సర్వరోగ నివారిణి పేరుతో ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం ఆయిల్ పుల్లింగ్ అని వచ్చింది. పొద్దున్న ఎవరికి ఫోన్ చేసిన మా ఆయన ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నాడనే వాళ్ళు. అదీ ఆగిపోయింది.
తరువాత నీళ్ళ రాజు వచ్చాడు. కుండలు కుండలు నీళ్ళు తాగితే రోగాలు మాయం అన్నాడు. అదీ పోయింది.
పశువుల మాదిరి పచ్చి కూర గాయలు తింటే బలమని ప్రచారం చేశాడు. అదీ పోయింది.
ఈ మధ్య ఒక ఆయన చికెన్ తింటె కొవ్వు తగ్గుద్దని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొకాయన వచ్చి రాగులు, సజ్జలు, జొన్నలు, కూరగాయలు అన్నీ కలిపి రసం చేసుకొని తాగండీ అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వము వారేమో యోగా చెయ్యండి రొగాలు మటు మాయమంటుంది.
ఆ మధ్య, అంటే చాన్నాళ్ళ క్రిందట గోదావరి జిల్లాల నుంచి ఒక రాజు గారు వచ్చి, ‘ఉప్పా..! మీరు ఉప్పు తింటున్నారా? అడవిలో జంతువులూ ఉప్పు తినట్లేదు, ఆకాశంలో పక్షులూ ఉప్పు తినట్లేదు. మరి మనుషులెందుకు ఉప్పు తింటున్నారు? ఛీ ఛీ’ అన్నాడు. జనమంతా ఉప్పుని విసిరికొట్టారు.
అంతటితో ఊరుకున్నాడా? ‘నూనా, నెయ్యా – మీరంతా నూనె తాగుతున్నారా? నెయ్యి తింటున్నారా?’ మళ్ళీ సేమ్ డైలాగ్ ‘అడవిలో జంతువులకి నూనె మిల్లులున్నాయా?, అవి డబ్బాలు డబ్బాలు నూనె తాగుతున్నాయా?’ అన్నాడు.
నూనె చుక్క లేకుండా బజ్జీలూ, గారెలూ, పకోడీలు అనబడే పిండి వంటల్ని ఎలా వండుకోవాలో జనాలందరికీ వొలిచి చేతిలో పెట్టినట్లు చెప్పాడు కూడా. సరే అని జనమంతా నూనె డబ్బాలకి సెలవిచ్చి, చుక్కనూనెతో తాళింపులు మొదలు పెట్టారు…!
జనాలంతా ఒక పక్క ఎండు రొయ్యలై, బుద్ధిగా మాటవినే దశకొచ్చారన్న నమ్మకం కుదిరాక, ఒకానొక మంచిరోజు చూసుకుని కృష్ణానది పక్కన మాంఛి స్థలంలో ‘ప్రకృతి ఆహార ఆశ్రమం’ అని ఒకటి మొదలైంది.
ఇంకేఁవుందీ?రోజుకింత, నెలకింతని ప్యాకేజ్ రూపంలో వసూళ్లు చేస్తూ ప్రజలకి ఉప్పూ, నూనె లేని విందులు చేస్తూ, మూడు పచ్చి కూర ముక్కలూ ఆరు ఆకుకూర రసాలతో నిత్యనూతనంగా విలసిల్లుతుంది…!
*
సరే ఇది ఇలా ఉండగా, ఇంకొకాయన ఎవరో రాగి చెంబులంట.. రాగి చెంబుల్లో నీళ్ళు నింపి చంద్రుడి ఎదురుగా పెట్టి, తెల్లారి ఆ నీళ్ళు తాగితే అసలు చావే రాదని ఘంటాపథంగా చెప్పాడు. ఇంకేవుంది, కొట్లలో పడి రాగి చెంబుల వేట…! కాస్త గట్టి బుర్రోడు, గురువుగారు చెప్పిన దానికి ఇంకాస్త తోక తగిలించి, అతుకేయని రాగి చెంబు అన్నాడు..! షాపుల్లోకెళ్ళి లిప్ స్టిక్ వేసుకున్న పెదాలతో రాగి చెంబులున్నాయా అని నాజూగ్గా అడగటం మొదలైంది.
