* ముందుగా ఊహించిందే జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేశాయి. 18 రోజుల పాటు పెరగని ధరలు మంగళవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 16 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రకటన వెలువడింది. దీంతో పెట్రోలు ధర రూ. 90.56కు, డీజిల్ ధర రూ.80.73కు పెరిగింది. గడచిన రెండు నెలల వ్యవధిలో కేవలం రెండు మూడు సార్లు మాత్రమే పెట్రోలు ధరల సవరణ జరిగింది. అది కూడా ధరల తగ్గింపు మాత్రమే కనిపించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియగానే ధరలు పెరగడం గమనార్హం.
* భారత్‌కు చెందిన అంతర్జాతీయ స్థాయి వ్యాక్సిన్ తయారీ దిగ్గజం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) యూకేలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఓ విక్రయ కార్యాలయం ఏర్పాటుతో పాటు సంస్థ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించేందకు 240 మిలియన్ పౌండ్లు యూకేలో పెట్టుబడిగా పెట్టనున్నట్లు అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భారత్‌తో కుదిరిన బిలియన్ డాలర్లు విలువ చేసే వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందాల్లో భాగంగానే సీరం యూకేలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ప్రధాని మోదీ, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ వర్చువల్ సమావేశానికి ముందు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రకటన వెలువడడం గమనార్హం.
* దేశంలో 5జీ ట్రయల్స్‌కు టెలికాం మంత్రిత్వశాఖ మంగళవారం అనుమతి ఇచ్చింది. ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఎంటీఎన్‌లు 5జీ ట్రయల్స్‌ను ప్రారంభించవచ్చని అయితే, చైనా సంస్థలకు చెందిన ఏ టెక్నాలజీని వాడకూడదని స్పష్టం చేసింది. ఎరిక్సన్, నోకియా, శాంసంగ్, సీ-డాట్‌తో పాటు రిలయన్స్ జియో సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ సాయంతో 5జీ ట్రయల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలకు అనుమతి లభించడం విశేషం.
* కేంద్ర ప్రభుత్వం సోమవారం డిజిటల్ పన్నువిభాగంలోకి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే నాన్‌రెసిడెంట్ టెక్నాలజీ కంపెనీల ఆదాయం రూ.2 కోట్లు దాటినా లేదా వినియోగదారుల సంఖ్య 3లక్షలకు మించిన కంపెనీలు సవరించిన పన్ను ఒప్పందాల ప్రకారం డిజిటల్ పన్ను పరిధిలోకి వస్తాయని పేర్కొంది. అంటే.. గూగుల్, ఫేస్బుక్, నెట్‌ఫ్లిక్స్ వంటివి కూడా ఇప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2018-19లో ప్రవేశపెట్టిన సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ (ఎస్ఈపీ) నిబంధన కింద వీటిని తీసుకొచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
* ఓ పక్క భారత్‌లో కొవిడ్ కేసులు పెరిగిపోతుండటంతో దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ కీలక నిర్ణయం తీసుకొంది. తన ఉత్పత్తి సామర్థ్యంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. దేశంలో ఆక్సిజన్ అవసరాలు తీర్చేందుకు కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేసింది. కంపెనీ ఛైర్మన్ ఆర్సీ భార్గవ బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ ‘‘చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్లు, కర్ఫ్యూలు విధించడంతో విక్రయాలపై ప్రభావం పడింది. దాదాపు సగానికిపైగా కార్డీలర్షిప్లు మూతపడ్డాయి. ఇప్పటికీ మేము 50శాతం నుంచి 60శాతం సామర్థ్యంతో కార్లను ఉత్పత్తి చేయగలిగే స్థితిలో ఉన్నాము’’ అని పేర్కొన్నారు.