీనియర్ నేత పార్థ ఛటర్జీ తెలిపారు. ఇందుకోసం రాత్రి 7 గంటలకు దీదీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను కలవనున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
* మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీని అధికార పార్టీ తెరాస కైవసం చేసుకుంది. ఇక్కడ ఇప్పటి వరకు 19 వార్డుల్లో ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. వీటిలో 16 వార్డుల్లో తెరాస గెలుపొందింది. ఇక్కడ మొత్తం 27 వార్డులుండగా.. అధిక స్థానాల్లో తెరాస గెలిచి మున్సిపాలిటీపై జెండా ఎగురవేసింది. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీని కూడా తెరాస కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 12 వార్డుల్లో 7 చోట్ల గులాబీ పార్టీ జయకేతనం ఎగరవేసింది. కాంగ్రెస్ 5 వార్డులకే పరిమితమైంది.
* ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అంశంపై విచారణను హైకోర్టు రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. ఏపీలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య పరిషత్ ఎన్నికలు ముగిసినా ఇప్పటివరకు ఫలితాలు వెల్లడి కాలేదు. ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ తెదేపా నేత వర్ల రామయ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సింగిల్ జడ్జి విచారణ జరిపి ఎన్నికలు నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేయగా.. ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది. డివిజన్ బెంచ్ విచారణ జరిపి పరిషత్ ఎన్నికల పోలింగ్‌కు అనుమతిస్తూ ఓట్ల లెక్కింపును నిలిపివేసిన విషయం తెలిసిందే.
* వైద్య ఆరోగ్యశాఖకు ఎట్టిపరిస్థితుల్లో నిధుల కొరత రానివ్వొద్దని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. ఆస్పత్రుల్లో నాడు- నేడు పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తూ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో భూసేకరణపై కలెక్టర్లతో మాట్లాడాలని సూచించారు. పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం కాలేజీల టెండర్లు పూర్తయ్యాయన్న అధికారులు.. మిగిలిన 12 కళాశాలలకు ఈ నెల 21లోగా టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. వైఎస్సార్ కంటివెలుగు పథకంపైనా సీఎం సమీక్షించారు. ఉచితంగా కళ్లద్దాల పంపిణీ, అవసరమైన వారికి ఆపరేషన్లు త్వరగా పూర్తిచేయాలన్నారు. ఈ పథకం కింద ఇప్పటిదాకా చేసిన పరీక్షలు, అందించిన అద్దాల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.