కుక్కను కుక్క అని సంబోధించినందుకు ఎదురింటి వాళ్లపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు ఆ కుక్క యజమానులు. కుక్కను కుక్క అంటే తప్పేంటి అని ప్రశ్నించగా మళ్లీ దాడికి పాల్పడ్డారు ఆ ప్రబుద్ధులు. హర్యానాలోని గురుగ్రామ్ పట్టణంలో గత శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్ సైబర్‌సిటీలోని జ్యోతి పార్క్ ఏరియాలో సుధీర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. వారి ఎదురింట్లో టామీ అనే ఒక పెంపుడు కుక్క ఉన్నది. ఆ కుక్క తరచూ దారివెంట వెళ్లేవాళ్ల వెంటపడుతున్నది. అంతేగాక సుధీర్ పిల్లలు ఆడుకోవడానికి ఇంటి ముందుకు వచ్చినా ఆ కుక్క వారిని భయపెడుతున్నది. శుక్రవారం కూడా అలాగే జరుగడంతో సుధీర్ ఎదిరింటి వాళ్లను పిలిచి కుక్కను గొలుసు పెట్టి కట్టేయండి, పిల్లలను భయపెడుతున్నది అని చెప్పాడు. దాంతో ఆగ్రహానికి లోనైన కుక్క యజమాని నా టామీని కుక్క అంటావా అంటూ గొడవకు దిగాడు. కుక్కను కుక్క అంటే తప్పేంటి అని ప్రశ్నించడంతో దాడికి పాల్పడ్డాడు. సుధీర్ కుటుంబసభ్యులు అడ్డుకోవడంతో వాళ్లపైనా దాడి చేశాడు. అంతలోనే అతని కుటుంబసభ్యులు కూడా వచ్చి సుధీర్ కుంటుంబంపై మూకుమ్మడి దాడి చేశారు. కాగా, ఈ ఘటనపై బాధితుడు సుధీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాని నిందితుడు అయిన కుక్క యజమానిని అదుపులోకి తీసుకున్నారు.
కుక్కని కుక్క అన్నందుకు కర్రలతో దాడి
Related tags :