Food

చంటిపిల్లలను కరోనా నుండి రక్షించేది తల్లిపాలే!

చంటిపిల్లలను కరోనా నుండి రక్షించేది తల్లిపాలే!

కరోనా వచ్చిన తల్లి.. బిడ్డకు పాలు ఇవ్వవచ్చా? ఆ పాలు తాగితే వైరస్‌ సోకుతుందా? బాలింతలు టీకా తీసుకోవచ్చా? ఇవీ ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సందేహాలు. నేషనల్‌ నియోనాటల్‌ ఫోరం తెలంగాణ చాప్టర్‌ (ఎన్‌ఎన్‌ఎఫ్‌టీఎస్‌) ప్రతినిధులు, నిలోఫర్‌ వైద్య నిపుణులు ఈ ప్రశ్నలన్నింటికీ వివరంగా సమాధానమిచ్చారు. 12 ఏండ్లలోపు పిల్లల్లో వైరస్‌ ప్రభావం పెద్దగా ఉండదని, వాళ్లకు పొంచి ఉన్న ప్రమాదం తక్కువేనని చెప్పారు. పిల్లల్లో 8 నుంచి 10 శాతం పాజిటివిటీ ఉన్నప్పటికీ 0.6 శాతం మాత్రమే సివియారిటీ, ఒక శాతం లోపు మరణాల రేటు ఉన్నదని ఎన్‌ఎన్‌ఎఫ్‌టీఎస్‌ కార్యదర్శి, నిలోఫర్‌ దవాఖాన కొవిడ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ రమేశ్‌ దాంపురి వెల్లడించారు. నవజాత శిశువులపై కరోనా ప్రభావం, వారి సంరక్షణపై ఆదివారం జరిగిన జూమ్‌ మీటింగ్‌లో జాతీయ నియోనాటల్‌ ఫోరం తెలంగాణ చాప్టర్‌ ప్రతినిధులు నియోనాటలజిస్టు, ఎన్‌ఎన్‌ఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ శ్రీనివాస్‌ ముర్కి, డాక్టర్‌ రమేశ్‌దాంపురి, నిలోఫర్‌ దవాఖాన చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్‌ టీ ఉషారాణి, ఎన్‌ఎన్‌ఎఫ్‌ కోశాధికారి, రెయిన్‌బో హాస్పిటల్‌ చిన్నపిల్లల వైద్యనిపుణుడు డాక్టర్‌ డీ సురేందర్‌రావు, గాంధీ దవాఖాన గైనకాలజిస్టు డాక్టర్‌ విజయకృష్ణ తాటికుంట తదితరులు పాల్గొని పలు అంశాలపై చర్చించి తల్లిదండ్రులకు సూచనలు చేశారు.

*** బిడ్డకు పాజిటివ్‌ తల్లి పాలు పట్టవచ్చా?
తల్లిపాలతో శిశువులకు వైరస్‌ సోకదు. తల్లికి పాజిటివ్‌ వచ్చినా బిడ్డకు పాలు పట్టవచ్చు. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు పట్టాలి. తల్లి అసింప్టమాటిక్‌గా ఉన్న లేదా స్వల్ప లక్షణాలున్నా నేరుగా పాలు పట్టవచ్చు. అయితే ఆ సమయంలో తల్లి సరైన రీతిలో మాస్కు ధరించాలి. కరోనా వల్ల తల్లి దవాఖానలో చికిత్స పొందుతుంటే తల్లిపాలు పిండి కప్పుతో పట్టాలి.

