Movies

టాలీవుడ్‌లోకి భార్యాభర్తలు

టాలీవుడ్‌లోకి భార్యాభర్తలు

నజ్రియా నజీమ్‌.. పేరు వింటే గుర్తు పట్టడం కష్టమే. కానీ, ఆ కలువ కండ్లను చూడగానే ఓ పట్టాన మరచిపోలేం. ఆ మధ్య తెలుగులో డబ్‌ అయిన తమిళ సినిమా ‘రాజా రాణి’తో కుర్రకారు మనసును దోచింది నజ్రియా. నానికి జోడీగా ‘అంటే సుందరానికి..’ అంటూ టాలీవుడ్‌లోఎంట్రీ ఇవ్వబోతున్నదీ మలయాళ మాంత్రికురాలు. నజ్రియా నజీమ్‌ గురించిన కొన్ని విశేషాలు..

కేరళలోని త్రివేండ్రం నజ్రియా స్వస్థలం. పదకొండేండ్లకే క్విజ్‌ షో యాంకర్‌గా చేసింది. పన్నెండేండ్లకే చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమా కెరీర్‌ మొదలుపెట్టింది. తర్వాత వరుసగా తమిళ, మలయాళ సినిమాలతో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నది. బాలనటిగా కెరీర్‌ ప్రారంభించిన నజ్రియా ‘నీరమ్‌’, ‘రాజా రాణి’, ‘బెంగళూర్‌ డేస్‌’ వంటి సినిమాల్లో నటనకుగాను విమర్శకుల ప్రశంసలు పొందింది. ‘ఉత్తమ నటి’ అవార్డులూ సాధించింది. హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే ‘బెంగళూర్‌ డేస్‌’లో తన కో-స్టార్‌ ఫరాద్‌ ఫాజిల్‌ను పెండ్లాడి సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. నాలుగేండ్ల తర్వాత ‘కూద్‌’తో రీ ఎంట్రీ ఇచ్చింది.

అనేక టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించిన నజ్రియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా సినిమాల్లో నటిస్తూనే నిర్మాణ రంగం వైపూ అడుగులేసింది. భర్త ఫరాద్‌ సహకారంతో ఇప్పటి వరకు మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. అన్నట్టు, ‘అంటే సుందరానికి’ సినిమా కోసం తానే డబ్బింగ్‌ చెప్పుకొంటున్నది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. సోషల్‌ మీడియాద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది నజ్రియా. తెలుగు సినిమా ఫస్ట్‌ డే షూట్‌ విశేషాలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. “అందరికీ నమస్కారం. ఈరోజు నా తొలి తెలుగు మూవీ షూటింగ్‌లో పాల్గొన్నాను. ఫస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎప్పుడూ విలువైందే. ‘అంటే సుందరానికి’ చిత్రం నాకెప్పుడూ ప్రత్యేకమే” అంటూ ముద్దుముద్దుగా మనోభావాల్ని వెల్లడించింది. నజ్రియా భర్త ఫరాద్‌ ‘పుష్ప’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా వస్తున్న ఈ సినిమాలో ఫరాద్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ జంట తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టు కుంటుందో చూడాలి మరి.