Kids

1000 మంది చిన్నారులకు కోవిడ్

1000 మంది చిన్నారులకు కోవిడ్

కరోనా మహమ్మారి చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశముందని వైద్యనిపుణులు చెబుతూనే ఉన్నారు. ఆ హెచ్చరికలకు మరింత బలం చేకూర్చేలా ఇటీవల కాలంలో పిల్లలపైనా కరోనా ప్రభావం కనిపిస్తోంది.ఉత్తరాఖండ్‌లో 10 రోజుల వ్యవధిలో 9 ఏళ్లలోపు 1,000 మంది చిన్నారులకు కరోనా సోకినట్లు ఓ సర్వేలో తేలింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం కూడా అందింది. వీరిలో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండగా మరికొందరు చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరారు.
ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ఏప్రిల్‌ 1- 15 తేదీల మధ్య 264 మంది చిన్నారులు కరోనా బారిన పడగా క్రమంగా అది పెరుగుతూ వచ్చింది. ఏప్రిల్‌ 16- 30 తేదీల్లో 1,053 మందికి, మే 1- 14 తేదీల మధ్య 1,618 మంది చిన్నారులకు వైరస్‌ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిని బట్టి చిన్నారులపై కొవిడ్‌ ప్రభావం అంతకంతకూ పెరుగుతోందని స్పష్టమవుతోంది.
కేవలం ఉత్తరాఖండ్‌లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగానూ చిన్నారుల్లో పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులపై వ్యాక్సిన్ల ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం అనుతిచ్చింది. ఇప్పటికే అనేక సంస్థలు ఆరు నెలల చిన్నారుల నుంచి 18ఏళ్ల లోపు వారిపై జరుపుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ వివిధ దశల్లో ఉన్నాయి. రెండేళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల లోపు వారిపై కొవాగ్జిన్‌ ప్రయోగాలకు భారత్‌ బయోటెక్‌కు అనుమతి లభించిన విషయం తెలిసిందే. భారత్‌ వెలుపల ఫైజర్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా లాంటి సంస్థలు కూడా పిల్లలపై టీకా ప్రయోగాలు చేస్తున్నాయి. 12-18 ఏళ్ల వారిపై మోడెర్నా టీకా ప్రయోగ ఫలితాలు త్వరలో రానున్నాయి. 2-11ఏళ్ల వారిపైనా ఈ సంస్థ క్లినికల్‌ ట్రయల్స్‌ చేయనుంది. ఇక ఫైజర్‌ సంస్థ 12ఏళ్ల పైబడిన వారి కోసం తయారు చేసి టీకాకు అమెరికా, కెనడా ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. త్వరలోనే ఈ సంస్థ నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య చిన్నారులపై కూడా పరీక్షలు జరపనుంది. వీటితో పాటు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, నొవావాక్స్‌ కూడా పిల్లలపై ప్రయోగాలు వ్యాక్సిన్‌ ప్రయోగాలు చేస్తున్నాయి.