DailyDose

ఆర్మీ ఆసుపత్రికి రఘురామరాజు తరలింపు-నేరవార్తలు

ఆర్మీ ఆసుపత్రికి రఘురామరాజు తరలింపు-నేరవార్తలు

* సుప్రీంకోర్టు ఆదేశాలతో గుంటూరు నుంచి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలిస్తున్న అధికారులు.

* పశ్చిమ్ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన నారదా స్టింగ్ ఆపరేషన్‌ కేసులో ఇద్దరు మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఈ రోజు అరెస్టు చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన  బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ‘నిబంధనలకు అనుగుణంగా వారి అరెస్టులు జరగలేదు. నన్ను కూడా అరెస్టు చేయండి’ అంటూ ఆమె అరెస్టులను తీవ్రంగా వ్యతిరేకించారు. సుమారు 45 నిమిషాల పాటు మమత సీబీఐ కార్యాలయం వద్ద ఉన్నారని ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు.  అలాగే కార్యాలయం వెలుపల తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే పలు అంశాల్లో కేంద్రం-దీదీ మధ్య ఢీ అంటే ఢీ వాతావరణం నెలకొని ఉండగా.. తాజా వ్యవహారం అందుకు ఆజ్యం పోసేలా కనిపిస్తోంది.

* నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బీహార్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఉదయం పెద్దకొత్తపల్లి వైపునుండి నాగర్ కర్నూలుకు వస్తుండగా కొల్లాపూర్ చౌరస్తా వద్ద ఆర్టిసి బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రగాయాలతో రక్తస్రావం జరిగి ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. గాయాలపాలైన బాధితుడిని నాగర్ కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స జరిపిస్తున్నారు. ఈ సంఘటనపై నాగర్ కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

* సంగం డెయిరీ స్వాధీనాన్ని రద్దు చేస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన ప్రభుత్వం. పిటిషన్‍ను విచారించిన డివిజనల్ బెంచ్. వేసవి సెలవుల అనంతరం విచారిద్దామని వాయిదా వేసిన ధర్మాసనం.

* ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ కృష్ణం రాజు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.కౌంటర్ దాఖలు చేసేందుకు మరోసారి గడువు కావాలంటూ జగన్, సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.దీంతో కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్, సీబీఐకి కోర్టు చివరి అవకాశం ఇస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.