Devotional

మూడురోజుల్లో కాణిపాక వినాయకునికి స్వర్ణరథం-తాజావార్తలు

News Roundup - Gold Chariott Ready For Kanipaka Vinayaka

* స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి స్వర్ణ రథం సిద్ధమైంది. స్వర్ణరథం నిర్మాణం చేపట్టాలని 2005లో అప్పటి పాలకమండలి నిర్ణయం తీసుకుంది. భక్తుల నుంచి వచ్చిన విరాళాలతో నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణ బాధ్యతలను తితిదేకి అప్పగించారు. రూ.9 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకొని ఎట్టకేలకు మరో 10 రోజుల్లో స్వామివారి ఆలయానికి చేరుకోనుంది. నిర్మాణానికి అవసరమైన 15 కిలోల బంగారాన్ని తితిదే సమకూర్చడంతో పాటు, నిర్మాణ బాధ్యతలను తీసుకొంది. ఈ క్రమంలో ఆలయంలో ఉన్న చెక్క రథాన్ని గత ఏడాది అక్టోబరులో స్వర్ణ రథం నిర్మాణం కోసం తిరుపతికి తితిదే అధికారులు తరలించారు. అప్పటి నుంచి రథం నిర్మాణ పనులు వేగవంతంగా జరిగాయి. ఈ నేపథ్యంలో నిర్మాణం పూర్తి చేసుకొని రథం విడిభాగాలు మరో మూడు రోజుల్లో కాణిపాకం రానున్నాయి. ఇందుకు ఏర్పాట్లను ఆలయ ఇంజినీరింగ్‌శాఖ అధికారులు చేస్తున్నారు. పెరిగిన అంచనాలు.. 2010 సంవత్సరంలో స్వర్ణరథం కోసం రూ.కోటిని తితిదేకు జమ చేశారు. ఆ తరువాత 2019లో మరోమారు రూ.5 కోట్లు ఇచ్చారు. పెరుగుతున్న బంగారం ధరలతో రథం నిర్మాణ అంచనాలు పెరిగాయి. ధరలు స్థిరీకరణ లేకపోవడంతో మరో రూ.3 కోట్లు తితిదేకి జమ చేశారు. గత పాలకమండలి తితిదే అధికారులను కలసి స్వర్ణరథం నిర్మాణం చేపట్టాలని మరోమారు విజ్ఞప్తి చేసింది. మొత్తంగా రథం నిర్మాణం పూర్తి కావడానికి రూ.9 కోట్లు ఖర్చు చేశారు. భద్రపరిచేందుకు ప్రత్యేక మండపం.. తిరుపతి నుంచి మూడు రోజుల్లో రథం విడిభాగాలను కాణిపాకం తీసుకురానున్నారు. ఇక్కడి వాటిని రథంగా అమర్చనున్నారు. దాన్ని భద్రపరిచేందుకు ఇటీవల రూ.9 లక్షలతో ప్రత్యేక మండపాన్ని నిర్మించారు.

* మెక్సికో అందం ఆండ్రియా మెజా (26) మిస్‌ యూనివర్స్‌-2021 కిరీటాన్ని దక్కించుకుంది. ఫ్లోరిడాలో జరిగిన 69వ మిస్ యూనివర్స్ పోటీల ఫైనల్లో గెలుపొంది విశ్వ సుందరి కిరీటం సొంతం చేసుకుంది. 73 మందిని దాటుకుని మెజా టైటిల్ గెలుచుకుంది. మిస్ యూనివర్స్ కిరీటాన్ని చేజిక్కించుకున్న మూడో మెక్సికన్‌గా నిలిచింది. మన ప్రవర్తన కూడా మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది. మిమ్మల్ని ఎవరు తక్కువగా చూసినా ఒప్పుకోవద్దు అంటూ మెజా చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను మెప్పించింది.

* వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు నుంచి సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గుంటూరు జిల్లా జైలు వద్దకు పోలీసులు చేరుకొని ప్రత్యేక వాహనాలను సిద్ధం చేశారు. కొద్ది సేపటి క్రితమే ఆయన్ను గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్‌కు రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ దగ్గర ఉండి పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సీఎస్‌కు ఈ-మెయిల్‌ ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలు అందాయి. దీంతో రఘురామను రోడ్డు మార్గం ద్వారా సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఎంపీ రఘురామకృష్ణ రాజు కారెక్కుతూ మీడియాకు అభివాదం చేశారు.

* కరోనా కారణంగా అక్షయ తృతీయ వేళ పసిడి అమ్మకాలు వెలవెలబోయిన సంగతి తెలిసిందే. కాగా, దేశీయంగా పసిడి ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో సోమవారం 10 గ్రాముల బంగార ధర రూ.348 పెరిగి రూ.47,547కు చేరింది. అంతర్జాతీయంగా పసిడి డిమాండ్‌ పెరగడమే ఈ పెరుగుదలకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌ సీనియర్‌ విశ్లేషకుడు తపన్‌ పటేల్‌ అభిప్రాయపడ్డారు.

* ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో తమపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేయడంపై టీవీ5 ఛానల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రఘురామ విద్వేష ప్రసంగాలను ప్రసారం చేశామంటూ తమపై సీఐడీ అధికారులు కేసు పెట్టారని.. ఉద్దేశపూర్వకంగానే తమ ఛానల్‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని టీవీ5 తన పిటిషన్‌లో పేర్కొంది. సంస్థ, ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఛానల్‌ అభ్యర్థించింది. సీఐడీ దర్యాప్తుపై స్టే విధించాలని టీవీ 5 యాజమాన్యం సుప్రీంకోర్టును కోరింది.

* దేశంలో కరోనా విజృంభణ నెమ్మదిగా తగ్గుతోంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే అధికంగా 1.01లక్షల మంది కరోనా నుంచి కోలుకోవడం ద్వారా యాక్టివ్‌ కేసుల సంఖ్య 35,16,997కు తగ్గిందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూని ఈ నెలాఖరు వరకూ పొడిగించారు. కొవిడ్‌తో అనాథలైన పిల్లలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. పిల్లల పేరిట రూ.10లక్షలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయనున్నట్లు ప్రకటించింది.

* అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను తీరంవైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు ముంబయి నగరాన్ని వణికిస్తున్నాయి. సముద్ర అలలు పెద్ద ఎత్తున దూసుకొస్తున్నాయి. దీంతో పలువురు తుపాను తీవ్రతను తెలుపుతూ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అవి తౌక్టే బీభత్సాన్ని కళ్లకు కడుతున్నాయి. గుజరాత్‌లోని భావనగర్‌లో సోమవారం అర్ధరాత్రి ఈ తుపాను తీరం దాటనుంది.

* దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం దాదాపు 3 లక్షలకుపైగా కేసులు.. 4 వేలకుపైగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే ఎంతోమంది తమిళ సినీ ప్రముఖులు తమవంతు సాయంగా కొవిడ్‌పై పోరాటానికి విరాళం అందజేసిన విషయం తెలిసిందే.

* కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తున్నప్పటికీ.. కొన్ని రంగాలు మాత్రం తమ సేవల్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నాయి. అందులో బ్యాంకింగ్‌ రంగం ఒకటి. బ్యాంకు ఉద్యోగులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా ఉద్యోగులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ‘అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య’ ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగరాజన్‌ తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు ఫ్రంట్‌లైన్ వర్కర్లని.. వారిని మహమ్మారి కబళిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

* దేశంలో కరోనా విజృంభణ నెమ్మదిగా తగ్గుతోంది. గత ఐదు రోజులుగా నమోదవుతున్న కేసులు, రికవరీ అవుతున్న వారి గణాంకాలే ఇందుకు నిదర్శనం. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే అధికంగా 1.01లక్షల మంది కరోనా నుంచి కోలుకోవడం ద్వారా యాక్టివ్‌ కేసుల సంఖ్య 35,16,997కు తగ్గిందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇక 75.04శాతం కేసులు పది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్లు తెలిపింది.