NRI-NRT

ఇంగ్లాండ్‌లో లార్డ్ మేయర్‌గా తెలుగు వ్యక్తి

ఇంగ్లాండ్‌లో లార్డ్ మేయర్‌గా తెలుగు వ్యక్తి

స్టోక్‌ ఆన్‌ ట్రెంట్ ప్రథమ పౌరుడిగా ఎన్నికైన చంద్ర కన్నెగంటి..1975లో భారత్‌లో జన్మించారు. గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసిన చంద్ర..2002లో యూకేకి వచ్చారు. ఇక్కడ స్థిరపడిన అనంతరం కన్జర్వేటివ్ పార్టీ విధానాలు నచ్చడంతో 2009లో దానిలో చేరారు. వైద్యుడిగా సేవలు అందించే సమయంలో తన దగ్గరికి వచ్చిన రోగుల మాటల్లో వారి ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుసుకునేవారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వైద్య వృత్తిని ఎంచుకున్న ఆయన..ఓ వైద్యుడు రాజకీయ నాయకుడైతే మరింత సేవ చేయొచ్చని తలంచి, రాజకీయాల్లో చేరారు. అనంతరం పార్టీ కల్పించిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు. గోల్డెన్‌హిల్‌ అండ్‌ సాండీఫోర్డ్ ప్రాంతానికి చెందిన ఆయన 2019లో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2020లో డిప్యూటీ మేయర్‌గానూ సేవలు అందించిన ఆయన ప్రస్తుతం మేయర్‌ స్థాయికి ఎదిగారు. కరోనా మహమ్మారి ఉద్ధృతి వేళ..జనరల్‌ ప్రాక్టిషనర్‌గానూ ఆయన ప్రజలకు సేవలు అందించి మన్ననలు పొందారు. తాను చేసిన సేవలతో ఎన్‌హెచ్‌ఎస్‌ హీరోగా గుర్తింపుపొందారు. ఈ సందర్భంగా కన్నెగంటి మాట్లాడుతూ..‘లార్డ్‌ మేయర్‌ పదవికి ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది. స్టోక్ ఆన్‌ ట్రెంట్‌ను అద్భుతమైన ప్రదేశంగా నిలబెట్టేందుకు నేను సాధ్యమైనంత కృషి చేస్తాను. ఒక వైద్యుడిగా ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు మద్దతు ఇవ్వగలగాలి. దానికోసం ఈ మహమ్మారి కాలంలో అద్భుతంగా సేవలు అందించిన రెండు సంస్థలను ఎంచుకున్నాను’ అని తెలిపారు.