*
అలా అలా వెన్నెల్లో పెట్టిన రాగి చెంబుల్లో నీళ్ళు తాగుతూ, ఉప్పు, నూనె, పులుపూ, తీపీ లేని రాజు గారి వంటలు తింటూ, రెండు వందలేళ్ళు గ్యారంటీ అనుకుంటున్న దశలో గబుక్కున మళ్ళీ కృష్ణాజిల్లా నుంచే మహారాజశ్రీ మాచినేని ఉద్బవించారు!
“నూనె మానేసారా? పిచ్చోల్లారా! మిల్లులో ఆడించిన కొబ్బరి నూనె వంద గ్రాములు తాగండి, ఇక చూడండి!’ అన్నాడు. “నేను చెప్పింది తప్ప మీరు ఇంకేవీ తినకూడదు…! నో నో అంటే నో…!” అన్నాడు కూడా. ఇంకేఁవుంది, కొబ్బరి చిప్పలు సంచిలో యేసుకుని గానుగలంట బడ్డారు జనం…! మాచినేని ప్రొడక్ట్స్ మనకందుబాటులోకొచ్చే మంచిరోజు కోసం మనమంతా ఎదురు చూద్దాం…!
*
సీమ నుంచో, కర్నాటక నుంచో స్వతంత్ర శాస్త్రవేత్తనంటూ (అనుకుంటూ) ఇంకొక సామొచ్చి, ‘పురుగుమందులు తింటున్నారా? ఇళ్ళల్లో రోగాల పంట పండిస్తున్నారా?‘ అంటూ జనాలను ఆహార జ్ఞాన దారుల్లో పరుగులు పెట్టించడం మొదలు పెట్టాడు. ‘పురుగు మందులు లేని చిరుధాన్యాలు తినండీ! మీ ఆరోగ్యాన్ని మీరే సంరక్షించుకోండి!’ అని ఆషాడ మాసం డిస్కౌంట్ లెక్క ప్రజలకి ఆరోగ్య విజ్ఞానాన్ని చవగ్గా పంచి పెడుతున్నాడు.
‘చిరు’ ధాన్యాలండోయ్, ‘చిరు ధాన్యాలు’, ‘సిరి ధాన్యాలు’ అంటూ, ‘పాలు తాగితే హార్మోన్స్ ఇన్ బాలన్స్ అయి ఛస్తారు, సిరి ధాన్యాలు తినండి – చావకుండా కలకాలం బ్రతకండి’ అంటున్నాడు. ఇంకేఁవుంది, తెల్లటి మొలకొలుకల అన్నం, కర్నూలు సోనా బియ్యపు అన్నం తినే బేబక్కాయిలంతా “సామలున్నాయా? అరికలున్నాయా? సొజ్జలున్నాయా?” అని షాపులాల్లని పరుగులు దీయిస్తున్నారు.
*
వీళ్ళంతా ఇలా ఉన్నారు నేనేం తక్కువా అంటూ, ”మట్టి కుండల్లో వండుకుని తినడం మంచి ఆరోగ్యం” అని మూలనున్న మరో మట్టి శాస్త్రవేత్త గారు, పురావస్తు గృహంలో నిద్ర లేచి మట్టి కుండ యాష్ ట్యాగ్ అన్నాడు.
*
విచిత్రం ఏంటంటే, వీళ్ళెవరూ డాక్టర్లు కాదు. ఆరోగ్య శాస్త్రం చదువుకున్న వైద్యులని మాత్రం ధాటీగా విమర్శిస్తారు.
ఆ ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు కానీ, ఈ వినే జనాలు కానీ మిద్దె మీద మొక్కలు పెట్టుకుందాం అనుకుంటారే కానీ, ‘పురుగు మందులని బ్యాన్ చేయమ’ని ప్రభుత్వాలను అడగరు.
ఆరోగ్యానికి హానికదా ‘లిక్కర్ బ్యాన్ చెయ్యండీ’ అని అస్సలు అడగరు.
ధూమపానం చెరుపు చేస్తుంది కదా, ‘సిగరెట్లు బ్యాన్ చెయ్యండీ’ అని కూడా అడగరు.
చెయ్యాల్సింది చేయకుండా ఎంతకాలమని వాళ్ళు చెప్పారనీ, వీళ్ళు చెప్పారనీ ఆరోగ్యం కోసం చెంబులేసుకుని, సంచులేసుకుని పరుగెడతారు