క్రికెట్ నిబంధనలను రూపొందించి, వాటి అమల్లోకి తెచ్చే మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ).. ప్రతిపాదిత వెదురు బ్యాట్లను తిరస్కరించింది. ప్రస్తుత ఆట నిబంధనలకు వెదురు బ్యాట్లు విరుద్ధమని, అవి చెల్లవని ఎంసీసీ స్పష్టం చేసింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ అధ్యయన బృందం.. వెదురు బ్యాట్లతో షాట్లు ఆడటం తేలికని, వాటి మన్నిక బాగుంటుందని తేల్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లిష్ లేదా కశ్మీర్ విల్లోతో పోలిస్తే వెదురు లభ్యత ఎక్కువని, వీటితో తయారు చేసే బ్యాట్ల ధర కూడా తక్కువగా ఉంటుందని ఈ బృందం పేర్కొంది. ‘‘ప్రస్తుత క్రికెట్ నిబంధన 5.3. ప్రకారం బ్యాట్ బ్లేడ్ కచ్చితంగా చెక్కతో మాత్రమే తయారు చేయాలి. దీనికి ప్రత్యామ్నాయంగా బ్యాట్‌లో వెదురు ఉపయోగించాలంటే ఈ నిబంధనను మార్చాల్సి ఉంటుంది. వెదురును చెక్కగా పరిగణించినప్పటికీ ప్రస్తుత నిబంధన ప్రకారం అది చెల్లుబాటు కాదు. బ్యాటుకు, బంతికి మధ్య సమతూకం ఉండేలా చూడటం ఎంసీసీ బాధ్యత. బ్యాట్ శక్తిని పెంచే విషయంలో నిబంధనలు మార్చాలంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. బ్యాట్ల తయారీ ఖర్చును తగ్గించే కోణంలో అయితే దీనిపై మరింత పరిశోధన అవసరం’’ అని ఎంసీసీ పేర్కొంది.
క్రికెట్ వెదురు బ్యాట్లపై సరికొత్త నిబంధన
Related tags :