*** శిశువులకు పాజిటివ్‌ వస్తే చికిత్స ఎలా?
కరోనా సోకిన శిశువులకుగానీ, పిల్లలకుగానీ ప్రత్యేక చికిత్స లేదు. శిశువుకు తల్లిపాలే పెద్ద మందు. దానిని మించిన ఔషదం లేదు. తల్లిపాలతో బిడ్డలో రోగనిరోధక శక్తి పెరిగి వైరస్‌ దానంతట అదే చనిపోతుంది. పిల్లల్లో 80 శాతం అసింప్టమాటిక్‌ ఉంటుంది. చాలా తక్కువ మంది పిల్లల్లో మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. సివియారిటీ కూడా చాలా తక్కువ. మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉంది. జ్వరం, దగ్గు వంటి లక్షణాలుంటే సాధారణంగా పారాసిటమాల్‌ సిరప్‌, డీ-3 డ్రాప్స్‌ వంటివే ఇస్తాం. సాధారణంగా పాజిటివ్‌ వచ్చిన 5రోజుల తరువాత వైరస్‌ ధ్వంసమైపోతుంది. 5 రోజులు గడిచినప్పటికీ శిశువుల్లో న్యుమోనియా, శ్వాస సమస్యలు వంటివి ఉంటే నిలోఫర్‌, గాంధీతో పాటు పలు ప్రైవేటు దవాఖానల్లో చికిత్స అందుబాటులో ఉంది.

*** పాలిచ్చే తల్లులు టీకా తీసుకోవచ్చా?
గర్భిణులు టీకా తీసుకోరాదు. కానీ, ప్రసవం తర్వాత తీసుకోవచ్చు. బాలింతలు టీకా తీసుకొంటే ఎలాంటి ప్రమాదం లేదు. పాలిచ్చే తల్లులు టీకా తీసుకోవటం వల్ల తల్లితోపాటు బిడ్డలో ప్రతిరక్షకాలు పెరుగుతాయి.

*** నవజాత శిశువుల్లో కరోనా లక్షణాలు ఎలా ఉంటాయి?
80శాతం మంది శిశువుల్లోగానీ, 12లోపు పిల్లల్లోగానీ లక్షణాలు ఉండవు. ప్రీమెచూరిటీ, బరువు తక్కువ వంటి సమస్యలే నవజాత శిశువుల్లో అధికంగా ఉంటున్నాయి. బిడ్డ పాలు తాగకపోవడం, ఏడవకపోవడం, డల్‌గా ఉండటం, శరీరం సాధారణ ఉష్ణోగ్రత కంటే చల్లగా మారడం, ఫిట్స్‌ రావడం, పాదాలు, చేతులు నీలి రంగులోకి మారడం, శ్వాస ఎక్కువసార్లు తీసుకోవడం వంటి లక్షణాలుంటే శిశువు పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్నట్లు పరిగణించి వెంటనే దవాఖానలో చేర్పించాలి.

*** పాజిటివ్‌ వచ్చిన తల్లి వద్ద బిడ్డను ఉంచవచ్చా?
పాజిటివ్‌ వచ్చిన తల్లికి స్వల్ప లక్షణాలు లేదా అసింప్టమాటిక్‌ అయితే తల్లివద్ద బిడ్డను ఉంచవ చ్చు. కానీ, జాగ్రత్తలు పాటించా లి. బిడ్డను తాకే ముందు చేతులు శుభ్రం చేసుకొని శానిటైజ్‌ చేసుకోవాలి. బిడ్డకు రెండు మీటర్ల దూ రంలో ఉండాలి. తప్పనిసరిగా మాస్కు ధరించాలి. పాలు పట్టే సమయంలో మాత్రమే బిడ్డను తగిన జాగ్రత్తలతో తాకాలి.

*** పాజిటివ్‌ తల్లులు పాటించాల్సిన ఆహార నియమాలు
పౌష్టికాహారం తీసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు, తీసుకోవాలి. గర్భంతో ఉన్నప్పటికంటే ప్రతి పూట ఎక్కువ ఆహారం తీసుకోవాలి.

*** పిల్లలకు వైరస్‌ సోకకుండా ఉండాలంటే?
సాధారణంగా బిడ్డ పుట్టగానే బంధువులు, కుటుంబసభ్యులు శిశువును చూడటానికి వస్తుంటారు. ఈ కరోనా సమయంలో అది చాలా ప్రమాదకరం. ఇలాంటి చర్యల వల్ల శిశువుకు లేదా తల్లికి వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుంది. సాధ్యమైనంత వరకు తల్లీబిడ్డను ఐసొలేషన్‌లో ఉంచాలి. వారి వద్దకు ఇతరులు ఎవ్వరూ వెళ్లకూడదు. వెళ్లే వారు కరోనా నియమాలు పాటిస్తూ వెళ్లాలి.