Fashion

ఓవర్‌టైం చేస్తే గుండెపోటు వస్తుంది

ఓవర్‌టైం చేస్తే గుండెపోటు వస్తుంది

సాధారణ పనిగంటల కంటే అధికంగా పని చేసే ఉద్యోగుల్లో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం వెల్లడించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెలుగు చూశాయి. తాజాగా ఎన్విరాన్‌మెంట్‌ ఇంటర్నేషనల్‌ జర్నల్‌లో ఈ పరిశోధనకు సంబంధించిన పత్రాలు ప్రచురితమయ్యాయి. అందులో తెలిపిన వివరాల ప్రకారం.. వారానికి 55 గంటల కంటే ఎక్కువ పని గంటలు చేసిన ఉద్యోగుల్లో సుమారు 7 లక్షల 45వేలకు పైగా 2016లో గుండెపోటు, గుండెకు సంబంధించిన వ్యాధుల కారణంగా మరణించారన్నారు. ఇది గత పదేళ్లలో 30 శాతం పెరిగిందన్నారు. చైనా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ తరహా మరణాలు ఎక్కువగా ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ ముప్పునకు గురవుతున్న వారిలో 72 శాతం మంది నడివయసు పురుషులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్విరాన్‌మెంట్‌, వాతావరణ మార్పులు, ఆరోగ్య విభాగ అధిపతి మారియా నైరా తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. 2000 నుంచి 2016 వరకు 194 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించినట్లు వారు తెలిపారు. వారానికి 55 గంటల కంటే ఎక్కువ పనిచేసే వారిలో 35 శాతం ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశాలున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.