* అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా.. చైనా తీరుపై తీవ్రంగా మండిపడింది. తన అంతరిక్ష శిథిలాల విషయంలో బాధ్యతాయుతమైన ప్రమాణాలను పాటించడంలో చైనా ఘోరంగా విఫలమైందని విమర్శించింది. చైనా అతిపెద్ద రాకెట్ అయిన లాంగ్ మార్చ్ 5బీ నియంత్రణ కోల్పోయి ఆదివారం ఉదయం హిందూ మహాసముద్రంలో కూలిపోయిన కొద్ది గంటల తర్వాత నాసా దీనిపై స్పందించింది. నాసా అడ్మినిస్ట్రేలర్ బిల్ నెల్సన్ చైనా స్పేస్ ప్రోగ్రామ్‌ను దుయ్యబట్టారు. అంతరిక్షంపై కన్నేసిన దేశాలు వాళ్ల స్పేస్ ఆబ్జెక్ట్స్ తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు భూమిపై ఉన్న ప్రజలు, వాళ్ల ఆస్తులకు ముప్పు కలగకుండా చూడాలి. ఈ ఆపరేషన్లలో పారదర్శకతను పెంచాలి అని నెల్సన్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
* రూ.2.90 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. ఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మేరకు మంచిర్యాల ఇన్‌స్పెక్టర్ ముత్తి లింగయ్య తన సిబ్బందితో ఓ వేర్‌హౌస్‌పై రైడ్ చేశారు. ఈ సందర్భంగా రూ.2.90 లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వేర్‌హౌస్ ఆదిత్యా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందినదిగా సమాచారం. నిషేధిత ఉత్పత్తులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు.
* వచ్చే నెల ఒకటో తేదీ నుంచి గూగుల్ ఉచిత సేవలు నిలిచిపోనున్నాయి. ఒకవేళ ఎవరైనా వినియోగదారులు గూగుల్ సేవలను పొందాలనుకుంటే జూన్ 1 నుంచి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులకు విషయం తెలియడానికి గాను తొలుత గూగుల్ ఫొటో ఉచిత క్లౌడ్ నిల్వ సౌకర్యాన్ని నిలిపివేస్తున్నది. గూగుల్ ఫొటో క్లాట్ స్టోరేజ్‌లో ఫొటోలు సేవ్ చేసుకోవాలంటే ఇకపై గూగుల్ సంస్థ పేర్కొన్న విధంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం, గూగుల్ సంస్థ తమ వినియోగదారులకు అపరిమిత ఉచిత నిల్వ సేవలను అందిస్తున్నది. దీని వల్ల వినియోగదారులు వారి ఫొటోలు, ఇతర పత్రాలను ఆన్‌లైన్‌లో నిల్వ చేసుకునే వీలుండేది. వీటిని ఇంటర్నెట్ ద్వారా ఎక్కడైనా అందుబాటులో తీసుకోవచ్చేది. అయితే, ఈ సేవలకు ఛార్జీలు చెల్లించిన మీదట వచ్చే జూన్ నెల నుంచి వాడుకోవచ్చని గూగుల్ సంస్థ స్పష్టం చేసింది. అయితే, వచ్చే నెల నుంచి వినియోగదారులకు 15 జీబీ ఉచిత క్లౌడ్ నిల్వను మాత్రమే అందించనున్నది. వినియోగదారులు దీని కంటే ఎక్కువ ఫొటోలు లేదా పత్రాలను ఆన్‌లైన్‌లో నిల్వ చేయాలనుకుంటే మాత్రం వారు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
* కరోనా మహమ్మారి బారినపడి బాలీవుడ్ నటి, బీజేపీ నాయకురాలు హేమమాలిని సెక్రెటరీ మార్కండ్ మెహతా (80) మృతిచెందారు. ఈ విషయాన్ని హేమమాలిని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దాదాపు 40 ఏండ్లుగా నా కోసం అహర్నిశలు, అలుపెరుగకుండా కష్టపడి పనిచేసిన నా సెక్రెటరీ మార్కండ్ మెహతా మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. ఈ 40 ఏండ్లలో ఆయన మా కుటుంబంలో ఒకరిగా కలిసిపోయారు. కరోనా కారణంగా ఇప్పుడు ఆయనను కోల్పోయాం. ఆయన లేని లోటు పూడ్చలేనిది అని హేమమాలిని ట్వీట్ చేశారు.
* హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో సకాలంలో ఆక్సిజన్ అందక ముగ్గురు బాధితులు మృతి చెందారు. ప్రాణవాయువు లేక 2 గంటలుగా 20 మంది రోగులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు నిర్లక్ష్యం చూపారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి ఆక్సిజన్ రవాణా ఆలస్యమైందని, అందుకే సమయానికి అందించలేకపోయామని అధికారులు చెబుతున్నారు. జడ్చర్ల నుంచి ఆస్పత్రికి నిన్న రాత్రే ఆక్సిజన్ ట్యాంకర్ రావాల్సి ఉంది. చిరునామా తెలియకపోవడంతో ట్యాంకర్ డ్రైవర్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లిపోయాడు. దీనిపై నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసుల సహకారంతో కింగ్ కోఠి ఆస్పత్రికి ఆక్సిజన్ ట్యాంకర్ చేరింది. అయితే అప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
* టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది అందాల భామ చార్మి. ఒకప్పుడు హీరోయిన్‌గా తన గ్లామర్‌తో యూత్‌ని అట్రాక్ట్ చేసిన ఈ పంజాబీ బ్యూటీ.. ఇప్పుడు నిర్మాతగా మారి వరుస విజయాలతో దూసుకెళ్తుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభిన ఆమె దాని తాలూకు అన్ని వ్యవహారాలు భుజాలపై వేసుకుంది. ఇలా కెరీర్ పరంగా దూసుకెళ్తున్న చార్మి త్వరలో పెళ్లి చేసుకోతుందని ఇటీవల వార్తలు వినిపించాయి. తాజాగా ఈ పెళ్లి వార్తలపై చార్మి స్పందించింది. తన పెళ్లివార్తలల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ రూమర్స్ అని కొట్టిపడేసింది. పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేసింది. ‘ప్రస్తుతం కెరీర్ హాయిగా, సాఫీగా సాగిపోతోంది. ఈ లైఫ్ నాకు చాలా సంతోషకరంగా ఉంది. నా జీవితంలో పెళ్లి చేసుకోవడం వంటి తప్పు చేయను’ అని చార్మి ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఫేక్ రైటర్స్‌పై తనదైన శైలీలో స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ‘తప్పుడు స్టోరీలతో అట్రాక్ట్ చేస్తున్న మిమ్మల్ని అభినందించవచ్చు’ వ్యగ్యంగా ట్వీట్ చేసింది చార్మి. చార్మి ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్. కరణ్ జోహార్ మరో నిర్మాత.
* తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 55,358 నమూనాలను పరీక్షించగా 4976 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,97,361కి చేరింది. కరోనా మహమ్మారితో తాజాగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 2,739కి పెరిగింది. రాష్ట్రంలో 7,646 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 851 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరిలో 384, మహబూబ్‌నగర్‌లో 208 కేసులు నమోదైనట్లు పేర్కొంది.
* రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. కరోనా కట్టడి చర్యలు, ఔషధాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేసీఆర్ వారితో చర్చిస్తున్నారు.