Business

పెరిగిన బంగారం ధర-వాణిజ్యం

Business News - Gold Price Rise In India

* అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజులో మరింత జోరందుకున్నాయి. చివరకు సెన్సెక్స్‌ 848 పాయింట్లు లాభపడి 49,580 వద్ద ముగియగా.. నిఫ్టీ 245 పాయింట్లు ఎగబాకి 14,923 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 49,628 వద్ద, నిఫ్టీ 14,938 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.22 వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లకు చైనా పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకోవడం వంటి సానుకూల పరిణామాలు తోడవ్వడంతో నేడు లాభాల్లో పయనించాయి. ఇక దేశీయంగా వరుసగా నాలుగో రోజు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, ఈరోజు పాజిటివ్‌ కేసులు మూడు లక్షలకు దిగువకు రావడం మదుపర్ల సెంటిమెంటును పెంచింది. అలాగే అపోలోలో వ్యాక్సినేషన్ ప్రారంభం కావడం, డీఆర్‌డీఓ 2డీజీ అనే కరోనా ఔషధాన్ని విడుదల చేయడం, రెండో విడత స్పుత్నిక్‌-వి టీకాలు భారత్‌కు చేరడం, కొత్త వేరియంట్లపైనా కొవాగ్జిన్‌ సమర్థంగా పనిచేస్తుందన్న వార్తలు సూచీల సెంటిమెంటును బలపర్చాయి. అలాగే గత వారం వరుస నష్టాల నేపథ్యంలో బ్యాంకింగ్‌, ఆర్థిక వంటి కీలక రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. అలాగే రూపాయి మారకం విలువ సైతం బలపడింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు లాభాల జోరు చూపించాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ లాభాల్లో ముగియగా.. భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, నెస్లే ఇండియా, సన్‌ ఫార్మా, మారుతీ, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.

* కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తున్నప్పటికీ.. కొన్ని రంగాలు మాత్రం తమ సేవల్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నాయి. అందులో బ్యాంకింగ్‌ రంగం ఒకటి. బ్యాంకు ఉద్యోగులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా ఉద్యోగులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ‘అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య’ ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగరాజన్‌ తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు ఫ్రంట్‌లైన్ వర్కర్లని.. వారిని మహమ్మారి కబళిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

* కరోనా కారణంగా అక్షయ తృతీయ వేళ పసిడి అమ్మకాలు వెలవెలబోయిన సంగతి తెలిసిందే. కాగా, దేశీయంగా పసిడి ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో సోమవారం 10 గ్రాముల బంగార ధర రూ.348 పెరిగి రూ.47,547కు చేరింది. అంతర్జాతీయంగా పసిడి డిమాండ్‌ పెరగడమే ఈ పెరుగుదలకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌ సీనియర్‌ విశ్లేషకుడు తపన్‌ పటేల్‌ అభిప్రాయపడ్డారు.

* క్రిప్టో క‌రెన్సీ దిగ్గ‌జం బిట్ కాయిన్ అమ్మ‌కాల ఒత్తిడికి గుర‌వుతున్న‌ది. ఇంత‌కుముందు బిట్ కాయిన్ల ద్వారా త‌మ కార్ల క్ర‌య విక్ర‌యాల‌ను అనుమ‌తిస్తామ‌ని గ్లోబ‌ల్ ఎల‌క్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్ ప్ర‌క‌టించారు. భారీగా బిట్ కాయిన్లు కొనుగోలు చేశామ‌ని ప్ర‌క‌టించ‌డంతో దాని విలువ పైపైకి దూసుకెళ్లింది. కానీ ఎల‌న్ మ‌స్క్ యూ-ట‌ర్న్ తీసుకున్నారు.ఈ వారంలోగా కొన్ని బిట్ కాయిన్ల‌ను విక్ర‌యిస్తామ‌ని, ఇప్ప‌టికే కొన్ని బిట్ కాయిన్లు అమ్మేశామ‌ని ఎల‌న్ మ‌స్క్ ప్ర‌క‌టించారు. దీంతో సోమ‌వారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో ఇన్వెస్ట‌ర్లు క్రిప్టో క‌రెన్సీల‌ను విక్ర‌యించడానికి తెగ‌బ‌డ్డారు.ఎల‌న్‌మ‌స్క్ దెబ్బ‌.. ఒత్తిళ్ల‌లో బిట్ కాయిన్‌: 3 నెల‌ల దిగువ‌కు క్రిప్టో! ఫ‌లితంగా బిట్ కాయిన్ విలువ సోమ‌వారం తొమ్మిది శాతానికి పైగా ప‌త‌న‌మైంది. దాని విలువ 42,185 డాల‌ర్ల‌కు ప‌డిపోయింది. ఫిబ్ర‌వ‌రి ఎనిమిదో తేదీ త‌ర్వాత బిట్ కాయిన్ అతి క‌నిష్ఠ స్థాయి ఇదే.ఎథిరియం విలువ 8 శాతం ప‌డిపోయి 3,227.22 డాల‌ర్ల‌కు ప‌త‌న‌మైంది. మ‌రో డోజ్ కాయిన్ విలువ సుమారు ఏడు శాతం ప‌డిపోయింది. డోజ్ కాయిన్ విలువ 0.48 డాల‌ర్ల‌కు చేరువైంది.ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం త‌మ టెస్లా కార్ల కొనుగోళ్ల‌పై బిట్ కాయిన్ చెల్లింపుల‌ను నిలిపివేస్తామ‌ని ఎల‌న్ మ‌స్క్ ప్ర‌క‌టించారు. ఈ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధించుకున్న మ‌స్క్‌.. తాజాగా ఆదివారం త‌మ సంస్థ.. బిట్ కాయిన్ల‌ను విక్ర‌యించేస్తామ‌ని చెప్పారు.