Movies

ఆ రోజుల్లోనే భయంకరమైన కోల్డ్ వార్

Bhanumathi Ghantasala Saluri Rajeswara Rao Clashes

భరణి పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన చిత్రాల్లో విప్ర నారాయణ ఒకటి. ఇందులో టైటిల్‌ పాత్రను అక్కినేని నాగేశ్వరరావు, దేవదేవి పాత్రను భానుమతి పోషించారు. భరణి సంస్థ నిర్మించిన లైలా మజ్ను, ప్రేమ, చండిరానీ చిత్రాల్లో ఘంటసాల పాటలే ఉన్నాయి. అక్కినేనికి ఘంటసాల తప్ప ఇక ఎవరు పాడినా బాగోదు.. అని పరిశ్రమ వర్గాలు, ప్రేక్షకులు ఫిక్స్‌ అయిన రోజుల్లో .. చక్రపాణి చిత్రంలో నాగేశ్వరరావుకు ఏ.ఎం.రాజాతో పాడించడం అందరినీ ఆశ్చర్య పరిచింది.తెర వెనుక ఏం జరిగిందా అని కొంత మంది ఆరా తీస్తే అసలు విషయం బయట పడింది. అదేమిటంటే.. భానుమతి అద్భుత నటి. బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. అయితే ఆమెకు మాట దూకుడెక్కువ. ఒక రోజు మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో ఘంటసాల పాట పాడుకుంటూ ప్రాక్టీసు చేస్తున్నారు. భానుమతి ఊరుకోకుండా ఘంటసాల గారూ.. ఇది భరణి ఆఫీస్‌. మీరు విజయా వారికి పాడినట్లు పాడితే ఇక్కడ కుదరదు. విజయా సంస్థ కంటే మా సంస్థ గొప్పది. వరస మార్చండి. గొంతు మార్చి పాడండి.. అన్నారట. దాంతో ఘంటసాలకు కోపం వచ్చి, అయితే మీకు నచ్చే విధంగా వేరే వాళ్ళతో పాడించుకోండి.. అనేసి కోపంగా వెళ్ళిపోయారట. అప్పుడు చక్రపాణి చిత్రంలో ఏ.ఎం.రాజాతో పాటలు పాడించారు భానుమతి. మరి విప్ర నారాయణ చిత్రంలో ఘంటసాల ఎందుకు పాడలేదు? సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుకు, ఘంటసాలకు మధ్య ఆ రోజుల్లో చిన్నపాటి మనస్పర్థలు ఉండేవి. ప్రారంభంలో విజయా సంస్థ నిర్మించిన నాలుగు చిత్రాలకు ఘంటసాల సంగీత దర్శకత్వం వహించారు. కానీ, ఐదో చిత్రం మిస్సమ్మకు ఆయన పని చేయలేదు. ఆ చిత్ర దర్శకుడు ఎల్వీ ప్రసాద్‌ మాత్రం సాలూరి రాజేశ్వరరావు కావాలని కోరుకోవడంతో నిర్మాతలు కాదనలేక పోయారు. ఆ కోపంతో మిస్సమ్మలో ఘంటసాల పాటలు పాడలేదు. విప్ర నారాయణ చిత్రానికి కూడా సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. ఇటు భానుమతి, అటు రాజేశ్వరరావు ఇద్దరూ విప్ర నారాయణ చిత్రంలో ఉండడంతో ఘంటసాల ఆ చిత్రానికి దూరంగా ఉన్నారు. భరణీ సంస్థ ఆ తరువాత 1956లో తీసిన చింతామణి చిత్రంలో ఘంటసాల పాడారు. అయితే ఆయన పాడింది పాటలు కాదు.. పద్యాలు, శ్లోకాలు మాత్రమే కావడం గమనార్హం.