* కరోనా కల్లోల పరిస్థితుల్లో ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ నెట్ వర్క్‌ను వినియోగించే అల్ప ఆదాయవర్గాలైన 5.5కోట్ల మందికి రూ.49 రీఛార్జ్‌ను ప్యాక్‌ను ఒకసారి ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమవంతు సాయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతేకాదు, రూ.79తో రీఛార్జ్‌తో రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చని వివరించింది. తాజా నిర్ణయం విలువ రూ.270 కోట్లని ఎయిర్‌టెల్ తెలిపింది.
* దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టనుంది. ఈ సంస్థ నుంచి వచ్చే ఏడాది ఓ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం రానుందని హీరో మోటోకార్ప్ సీఎఫ్‌వో నిరంజన్ గుప్తా వెల్లడించారు. సొంత టెక్నాలజీతో ఈ వాహనం తీసుకొచ్చేందుకు రాజస్థాన్, జర్మనీలో ఉన్న తన ఆర్‌అండ్‌డీ విభాగాల సేవలను వినియోగించుకుంటోంది. అదే సమయంలో బ్యాటరీ స్వాపింగ్ (బ్యాటరీ ఇచ్చి ఛార్జైన బ్యాటరీ తీసుకోవడం) వేదికను దేశంలోకి తీసుకొచ్చేందుకు తైవాన్‌కు చెందిన గొగోర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. హీరో బ్రాండ్ పేరుమీద వాహనాలు తీసుకొచ్చేందుకు ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కూడా కుదిరింది.
* విద్యుత్ వాహనాల ధర ఎక్కువగా ఉండడానికి బ్యాటరీ కూడా కారణం. అయితే కంపెనీలు బ్యాటరీ వ్యయాలు తగ్గించుకోవడం ద్వారా ధరలను కిందకు తీసుకురావాలని సూచిస్తున్నాయి. అందులో ఒకటి సాలిడ్ స్టేట్ బ్యాటరీలను వినియోగించడం. అయితే వాటి నుంచి విద్యుత్‌ను రాబట్టుకునే క్లిష్ట ప్రక్రియకు సాంకేతికత ఎంత వరకు సహాయం చేస్తుంది; అవి ఎపుడు అందుబాటులోకి వస్తాయన్నది అసలు ప్రశ్నలు.సాలిడ్ స్టేట్ బ్యాటరీలంటే….ఇప్పటిదాకా వినియోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీల్లో ద్రవరూప ఎలక్ట్రోలైట్‌ను వినియోగిస్తున్నాయి. వాటి స్థానంలో ఘనరూపంలో అయాన్-కండక్టింగ్ మెటీరియల్‌ను వాడి తయారుచేసేవా సాలిడ్ స్టేట్ బ్యాటరీలు. ఏమిటి ఉపయోగం..: ద్రవరూప బ్యాటరీలతో పోలిస్తే వీటిలో ఎక్కువ విద్యుత్‌ను నిల్వ ఉంచవచ్చు. అపుడు బ్యాటరీ పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు. దాంతో కారు బరువు తగ్గి మైలేజీ ఎక్కువ ఇస్తుంది. కారులో స్థలం కూడా పెరుగుతుంది. లేదంటే అదే పరిమాణంతో ఎక్కువ దూరం వెళ్లే మోడళ్లను సిద్ధం చేసుకోవచ్చు. అన్నిటికీ మించి కిలోవాట్ అవర్‌కు అయ్యే ఖర్చు తగ్గుతుంది. తాజాగా ఫోర్డ్, బీఎమ్‌డబ్ల్యూ వంటి కంపెనీలు ‘సాలిడ్ పవర్’ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది ఈ బ్యాటరీలను పొందడానికే.
* అసలే కష్టకాలం.. కరోనా మహమ్మారి దెబ్బకు కోట్లాది కుటుంబాలు కకావికలమవుతున్న కాలం..ఇలాంటి ఆపత్కకర సమయంలోనూ కరోనా బాధితులపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మోత మోగుతూనే ఉంది. కొవిడ్ రోగులకు ఉపయోగపడేవి, చికిత్సలో వాడే మందులు, పరికరాలు అన్నింటిపైనా 6 నుంచి 18 శాతం దాకా జీఎస్టీ భారం పడుతోంది. కరోనాతో ఆస్పత్రుల్లో చేరిన వారికి వైద్యంతో పాటు జీఎస్టీ రూపేణా పడే భారం అదనంగా 15 శాతం దాకా ఉంటోంది. రెమ్‌డెసివిర్, మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు, సంబంధిత పరికరాలపై 12 శాతం జీఎస్టీ అమల్లో ఉంది. అత్యధిక ఔషధాలపై 12 నుంచి 18 శాతం భారం పడుతోంది. మాస్క్‌లు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు, పీపీపీ కిట్లు సహా అన్నింటిపైనా ఈ బాదుడు కొనసాగుతోంది. వినియోగం భారీగా ఉంటున్న నేపథ్యంలో వీటిపై జీఎస్టీని తగ్గించాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రానికి విన్నవించాయి. అది సత్వరం స్పందిస్తే బాధితులకు కొంతయినా ఊరట కలుగుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కొవిడ్ టెస్టింగ్ కిట్‌లు, ఫేస్, సర్జికల్ మాస్క్‌లు, వెంటిలేటర్లు, కృత్రిమశ్వాస పరికరాలపై కస్టమ్స్ డ్యూటీని కేంద్ర సర్కారు ఇటీవల రద్దుచేసింది. మిగతా వాటిపై జీఎస్టీ కొనసాగుతోంది.
* దేశంలో మరోసారి పెట్రో మోత మోగింది. ఒకరోజు విరామం తర్వాత చమురు ధరలను పెంచుతూ ఆదివారం విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటరు పెట్రోల్‌పై 24పైసలు, లీటరు డీజిల్‌పై 27పైసలను పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 92.58, డీజిల్ ధర రూ. 83.22కు చేరాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.22, డీజిల్ రూ.90.73గా ఉన్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిన విషయం తెలిసిందే. ఇక ముంబయిలో త్వరలోనే సెంచరీ కొట్టే దిశగా సాగుతున్నాయి. ఇంధన ధరల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటాయే అధికంగా ఉండడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్ను కింద లీటర్ పెట్రోల్‌పై రూ.32.90, డీజిల్‌పై రూ.31.80 వసూలు చేస్తోంది.