Sports

టొక్యో ఒలంపిక్స్ పట్ల జపనీయుల వ్యతిరేకత

టొక్యో ఒలంపిక్స్ పట్ల జపనీయుల వ్యతిరేకత

కరోనా కాలంలో టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహించవద్దంటూ జపాన్‌ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. తాజాగా అక్కడ నిర్వహించిన ఓ సర్వేలో 60 శాతం మంది ఆ క్రీడలను రద్దు చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 39 శాతం మంది ప్రజలు ఒలింపిక్స్‌ను నిర్వహించాలని తెలిపారు. వీళ్లలో 23 శాతం మంది ఖాళీ స్టేడియాల్లోనే పోటీలను నిర్వహించాలని చెప్పారు. ఇప్పటికే విదేశీ ప్రేక్షకులపై నిషేధం విధించిన నిర్వాహకులు.. స్వదేశీ ప్రజల విషయంపై వచ్చే నెలలో నిర్ణయం తీసుకోనున్నారు. టీబీఎస్‌ న్యూస్‌ నిర్వహించిన మరో సర్వేలో 65 శాతం మంది క్రీడలను రద్దు చేయాలని లేదా మళ్లీ వాయిదా వేయాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఒలింపిక్స్‌ను కచ్చితంగా నిర్వహిస్తామని చెబుతూ వస్తున్న ఆ దేశ ప్రధాని సుగా.. సోమవారం మాత్రం ఆ క్రీడలపై తుది నిర్ణయం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) తీసుకోవాలని చెప్పడం గమనార్హం. తనకు తొలి ప్రాధాన్యం క్రీడలు కాదని, ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రధాని అన్నారు.