Kids

నలభీమపాకం వెనుక కథా కమామీషు ఇది

నలభీమపాకం వెనుక కథా కమామీషు ఇది

     మనిషి జీవితంలో అత్యంత ప్రాధాన్యత వహించేది భోజనమే. ప్రతి మనిషి రోజూ అత్యంత రుచిగల ఆహార పదార్థాలు తినాలని కోరుకుంటా వుంటాడు. ఎవరైనా సరే మన మనసును దోచే విధంగా కమ్మని వంట చేసి పెడితే, ఆ రుచికి పొంగిపోయి ఆహా! నలభీమపాకంలా ఎంత రుచిగా వుందో అని చేసిన వాళ్ళను పొగుడుతా వుంటారు.
   కొందరు వంట చేస్తే మరలా మరలా తినాలనిపిస్తుంది. కొందరు చేస్తే ఎందుకు బతుకుతున్నాంరా భగవంతుడా అనిపిస్తుంది. వంట చేయడం గూడా ఒక పెద్ద కళ. అన్నీ సమపాళ్ళలో సమయానుసారం కలిసినప్పుడే ఆ కమ్మని రుచి సాధ్యం. నిజానికి ఇళ్ళలో వంట వండేదంతా స్త్రీలే అయినా విచిత్రంగా హోటళ్ళలో, పెళ్ళిళ్ళలో పెద్ద ఎత్తున రుచికరమైన వంటలు చేస్తున్నది మాత్రం మగవాళ్ళే. పూర్వకాలం నుంచీ ఈ సంప్రదాయం ఇలాగే సాగుతుంది.

నలుడు, భీముడు వంట చేయడంలో ప్రసిద్ధులని ఇతిహాసాలనుంచి గ్రహించవచ్చు. భీముడు మొదటినుంచీ భోజన ప్రియుడే. అందుకే తినడంతో బాటు చేయడం గూడా నేర్చుకొని వుండవచ్చు. అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో వలలుడు అనే పేరుతో వంటవానిగా చేరాడు. రాజును వివిధ రకాలైన కమ్మని వంటలతో మెప్పించాడు. ఎటువంటి ఆహార పదార్థాలనయినా నోరూరించేలా చేయగల నేర్పరి అతడు.

ఇక నలుడు గూడా అంతే, రాజయినప్పటికి విధి ప్రభావంచే అన్ని కోల్పోయి చివరికి బుడుపరుడు అనే రాజు వద్ద బాహుకుడు అనే పేరుతో వంటవానిగా కుదిరాడు. నిజానికి నలుడు పెద్ద వంటగాడేమీ కాదు. ఒక వార్తా ప్రభావం చేత నలుడు ఎలా వంటచేసినా దానికి అద్భుతమైన రుచి వచ్చి తినే వాళ్ళు మైమరిచిపోయేవారట. అందుకే అత్యంత రుచికరమైన వంటలు చేసే వారిద్దరి పేర్లను కలిపి “నలభీమపాకం” అనే జాతీయం పుట్టింది.

నలభీమపాకం అంటే నోరూరించే పాకమని అర్థం
*********
**********