తన భర్తకు ప్రాణహాని ఉందని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు భార్య రమ ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి మంగళగిరి తీసుకెళ్లిపోయారని, శుక్రవారం రాత్రంతా నానా ఇబ్బందులకు గురి చేశారని ఆమె ఆరోపించారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించాలని కోర్టు చెప్పినా వినకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారని అన్నారు. తన భర్తకు ఏది జరిగినా దానికి ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, సీఐడీ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. గుంటూరు జైలులో ఉన్న ఎంపీ రఘురామ కృష్ణరాజును తక్షణం రమేశ్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయన ఆయన శరీరంపై గాయాలకు సంబంధించి వైద్య నివేదిక జిల్లా కోర్టు నుంచి ప్రత్యేక మెసెంజర్లో అందిన తర్వాత ఇవాళ సాయంత్రం హైకోర్టు విచారణ చేపట్టింది. మెడికల్ బోర్డుతోపాటు రమేశ్ ఆస్పత్రి వైద్యులు గాయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించినప్పటికీ పట్టించుకోలేదని రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. కస్టడీలో ఉండగా సీఐడీ అధికారి పిటిషనర్‌ను కలిశారని, ఇది చట్టవిరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రిమాండ్ విధిస్తూ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తక్షణమే రఘురామను రమేశ్ ఆస్పత్రికి పంపాలని ఆదేశించింది. మరోవైపు రఘురామకృష్ణరాజును పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య జిల్లా జైలుకు తరలించారు. ఎవరూ ఊహించని విధంగా గుంటూరు జీజీహెచ్ వెనక గేటు నుంచి ఆయన్ను జైలుకు తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై సీఐడీ పోలీసులు రఘురామను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
రఘురామ భార్య రమ ఆందోళన

Related tags :