Movies

నేడు సిరివెన్నెల జన్మదినం

Sirivennela Seetaramasastry Birthday Special Story - May 20

35 ఏళ్ళ క్రితం విధాత తలపున ప్రభవించినది… అంటూ ఆయన రాసిన మొదటి పాటతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఎంత ప్రభంజనం సృష్టించారో… ఈనాటి సామజవరాగమనా పాటతో అంతే ఉర్రూతలు ఊగించారు. ధన మాయను (చిలక ఏ తోడు లేక) ఎంత చిన్న చిన్న పదాలలో పొదగగలరో దైవ మాయని (ఆదిభిక్షువు వాడినేమి అడిగేది) కూడా అంతే సులువుగా విడమరచి చెప్పగల ప్రజ్ఞాశాలి సిరివెన్నెల. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ సుస్థిర స్థానం ఏర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగులో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల. మీరు ఆయన పాటలకు అభిమాని కాకపోతే తెలుగు భాషకి అభిమానులు కానట్టే…సినీకవి అనే పదం ఈయనతోనే ఆఖరు అనుకుంటారు ఆయన అభిమానులు. త్రివిక్రమ్ గారి మాటల్లో మనమంతా అర్ధరాత్రి నిదురపోతుంటే ఆయన అక్షరాలపై దండయాత్రకి బయలుదేరతారు. ఆయన స్థాయికి సినీకవిగా మిగిలిపోవడం ఆయన దురదృష్టం అయితే ఆయన పాటలు వినే భాగ్యం కలగడం మన అదృష్టం.
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా, ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ అంటూ నిద్రపోతున్న సమాజాన్ని పాటల తూటాలతో చైతన్య పరచగలరు…
తెల్లారింది లెగండోయ్ కుకురుక్కో…మంచాలింక దిగండోయ్ అంటూ మనల్ని మేల్కొలపగలరు…
తెలవారదేమో స్వామి…నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలివేలు మంగకు అంటూ అన్నమాచార్య కీర్తన ఇది అనేలా శృంగారం ఒలికించగలరు…
ఈ వేళలో నీవు, చెప్పమ్మా చెప్పమ్మా అంటోంది ఆరాటం, మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది, కొంచెం కారంగా కొంచెం గారంగా, నువ్వు నువ్వు నువ్వే నువ్వు….అనే పాటలతో ఈయన నిజంగా అమ్మాయి మనసు లోతుల్ని చూసి వచ్చారా అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేయగలరు.
సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా అంటూ నిరాశా లోకంలో ఉన్నవారికి కొండంత బలం ఇవ్వగలరు.
స్వర్ణకమలం, స్వయంకృషి, శ్రుతిలయలు, నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చావ్, మనసంతా నువ్వే, శుభలగ్నం, శుభాకాంక్షలు, సింధూరం, ఖడ్గం, గమ్యం…ఇలా ఎన్నో సినిమాలలో ఆయన రాసిన ప్రతి పాట ఆణిముత్యమే…
తెలుగు సినీ పాటల ప్రపంచంలో నిస్సందేహంగా మకుటం లేని మహారాజు ఆయన. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు…❤️❤️??
సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీకవి, గీత రచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య ‘పద్మావతి’ని పేర్కొనే సీతారామశాస్త్రి తన గురువుగా శ్రీ ‘వై. సత్యారావు’ని చెబుతారు.
బాల్యం
శాస్త్రి విద్యాభ్యాసం పదవ తరగతి వరకు అనకాపల్లిలో జరిగింది. కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేసారు.ఆంధ్ర విశ్వకళా పరిషత్లో బి.ఎ పూర్తి చేసి ఎం.ఏ చేస్తుండగా ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడుకె.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. ఆ సినిమా పేరుతోనే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా ఆయన పేరు దర్శనమిచ్చింది. భారత దేశ పురస్కారం పద్మశ్రీ ఈయనను 2019 వరించింది.
కవిగా
300 పాటలతో ‘శివకావ్యం’ రచనలో నిమగ్నమయి ఉన్నారు.
నటుడిగా
ప్రముఖ తెలుగు, హిందీ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని… అని పాట పాడే ప్రభావశీలమయిన పాత్రలో తను వ్రాసి నటించగా, తను వ్రాసిన పాటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం లభించటం విశేషం.
పురస్కారాలు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
1986 – సిరివెన్నెల – విధాత తలఁపున…
1987 – శ్రుతిలయలు – తెలవారదేమో …
1988 – స్వర్ణకమలం – అందెల రవమిది…
1993 – గాయం – సురాజ్యమవలేని…
1994 – శుభలగ్నం – చిలకా ఏ తోడులేక…
1995 – శ్రీకారం – మనసు కాస్త కలత…
1997 – సింధూరం – అర్ధ శతాబ్దపు…
1999 – ప్రేమకథ – దేవుడు కరుణిస్తాడని…
2005 – చక్రం – జగమంత కుటుంబం నాది…
2008 – గమ్యం – ఎంతవరకూ ఎందుకొరకూ…
కళాసాగర్ పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
1986 – సిరివెన్నెల- విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
1992 – అంకురం – ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటోవైపు
1994 – శుభలగ్నం – చిలకా ఏ తోడులేక ఎటేపమ్మా ఒంటరి నడక
1995 – పెళ్ళి సందడి – హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా ప్రేమా
మనస్విని పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
1994 – శుభలగ్నం – చిలకా ఏ తోడులేక ఎటేపమ్మా ఒంటరి నడక
1995 – పెళ్ళి సందడి – హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమా ప్రేమా
1998 – మనసిచ్చి చూడు – బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ!
1999 – అల్లుడుగారు వచ్చారు – నోరార పిలిచినా పలకనివాడినా, మనసున మమతలున్న మనిషినికానా
కిన్నెర పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
1998 – మనసులో మాట – ఏరాగముంది మేలుకుని ఉండి లేవనంటుందా మనసుని పిలవగా
భరతముని పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
1992 – సిరివెన్నెల- విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
1996 – పవిత్రబంధం – అపురూపమైనదమ్మ ఆడజన్మ – ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ
1999 – భారతరత్న – మేరా భారత్ కో సలాం! ప్యారా భారత్ కో ప్రణాం!
అఫ్జా పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
1999 – భారతరత్న – పారా హుషార్ భాయీ భద్రం సుమా సిపాయీ
2000 – నువ్వు వస్తావని – పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి
వంశీ బర్ఖిలీ పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
2000 – నువ్వే కావాలి
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండెకోత పోల్చుకొందుకు
అనగనగా ఆకాశం వుంది – ఆకాశంలో మేఘం ఉంది
ఎక్కడ వున్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ ఇదేం అల్లరి
రసమయి పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా :
1988 – కళ్ళు – తెల్లారింది లెగండోయ్ కొక్క్కొరొక్కొ, మంచాలింక దింగండోయ్ కొక్క్కొరొక్కొ
బుల్లి తెర పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా :
1999 – తులసి దళం, టి.వి. సీరియల్ – హాయిగా వుంది, నిదురపో