* దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీసుజుకీ మెయింటనెన్స్ షట్‌డౌన్‌ను పొడిగించింది. గత నెలలో మే1 నుంచి 9వ తేదీ వరకు షట్‌డౌన్ ఉంటుందని వెల్లడించిన మారుతీ.. ఇప్పుడు దానిని మే 16వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీకి దాఖలు చేసిన రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు చెందిన సుజుకీ మోటార్ గుజరాత్ ప్లాంట్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకొంది.
* ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ అరుదైన ఘనత సాధించింది. 2021లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఎదుగుతున్న రిటైలర్ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయం డెలాయిట్ నిర్వహించిన గ్లోబల్ రిటైల్ పవర్ హౌసెస్ సర్వేలో తేలింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రిటైల్స్‌లో 53వ స్థానంలో నిలిచింది. గతంలో 56వ స్థానంలో ఉండగా ఈ సారి మూడు స్థానాలను మెరుగుపర్చుకుంది.
* డీ-మార్ట్ లాభాల పంట పండింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.413.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.271.28 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 52.56 శాతం అధికం. అవెన్యూ సూపర్‌మార్ట్ లిమిటెడ్‌కు చెందిన డీ-మార్ట్‌కు గత త్రైమాసికానికిగాను రూ.7,411.68 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.6,255. 93 కోట్ల ఆదాయంతో పోలిస్తే 18.47 శాతం అధికమైంది. సమీక్షకాలంలో నిర్వహణ ఖర్చులు 16.09 శాతం ఎగబాకి రూ.6,916.24 కోట్లకు చేరుకున్నాయి.
* గతేడాది లాక్‌డౌన్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే పరిశ్రమలపై మరోసారి కరోనా ప్రభావం పడింది. పెరుగుతున్న కరోనా కేసులు, మళ్లీ లాక్‌డౌన్ వస్తుందనే భయంతో ఇతర రాష్ర్టాల కార్మికులు క్రమంగా సొంతూళ్లకు పయనమవుతుండగా.. ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతులు నిలిచిపోవడంతో ముడిసరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ప్లాస్టిక్ ధరలు ఇప్పటికే రెట్టింపు కాగా.. సిమెంట్, స్టీల్ రేట్లు కూడా భారీగా పెరిగాయి. రాష్ట్రంలోని ప్లాస్టిక్ పరిశ్రమలకు గుజరాత్, మహారాష్ట్రలోని రిలయన్స్, గెయిల్ సంస్థలనుంచే ఎక్కువగా ముడిసరుకు దిగుమతి అవుతున్నది. ఆ రెండు రాష్ర్టాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో కార్మికులు స్వరాష్ర్టాల బాట పట్టారు. దీంతో ఉత్పత్తి తగ్గడం, రవాణా సౌకర్యం కూడా తగ్గిపోవడంతో ప్లాస్టిక్ ముడిసరుకుకు రెక్కలొచ్చాయి. గతంలో రూ.8వేలు ఉన్న టన్ను ప్లాస్టిక్ ధర రూ.15వేలకు చేరుకున్నది.
* ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రైవేటు వాహనాల కొనుగోళ్లు తగ్గినా.. మారుతి సుజుకీ మాత్రం సత్తా చాటుతూనే ఉంది. తాజాగా ఏప్రిల్ నెలలో ఎక్కువగా అమ్ముడైన టాప్ 10 మోడల్స్‌లో 7 ఆ సంస్థకు చెందినవే కావడం విశేషం. ఇందులోనూ మారుతీ సుజుకీ వేగన్ ఆర్ టాప్‌లో నిలిచింది. ఏప్రిల్ నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారు ఇదే. ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా 18,656 వేగన్ ఆర్ కార్లు అమ్ముడైనట్లు ఆటోమోటివ్ అనలిటిక్స్ అందించే సంస్థ జాటో డైనమిక్స్ ఇండియా వెల్లడించింది.