* చదువుకునేందుకు పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తుపాకీ గుళ్లకు బలయ్యారు. పాఠశాల ఆవరణంతా రక్తం ఏరులై పారింది. ఓ ఆగంతకురాలి దుశ్చర్యతో అమాయకులైన చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణభయంతో ఆమె బారి నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు చిన్నారులు పాఠశాల భవనం మూడో అంతస్తు పై నుంచి దూకారు. అయితే తీవ్ర గాయాలతో మృతి చెందారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది చిన్నారులు ప్రాణాలు వదిలారు. ఈ ఘటన రష్యాలోని కజాన్ పట్టణంలో చోటుచేసుకుంది.
* భర్త నిర్వహిస్తున్న పండ్ల రసం కేంద్రానికి బయలుదేరిన నవ వధువును ఓ ద్విచక్ర వాహనదారుడు మద్యం మత్తులో ఢీకొని బలిగొన్నాడు. ఆర్జీఐఏ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా పామూరు మండలం రసాయిపేటకు చెందిన కొంకిని వెంగళరావుకు అదే ప్రాంతానికి చెందిన మమత(18)తో మూడు నెలల క్రితం వివాహమైంది. బతుకుదెరువు కోసం దంపతులు శంషాబాద్ ఇంద్రానగర్‌లో అద్దెకుంటున్నారు. వెంగళరావు స్థానికంగా జ్యూస్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. మమత భర్త వద్దకు వెళుతున్న క్రమంలో ఇంద్రానగర్‌లో బస్సు కోసం ఎదురు చూస్తోంది. కాపలాదారుగా పనిచేస్తున్న శంషాబాద్ మండలం, చౌదరిగూడకు చెందిన మల్లేష్ బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. అతి వేగంలో అదుపు తప్పి మమతను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మల్లేష్ మద్యం మత్తులో ఉన్నట్లు తేలడంతో ఈమేరకు కేసు నమోదు చేశారు.
* నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చండ్రపడియాలో విషాదం చోటు చేసుకుంది. ఓ రసాయనిక పరిశ్రమలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిశ్రమ వద్దకు రెవెన్యూ, పోలీసు సిబ్బంది చేరుకుని విచారణ చేపట్టారు.
* ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ పెళ్లి వింత కారణంతో రద్దయింది. వరడు రెండో ఎక్కం చెప్పలేదని వధువు వివాహానికి నిరాకరించింది. మహోబా జిల్లాలో ఈ ఘటన జరిగింది. వరుడు రంజిత్ అహిర్వార్ ప్రవర్తన చూసి అనుమానం వచ్చిన వధువు మాయ.. అతణ్ని రెండో ఎక్కం చెప్పమని అడిగింది. దీనికి పెళ్లికొడుకు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో అతణ్ని పెళ్లి చేసుకోనని వధువు తేల్చి చెప్పింది. అంతేకాదు..వివాహ ఏర్పాటుకు అయిన ఖర్చును వరుడి కుటుంబమే చెల్లించాలని వధువు కుటుంబం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.