మామూలుగా లుంగీల ధర అయిదువందల రూపాయల్లోపే ఉంటుంది. కానీ హైదరాబాద్‌లోని బార్కాస్ గ్రౌండ్‌కి దగ్గర్లోని మార్కెట్‌కి వెళ్తే మాత్రం అరలక్ష, లక్ష పలికే లుంగీలను కూడా చూపిస్తారు. వీటిలో ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకునే జవేరా దునియా, జవేరా బార్కాస్, టిబా, అట్లాస్… ఇలా రకరకాలు ఉంటాయి. ఒకప్పుడు హైదరాబాద్‌ని పాలించిన నిజాంలు అరబ్బు దేశాల నుంచీ సైనికుల్ని తీసుకొచ్చి తమ సేనలో చేర్చుకున్నారు. అప్పట్లో ఆ అరబ్, యెమెన్ మిలటరీ స్థావరాల బారక్‌లు చార్మినార్‌కు దక్షిణం వైపు ఉండేవట. అదే తర్వాత బార్కాస్‌గా మారింది. నిజాంల పాలన ముగిసినా అరబ్బులు ఇక్కడే స్థిరపడిపోయారు. కానీ వారి సంప్రదాయాలను మాత్రం వదల్లేదు. అందులో భాగమే అరబ్బులు ప్రత్యేకంగా ధరించే ఈ లుంగీలు. ప్రాచీన సంప్రదాయ మగ్గాల మీద ఇరవై అంచెలుగా నేసే బార్కాస్ లుంగీలు ఎంత మెత్తగా పలుచగా ఉంటాయంటే వీటిని చేతి ఉంగరం నుంచి ఒక మడతగా బయటకు లాగేయవచ్చని పేరుంది. డిజైన్లు కూడా మన దగ్గర దొరికే వాటికి భిన్నం. వీటిలో రూ.1500 నుంచి ఎనిమిది వేల వరకూ ఉండే లుంగీలు ఎక్కువ అమ్ముడుపోతాయి. ఇంకా ఖరీదైన వాటికి మాత్రం రంజాన్ సీజనులోనే బాగా గిరాకీ. పండుగ సమయంలో కుటుంబసభ్యులకూ బంధువులకూ కానుకలుగా ఇచ్చేందుకు వీటిని కొంటుంటారట.
లక్ష రూపాయిల లుంగీ
Related tags :