టెక్సాస్‌లో ఉంటున్న ప్రవాస తెలుగు వ్యక్తి సునీల్ కె.ఆకుల (32)కు 56 నెలల జైలుశిక్ష, విడుదల తర్వాత మూడేళ్లపాటు పర్యవేక్షణ శిక్ష (పెరోల్) విధిస్తూ ఇక్కడి న్యాయస్థానం తీర్పు చెప్పింది. భార్యను అపహరించి, ఆమెను కొట్టడమే కాకుండా సాక్ష్యాలను తారుమారు చేయాలని చూశాడన్న అభియోగాలపై నిందితుడికి ఈ శిక్ష విధించారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత సునీల్ దేశం విడిచి వెళ్లాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. ఇతనిపై ఉన్న అభియోగాలు గతేడాది నవంబరులో రుజువయ్యాయి. ఫెడరల్ ప్రాసిక్యూటర్ల కథనం మేరకు.. తన నుంచి విడిగా ఉంటున్న భార్యను కలుసుకునేందుకు 2019 ఆగస్టు 6న సునీల్ టెక్సాస్‌లోని తన ఇంటి నుంచి మసాచుసెట్స్ రాష్ట్రంలోని అగావామ్ నగరానికి బయలుదేరాడు. ఆమెను బలవంతంగా కారెక్కించుకొని మళ్లీ టెక్సాస్‌కు పయనమయ్యాడు. మార్గమధ్యంలో ఆమెను కొడుతూ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ఈ మెయిల్ పంపాలని బలవంతపెట్టాడు. ఆమె ల్యాప్‌టాప్ ధ్వంసం చేసి రోడ్డు మీదకు విసిరేశాడు. మధ్యలో టెనెసీ రాష్ట్రం నాక్స్ కౌంటీలో ఓ హోటలు దగ్గర ఆగినపుడు కూడా ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో స్థానిక పోలీసులు సునీల్‌ను అరెస్టు చేశారు. నిందితుడు కస్టడీలో ఉన్నపుడు ఇండియాలోని కుటుంబసభ్యులకు పదే పదే ఫోన్లు చేసి తన భార్య తండ్రిని కలిసి రాజీ ప్రయత్నాలు చేయడం ద్వారా ఆమె అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం ఉపసంహరించుకునేలా చేయాలని కోరినట్టు అధికారులు తెలిపారు.
https://www.justice.gov/usao-ma/pr/texas-man-sentenced-stalking-kidnapping-obstruction-justice-and-witness-tampering
టెక్సాస్ తెలుగు వ్యక్తి ఆకుల సునీల్‌కు జైలుశిక్ష
Related tags :