రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా మహమ్మారి కొత్త రూపాలు సంతరించుకుంటోంది. దీంతో పాటే వైరస్ బారిన పడిన వారిలో లక్షణాలు కూడా మారుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటివరకు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, జలుబు, వాసన గుర్తించలేకపోవడం, రుచి తెలియకపోవడంతో పాటు కొందరిలో కళ్లు ఎర్రబారడాన్ని కూడా కరోనా లక్షణాలుగా పరిగణించారు. వీటిలో ఏ ఒక్క లక్షణం కనిపించినా వెంటనే నిర్ధారణ పరీక్షలకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, కొత్త రకాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కొంత మందిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల కొంత మందిలో నోరు ఎండిపోవడం, నాలుక దురదగా అనిపించడం, నాలుకపై గాయాలు కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు తెలిపారు. దీన్నే ఇప్పుడు ‘కొవిడ్ టంగ్’గా పేర్కొంటున్నారు. ఈ లక్షణాలు కనిపించిన వారిలో నీరసం, విపరీతమైన అలసట కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ లక్షణాలతో వైద్యులను సంప్రదించిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రెండు లక్షణాలు కనిపించేవారు వెంటనే అప్రమత్తం కావడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ కొత్త లక్షణాలకు గల కారణాలేమిటి అన్నది ఇంకా కనిపెట్టాల్సి ఉంది. అయితే, కొత్త కరోనా రకాల వల్లే ఈ కొత్త లక్షణాలు కనిపిస్తూ ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా లోతైన అధ్యయనం జరగాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. వైరస్ రకాల జన్యుక్రమాల్ని మరింత క్షుణ్నంగా అధ్యయనం చేసి వాటి పనితీరును మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. కొవిడ్ టంగ్ ఉన్న వారిలో తొలుత నాలుకపై మంట పుట్టడం, దురదగా అనిపించడం, స్వల్ప నొప్పి, పూర్తిగా ఎండిపోవడం, కొన్ని కేసుల్లో స్వల్ప గాయాలు కనిపించడం దశలవారీగా జరుగుతాయని వైద్య నిపుణులు తెలిపారు. తర్వాత జ్వరం లేకుండానే నీరసంగా అనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ లక్షణాలు కనిపించిన వారు కూడా వెంటనే నిర్ధారణ పరీక్షలకు వెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
నాలుకపై పుండ్లు…కోవిద్ కొత్త లక్షణం
Related tags :