Fashion

స్కిజ్జోఫ్రీనీయా లక్షణాలు ఇలా ఉంటాయి

స్కిజ్జోఫ్రీనీయా లక్షణాలు ఇలా ఉంటాయి

మా అక్క కూతురికి పద్దెనిమిదేళ్లు. ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తోంది. అర్ధరాత్రి లేచి చంపొద్దని అరుస్తోంది. ఎవరో తనను చచ్చిపొమ్మని చెవిలో చెబుతున్నారంటోంది. సరిగ్గా తినడంలేదు, చదవడం లేదు. బరువు బాగా తగ్గిపోయింది. భయమేస్తోంది. ఇలా ఎందుకయ్యిందో, మేమేం చేయాలో చెప్పండి? —ఓ సోదరి, హైదరాబాద్‌

మీరు చెబుతున్న లక్షణాలు ‘స్కిజోఫ్రెనియా’లో కనిపిస్తాయి. వీటికితోడు అనుమానాలు, అసందర్భంగా మాట్లాడటం లాంటివీ ఉంటాయి. కళ్ల ముందు ఏదో ఉన్నట్లు, తమ ఆలోచనలు అందరికీ తెలుస్తున్నట్లు, ఎవరో చంపబోతున్నట్లు ఫీలవుతారు. వీటిని ‘డెల్యూషన్స్‌’ అంటారు. చెవిలో మాటలు వినిపించడాన్ని ‘హాలుసినేషన్స్‌’ అంటారు. ఇది తీవ్ర మానసిక వ్యాధి. వెంటనే సైకియాట్రిస్టుకి చూపించండి. లేదంటే చెవిలో మాటలు వినిపిస్తున్నాయని భయపడి తనకు తాను హాని చేసుకోవచ్చు లేదా ఇతరులకు చేయొచ్చు. నిద్రపట్టక, తిండి తినక ఆరోగ్యం పాడయ్యే అవకాశముంది. తక్షణం డాక్టర్‌కి చూపిస్తే అది స్కిజోఫ్రెనియానో కాదో నిర్ధరించి అవసరమైన మందులు ఇస్తారు. ఇందుకు ఏడాది పాటు మందులు వాడాల్సి రావచ్చు. రక్తసంబంధీకుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నట్లయితే ఇంకొంత ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది.